”మిమ్మల్ని కలవటానికి ఎంత ప్రయత్నం చేసినా వీలుకాలేదు. ఇటీవల ఆర్‌జికార్ ఆస్పత్రిలో జరిగిన దారుణకాండ నేనేకాదు, రాష్ట్ర ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ ఘటనపై తృణముల్ ప్రభు త్వం సకాలంలో స్పందించనందున ప్రజల్లో ప్రభుత్వం పట్ల విశ్వాసం సన్నగిల్లింది. అంతే కాదు, సర్కార్ ఏదో దాస్తోందనే భావన ప్రజల్లోకి వెళ్లిపోయింది.దాని పర్యవసానమే అరనిమం టల్లా సాగుతున్న ఆందోళనలు. దీనికి తోడు రాష్ట్రంలో పెచ్చుమీరిన అవినీతి . దీనిని అరికట్ట డంలోనూ ప్రభుత్వం విఫలమైంది. దీనికి పరాకాష్టగా 2022లో విద్యాశాఖ మాజీ మంత్రి సిబిఐ అరెస్ట్. దీని తర్వాత కూడా మీరేమి నష్ట నివారణ చర్యలు చేపట్టలేదు.ఆర్‌జికార్ ఆస్పత్రిలో జరిగిన ఘటన కనీసం పోలీ సులకు, తల్లిదండ్రులకు తెలుపకుండా నిర్లక్ష్యం వహించిన హాస్పిటల్ సూపరింటెండెంట్‌పై క్రమశిక్షణ చర్యలు చేపట్టకుండా, మరొక పేరున్న హాస్పిటల్‌కు బదిలీచేయటంతో ప్రజల్లో ప్రభుత్వ ప్రతిష్ట మసకబారింది. కోర్టు జోక్యం తర్వాత సస్పెండ్ చేయటం సర్కార్ నిర్లక్ష్యం స్వప్టంగా కనిపిస్తుంది. నేను నలభైయేండ్లు సుదీర్ఘంగా ఐఏఎస్ అధికారిగా పనిచేశా. ఇప్పుడున్నంత అవినీతిని ఎప్పుడూ చూడలేదు. ఇప్పటికి నేనొక మురికివాడ పక్కనున్న ఒక పాత అపార్టుమెంట్లో నివాసముంటున్నాను. తొమ్మి దేండ్ల నాటి పాతకారునే వాడుతున్నాను. కానీ, ఇప్పుడిప్పుడే ప్రజాప్రతినిధులుగా, మున్సిపాలిటీ చైర్మన్లుగా అయినవారు కూడా పెద్ద కార్లలో తిరుగుతున్నా దృశ్యాలను చూస్తున్నాము.” అని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణముల్ అధినేత్రి మమతా బెనర్జీకి అదే పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు జవహర్ సిరికార్ తన రాజీనామా లేఖలో పేర్కొన్న వ్యాఖ్యలివి.
జవహర్ సిరికార్‌కు తృణముల్ ప్రభుత్వం 2021లో రాజ్యసభ సభ్యత్వమిచ్చింది. పార్ల మెంటులో అనేక ప్రజాసమస్యలపై గళ మెత్తిన చరిత్ర ఆయనకుంది. ఈయన విద్యాభ్యాసం ఇంగ్లాండులోని కేంబ్రిడ్జిలో కొనసాగింది.ప్రసార భారతి సిఇఓగా 2012 నుంచి 2016 వరకు ,కేంద్రంలో సెక్రెటరీగా, ఏమాత్రం అవినీతి మరకలేకుండా సమర్థ అధికారిగా పనిచేసినట్టు ఆయనకు పేరుంది. స్వాతంత్య్రదినోత్సవానికి ముందు రోజు ఆగష్టు 14న ఆర్‌జికార్ ఆస్పత్రిలో ట్రెయినీ డాక్టర్‌పై జరిగిన సామూహిక లైంగికదాడి, ఈ ఘటన పట్ల ప్రభుత్వం స్పందిం చిన తీరు సరిగా లేదనే కారణంతో ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ దారుణం జరిగి నెల రోజులు దాటుతున్నా సకాలంలో చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పు పట్టారు. ఆమె మౌనం వల్లే రాష్ట్రంలో ఆందో ళనలు పెరిగాయన్నారు. త్వరలోనే రాజ్యసభ అధ్యక్షున్ని కలిసి తన రాజీనామా లేఖను అందచేస్తానని తెలిపారు. చివరిగా ఆ లేఖలో మమతకు ఒక విన్నపం కూడా చేశారు. రాష్ట్రంలో మతోన్మాదులు, విధ్వంసకర శక్తులు అధికారంలోకి రాకుండా చూసేవిధంగా పరిపాలన సాగించాలని, ఇందులో విఫలమైతే జాతి క్షమించదని పేర్కొన్నారు.
జవహర్ సిరికార్ ఒక్కరే కాదు మరొక తృణమూల్ రాజ్యసభ సభ్యుడు సుఖేందు శేఖర్‌రే ఆర్‌జికార్ హాస్పిటల్‌లో జరిగిన లైంగికదాడి పట్ల ప్రభుత్వాన్ని తప్పుపట్టారు. నెలరోజులుగా జూనియర్ డాక్టర్లు రాష్ట్ర వ్యాప్తంగా విధుల్ని బహిష్కరించి ఆందోళన చేపట్టంతో పేదలు సరైన వైద్యమందక నానా అగచాట్లు పడు తున్నారు. అంతేకాదు, డబ్బుల్లేక, ప్రయి వేటు హాస్పిటల్స్‌కు వెళ్లలేక చనిపోతున్న ఘటనల్ని సుప్రీంకోర్టుకు కపిల్ సిబాల్ ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన చీఫ్ జస్టిస్ బెంచ్ 24 గంటల్లో జూనియర్ డాక్టర్లు డ్యూటీలో చేరక పోతే రాష్ట్ర ప్రభుత్వంపై క్రమశిక్షణ చర్యలు చేపట్టవచ్చని, వీరి సమ్మెతో పేదప్రజలు నష్టపోకూడదని ఉతర్వులిచ్చింది. విధుల్లో ఉన్న డాక్టర్‌పై లైంగికదాడికి నిరసనగా విద్యార్థులు, యువకులు సెక్రటేరియేట్‌ను ముట్టడించిన తీరు పట్ల ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తిని స్పష్టం చేస్తోందంటూ అక్కడి రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. అంతెందుకు మహిళా సంఘాలతో పాటు ఇటీవల సెక్స్‌వర్కర్లు కూడా ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్నారు. ఒకపక్క సొంతపార్టీ ఎంపీలే పాలనావైఫల్యాల్ని ఎత్తిచూ పడం, ప్రజావ్యతిరేక పాలనపై ప్రజలు పోరాటా లతో రోడ్లెక్కడం మమతాబెనర్జీపై ఉన్న భ్రమలు క్రమక్రమంగా తొలుగుతున్నట్టు విద్యావంతులు, మేధావుల అభిప్రాయం. ఇది బెంగాల్‌లో దీదీ సర్కార్ మసకబారుతోం దనడానికి సంకేతం!
– డాక్టర్ కె.సుధాకర్ రెడ్డి, 8985037713