ఢిల్లీ రంజీ జట్టులో కోహ్లీ, పంత్‌

ఢిల్లీ రంజీ జట్టులో కోహ్లీ, పంత్‌– 84 మందితో ప్రాబబుల్స్‌ విడుదల
న్యూఢిల్లీ: టీమిండియా రన్‌ మెషిన్‌ విరాట్‌ కోహ్లీ, యువ వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ రంజీట్రోఫీలో ఆడనున్నారు. ఢిల్లీ డిస్ట్రిక్ట్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(డిడిసిఎ) బుధవారం ప్రకటించిన జట్టులో వీరిద్దరూ ప్రాబబుల్స్‌లో ఉన్నారు. ఢిల్లీ జట్టు తరపున రిలీజైన 84 మంది జాబితాలో ఆ ఇద్దరు బ్యాటర్ల పేర్లు కూడా ఉన్నాయి. నిజానికి రంజీ సీజన్‌లో ఇద్దరూ అందుబాటులో లేకున్నా.. ఆ ఇద్దర్ని మాత్రం ఢిల్లీ రంజీ జట్టు ప్రాబబుల్స్‌లో చోటు కల్పించారు.
సీనియర్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మకు ఆ లిస్టులో చోటు దక్కలేదు. మయాంక్‌ యాదవ్‌ ఆ ప్రాబబుల్స్‌ బృందంలో ఉన్నాడు. విరాట్‌ కోహ్లీ చివరిసారి 2012లో రంజీ ట్రోఫీ ఆడాడు. ఘజియాబాద్‌లో అతను యూపి జట్టుతో తలపడడ్డాడు. పంత్‌ కూడా చివరిసారి కోవిడ్‌కు ముందు రంజీల్లో ఆడాడు. ప్రోటోకాల్‌ ప్రకారం లిస్టును తయారు చేశామని, ఒకవేళ వాళ్లు కావాలంటే రంజీల్లో ఆడుకోవచ్చు అని ప్రాబబుల్స్‌లో పేర్లు పెట్టినట్లు డిడిసిఎ అధికారి తెలిపారు.