రాష్ట్రానికి నిధుల మంజూరులో కేంద్రం వివక్ష : కోలేటి దామోదర్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రానికి నిధుల మంజూరులో వివక్ష చూపిస్తున్న కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ కర్ణాటకలో చూసిన చేదు ఫలితాలనే తెలంగాణలోనూ చూస్తుందని తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ గృహ నిర్మాణ సంస్థ లిమిటెడ్‌ చైర్మెన్‌ కోలేటి దామోదర్‌ హెచ్చరించారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన చట్టంలోని హామీ ప్రకారం ఏపీకి రూ.10,461 కోట్లు మంజూరు చేసి తెలంగాణపై వివక్ష ప్రదర్శించిందని విమర్శించారు. విభజన చట్టంలోని 94 సెక్షన్‌ ప్రకారం వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. మూడేండ్లుగా రూ.1,350 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, నయాపైసా ఇవ్వలేదని విమర్శించారు. వివక్షను ఎదుర్కొని సంక్షేమ రంగంలో స్వర్ణయుగాన్ని తెచ్చిన సీఎం కేసీఆర్‌ ఆవిష్కరించిన పథకాలకు అంతర్జాతీయ ఖ్యాతి రావడాన్ని బీజేపీ అగ్ర నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని తెలిపారు. ఇప్పటికైనా వివక్షను విడనాడి నిధులు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు.