– ఆర్డీవోల సమావేశాల్లో చర్చోపచర్చలు
– బహిరంగ మార్కెట్లో ఎకరాకు రూ.70 లక్షలు
– ప్రభుత్వం పరిహారం రూ.9 లక్షలే
నవతెలంగాణ-గజ్వేల్
రీజనల్ రింగ్ రోడ్డు పరిహారం విషయం ఇంకా కొలిక్కి రావడం లేదు. అధికారులు, రైతుల మధ్యన పరిహారం మంతనాలు పొంతన లేకుండా పోతుంది. బహిరంగ మార్కెట్లో భూమి విలువ రూ.కోట్లలో పలుకుతుండగా ప్రభుత్వం రూ.లక్షల్లో ఇస్తామని చెబుతుండటంతో తాము భూములు ఇవ్వలేమని రైతులు అధికారులకు తెగేసి చెప్పినట్టు తెలుస్తోంది. రీజనల్ రింగ్ రోడ్డుకు భూములను తీసుకునేందుకు అధికారులు డీపీఆర్‌ఓను సిద్ధం చేయడంలో నిమగమై ఉన్నారు. ఈ లోపల రైతులతో కాలా (క్యాంప్టెంట్ అథారిటీ ఫర్ ల్యాండ్ ఆక్వాజేషన్) పరిహారంపై చర్చించాలని జిల్లా ఉన్నతాధికారులు ఆర్డీవోలకు ఆదేశాలు ఇచ్చారు. ఇటీవల గజ్వేల్ ఆర్డీవో వీవీఎల్ చంద్రకళతో నిర్వాసితులు సమావేశమయ్యారు. ఇదే విధంగా ఉమ్మడి మెదక్ జిల్లా మొత్తం సమావేశాలు నిర్వహిస్తున్నారు. భూమి పోతున్న చోట రిజిస్ట్రేషన్ మార్కెట్ రేట్‌ను బట్టి ప్రభుత్వ నిబంధన ప్రకారమే పరిహారం చెల్లింపు జరుగుతుందని రైతులకు అధికారులు చెబుతున్నప్పటికీ నిర్వాసితులు మాత్రం బహిరంగ మార్కెట్లో ఉన్న ధరలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని ముట్రాజ్ పల్లి, సంగాపూర్, లింగరాజు పల్లి గ్రామాల్లో బహిరంగ మార్కెట్లో ఎకరానికి రూ.కోటి పలుకుతుండగా రిజిస్ట్రేషన్ వ్యాల్యు ప్రకారం ఎకరాకు రూ 3.5 లక్షల వరకు ఉందని స్థానికులు అంటున్నారు. మూడింతల పరిహారం ఇస్తామని అధికారులు చెబుతున్నప్పటికీ రూ.9 లక్షలు దాటే పరిస్థితి లేదు. అదేవిధంగా మర్కుక్ మండలంలో రిజిస్ట్రేషన్ వ్యాల్యువేషన్ ప్రకారం చూస్తే.రూ.12 లక్షల వరకు ఎకరాకు వచ్చే అవకాశం ఉంది.
ఒక్కొక్క చోట ఒక్కో ధర బహిరంగ మార్కెట్లో భూమి ధర పలుకుతుంది. ఇదిలా ఉండగా భూ సర్వే పూర్తిస్థాయిలో కాకపోవడం హద్దులు పెట్టకపోవడంతో మళ్లీ ల్యాండ్ మార్కు మారుతుందా అని రైతులు భావిస్తున్నారు.
మెరుగైన పరిహారం కోసం బీఆర్‌ఎస్ డిమాండ్
రీజినల్ రింగ్ రోడ్లో భూములు కోల్పోతున్న రైతులకు మెరుగైన పరిహారం కోసం బీఆర్‌ఎస్ డిమాండ్ చేస్తుందని, గతంలోనే మల్లన్న సాగర్, కొండపోచమ్మ జలాశయంలో భూములు, గ్రామాలు కోల్పోయి న వారికి ప్రభుత్వం ఆర్‌అండ్‌ఆర్ కాలనీలు నిర్మించి పరిహారం ఇచ్చిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సైతం రైతులకు భూమికి భూమి లేదా బహిరంగ మార్కెట్లో ఉన్న ధరలను బట్టి నష్టపరి హారం ఇవ్వాలి. రైతులకు అన్యాయం జరిగితే న్యాయపోరాటం చేసాం.
ఒంటేరు ప్రతాప్ రెడ్డి
2013 చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలి
త్రిబుల్ ఆర్‌లో భూములు కోల్పోతున్న రైతులకు 2013 చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలి. బహిరంగ మార్కెట్లో ఉన్న ధరపై పరిహారం చెల్లించాలి. లేదా భూమికి భూమి ఇవ్వాలి. గతంలో కేసీఆర్ ప్రభుత్వం మల్లన్న సాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టు నిర్మాణంలో నిర్వాసితులకు అన్యాయం చేశారని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీక్ష చేసిన సంగతి గుర్తు చేశారు. నిర్వాసితులకు న్యాయం చేయాలని, వారికి న్యాయం జరిగే వరకూ సీపీఐ(ఎం) అండగా ఉంటుంది.
ఎల్లయ్య
సీపీఐ(ఎం) సిద్దిపేట జిల్లా
కార్యదర్శి వర్గ సభ్యులు