కరీంనగర్ పేరు వినగానే మహాకవి డా.సినారెతో పాటు బహుభాషా వేత్తలు పి.వి. నరసింహారావు వంటి వందలాది మంది సాహితీవేత్తలు జ్ఞాపకం వస్తారు. తొలి నాళ్ళనుండి విరివిగా సాహిత్యం వచ్చింది… వస్తోంది. ఇక్కడి నుండి బాలల కోసం పనిచేస్తున్నవారు, రాస్తున్నవారు రాశిలో… వాసిలో వందలాది మంది మనకు కనిపిస్తారు. వారిలో తొంభయ్యవ దశకం నుండి బాలల కోసం చక్కని గేయాలు రాస్తున్న బాల సాహితీవేత్త కొక్కొండ శ్రీహరి. ఉద్యమాల నేల నుండి వచ్చి పిల్లల కోసం రచనలు చేస్తున్నారు. ఈయన కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి గ్రామంలో 20 మే, 1962న పుట్టారు. వీరి అమ్మానాన్నలు శ్రీమతి కొక్కొండ యశోద- శ్రీ రామచంద్రంలు. వీరు తెలుగు, ఆంగ్ల సాహిత్యాల్లో ఎం.ఎ., ఎం.కాం., బి.ఇడి., టి.పి.టి., విద్వాన్ అర్హతలు సాధించారు.
వృత్తిరీత్యా ఆంగ్లోపాధ్యాయులుగా పనిచేసిన శ్రీహరి పిల్లలకు ఆంగ్లాన్ని పాఠాలుగా బోధిస్తూనే ప్రవృత్తి రీత్యా బాలల కోసం చక్కని సాహిత్యాన్ని సృజన చేస్తున్నారు. పద్యం, గేయం, వచనం ఇలా అన్ని ప్రక్రియా రూపాల్లో రచనలు చేస్తున్న వీరు ‘శ్రీ స్వయంభూ రాజేశ్వర చరిత్ర’ పేరుతో కావ్యాన్ని రాశారు. ‘మా ఊరి కుంట’ వీరి పద్యశతకం. ఇందులో ‘ఇలను పేరుగన్న ఇందుర్తి మా ఊరు/ ఉద్యమాలు నాడు ఊపిరయ్యె/ శాంతి గ్రమ్మె నేడు సామరస్యము మీరి/ వినుడి కుంట చరిత విజ్ఞులార’ అని తన ఊరు గురించి గొప్పగా చెబుతారు కవి. ఇందులో కవి పల్లె గురించి చెప్పిన పద్యం ఎంత బాగుందో..! ‘పల్లె ముల్లెనిచ్చు పల్లె పిల్లల యిచ్చు / పల్లె తల్లినిచ్చు పల్లె పసిడి/ పల్లె నీటినిచ్చు పల్లె మంచిని నేర్పు/ వినుడి కుంట చరిత విజ్ఞులార!’ నిజం కదూ!
ఇవే కాకుండా పోటీ పరీక్షలు, పిల్లలు, పెద్దల ఉపయోగపడే ‘క్వశ్చన్స్ ఫర్ ఆల్’ను రూపొందించారు శ్రీహరి. బోధన, సాహిత్యంతో పాటు ఇతర రంగాల్లో చేసిన సేవలకు వీరిని పలు సంస్థలు వివిధ పురస్కారాలతో గౌరవించాయి. సావిత్రీ బాయి ఫూలె పురస్కారం, బహుజన ఉపాధ్యాయ సంఘం తొలి పురస్కారం, మచిలీపట్నం సాహితీ సత్కారం వంటివి వాటిలో కొన్ని. తాను చదివిన పాఠశాలలో పదేండ్ల పదవ తరగతి విద్యార్థులతో సమ్మేళనం నిర్వహించి ‘ప్రథమ దశాబ్ది పదవ తరగతి సమ్మేళన సంచిక’ తన సంపాదకత్వంలో తీసుకువచ్చారు శ్రీహరి. తెలుగునాట వస్తున్న అన్ని తెలుగు దిన, వార పత్రికల్లో వీరి బాలల రచనలు అచ్చయ్యాయి.
