కోహ్లి అది నిజం కాదు!

– ఇన్‌స్టాగ్రామ్‌ ఆదాయంపై
న్యూఢిల్లీ : సోషల్‌ మీడియాలో పోస్ట్‌ల ద్వారా ఆదాయం ఆర్జిస్తున్న క్రీడాకారుల్లో భారత స్టార్‌ విరాట్‌ కోహ్లి ప్రపంచంలోనే మూడో స్థానంలో నిలిచాడని ఓ ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ సంస్థ ఓ నివేదికలో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ సంస్థ గణాంకాల ప్రకారం విరాట్‌ కోహ్లి ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రతి పోస్ట్‌కు రూ.11.45 కోట్లు ఆర్జిస్తున్నాడు. ఫుట్‌బాల్‌ సూపర్‌స్టార్స్‌ క్రిస్టియానో రొనాల్డో, లియోనల్‌ మెస్సి మాత్రమే విరాట్‌ కోహ్లి కంటే ముందున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా టాప్‌-25 జాబితాలో భారత్‌ నుంచి విరాట్‌ కోహ్లి ఒక్కడే చోటు దక్కించుకున్నాడు. అయితే, ఈ జాబితాపై విరాట్‌ కోహ్లి ట్విట్టర్‌ వేదికగా స్పందించాడు. ప్రతి పోస్ట్‌కు రూ.11.45 కోట్లు ఆర్జిస్తున్నాననే గణాంకాలు వాస్తవం కాదని వివరణ ఇచ్చాడు. ‘ నా జీవితంలో నేను పొందినవాటికి అందరికీ ఎంతో కృతజ్ఞుడిని. సోషల్‌ మీడియాలో నేను ఆర్జిస్తున్న ఆదాయంపై వస్తున్న వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదు’ అని విరాట్‌ కోహ్లి ట్వీట్‌ చేశాడు. వెస్టిండీస్‌తో టెస్టు, వన్డే సిరీస్‌ అనంతరం విశ్రాంతి తీసుకున్న విరాట్‌ కోహ్లి.. ఆసియా కప్‌ కోసం సన్నద్ధం అవుతున్నాడు.