ముంబయి : మరో కొన్ని రోజుల వ్యవధిలోనే ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపధ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు శుభవార్త. ఆర్‌సీబీ కీలక ఆటగాడు విరాట్ కోహ్లి భారత్‌కు తిరిగొచ్చాడు. ముంబై విమానాశ్రయంలో విరాట్ కనిపించాడు. గత రెండు నెలలుగా కోహ్లి కుటుంబంతో కలిసి లండన్‌లో ఉన్నారు. ఐపీఎల్ 17వ ఎడిషన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. ఇంకా వారం రోజులు కూడా లేదు. మొదటి మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది. ఈ క్రమంలో తొలి మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లు ధోనీ, విరాట్ కోహ్లీ ముఖాముఖి తలపడనున్నారు. ఈ ఏడాది ఐపిఎల్ ప్రారంభానికి ముందే కింగ్ కోహ్లీ దేశానికి తిరిగి రావడంతో ఆర్‌సిబి అభిమానుల్లో ఆనందం నెలకొంది.
అలాగే ఈ ఐపీఎల్ సీజన్ విరాట్ కోహ్లీకి చాలా ప్రత్యేకమని చెప్పవచ్చు. ఈ సీజన్‌లో విరాట్ నుంచి మంచి ప్రదర్శన ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ ఏడాదిలో జరిగే టీ20 ప్రపంచ కప్ కోసం విరాట్ ఎంపిక కూడా ఈ ఐపిఎల్‌లో ప్రదర్శనపై ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది. 35 ఏండ్ల విరాట్ కోహ్లీ భారత్ తరఫున 117 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. వీటిలో ఒక సెంచరీ, 37 హాఫ్ సెంచరీలతో 4037 పరుగులు చేశాడు.