బాల గేయకర్తగా శ్రీహరి రెండు పుస్తకాలు అచ్చయ్యాయి. మొదటి పుస్తకం 1997లో ‘బాలల పాటలు’ పేరుతో వెలువడింది. రెండవ పుస్తకం ‘బాల వినోద గేయాలు’ 2019 లో ప్రచురించబడింది. ఈ బాల వినోద గేయాల సంపుటిలో వినోద గేయాలతో పాటు అనేక విశేష గేయాలున్నాయి. కవి శ్రీహరి ఈ గీతాల్లో స్పృషించని అంశం లేదు. తనకు తారసపడిన ప్రతిదాన్నీ గేయం చేశాడు. పిల్లలకు యిష్టమైన అరటిపండు మొదలుకుని ఆటలు, పాటలు, మొక్కలు, కాలాలు, పల్లె, ఊరు ఇలా ఇందులో ఎన్నో మనం చూడవచ్చు. ‘పచ్చగ ఉంటా/ పసందు గుంటా/ చిన్నపాపలకు/ మిన్నగ ఇష్టం’ అంటూ అరటిపండు గురించి కవి రాశారు. బాల్యం అనేక మందికి వరం. తన బాల్యాన్ని యాది చేసుకుంటూ శ్రీహరి ‘గాలి పటం గాలి పటం/ రివ్వున ఎగిరే గాలి పటం/ దారం తెగితే గాలి పటం/ దారితప్పును గాలి పటం’ అని చెబుతారు. గేయాల్లో నేరుగా వర్ణించడంతో పాటు మరికొన్ని గేయాలను ‘ఎర్రగ బుర్రగ/ ఉంటా నేను/ ఆడుకుంటా/ అల్లరి చేస్తా/ .. నాన్న పెడితె/ కొన్నే తింటా/ అమ్మ పెడితె/ అన్నీ తింటా’ అంటూ పొడుపు కథ రూపంలో రాశారు.
తెలుగు ఉపాధ్యాయుని గురించి తన గేయాల్లో శ్రీహరి మంచి గేయం రాశారు. ‘మా తెలుగు మాష్టారు’ అనే ఈ గేయంలో తెలుగు ఉపాధ్యాయుని విశేషాల గురించి చెప్పారు. నిజానికి ఏ బడిలోనైనా పిల్లలకు మొదట నచ్చేది తెలుగు పంతుళ్ళే కదా! ప్రకృతి పైన, పర్యావరణం పైన వీరికి ప్రేమతో పాటు అవగాహన ఉంది, దానిని ఇందులో అనేక గేయాల్లో వ్యక్తపరిచారు శ్రీహరి. ‘వద్దు వద్దు వద్దు/ రంగుల బొమ్మలు వద్దు/ .. జలం కలుషితం కావద్దు/ జీవుల మనుగడ మరువద్దు/ మట్టి గణపతి మహాముద్దు’ అని చెబుతారు. రుద్రమదేవిని గురించి ‘దేవి దేవి/ రుద్రమదేవి/ ఓరుగల్లుకే/ నువు మహాదేవి/ రాణి రాణి/ ఝాన్సీరాణి/ ప్రథమ సమరమున/ ఝాన్సీకీ రాణి’ అంటూ కీర్తిస్తాడు.. వైభవంగా.
కవి కొక్కొండ శ్రీహరి పుట్టింది, పెరిగింది, ఉద్యోగం చేసింది తెలంగాణ పల్లెల్లోనే. ఇక్కడి నేలను, పండుగలు, పబ్బాలు మనుషులను గత శతకంలో అందంగా చెప్పినట్టే ‘బతుకమ్మ పండుగ వచ్చింది/ సంబరాలను తెచ్చింది’ అంటూ జాతి పండుగ గురించి ఖ్యాతిగా రాశారు. ‘పచ్చని చెట్లకు నిలయం పల్లె’ అంటారు. ‘జలం’ గురించి రాస్తూ… ‘జలంతోనె గళం పెకులు/ జనం తోనె బలం కలుగు’ అంటారు. కవిగా, గేయకర్తగా, ఉపాధ్యాయునిగా, బాల సాహితీవేత్తగా నిరంతరం తపించి రాసిన కొక్కొండ శ్రీహరి మానేరు తీరం నుండి తనదైన శైలిలో రాస్తున్న బాల సాహతీవేత్త…! బాల వికాసకారుడు! జయహో! బాల సాహిత్యం!
– డా|| పత్తిపాక మోహన్, 9966229548