– వ్యక్తిగత దూషణలపై చిరుమర్తి క్షమాపణ చెప్పాలి
– ఎమ్మెల్యే అభ్యర్థి వేముల వీరేశం
నవతెలంగాణ-నకిరేకల్
శత్రువైన ప్రేమించే గుణం కోమటిరెడ్డి బ్రదర్స్ సొంతమని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల వీరేశం పేర్కొన్నారు. శనివారం పన్నాల గూడెం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోమటిరెడ్డి బ్రదర్స్ తో తనకు ప్రాణహాని ఉందని స్థానిక ఎమ్మెల్యే, బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చిరుమర్తి లింగయ్య చేస్తున్న ఆరోపణలు అసత్య దూరమన్నారు. గత పది రోజులుగా కోమటిరెడ్డి బ్రదర్స్, శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ పై చేస్తున్న అసత్య ఆరోపణలు సమంజసం కాదన్నారు. 2009లో ఎమ్మెల్యే టికెట్ ఇప్పించిన కోమటిరెడ్డి బ్రదర్స్ 2014లో నీ ఓటమికి ఎలా కారణమవుతారని ప్రశ్నించారు. జిల్లాలో అభ్యర్థుల దగ్గర వెంకటరెడ్డి పైసలు వసూలు చేశారని నిరాధారణ ఆరోపణలు చేస్తే కార్యకర్తలు సహించరన్నారు. జిల్లాలో ఎవరికి ఏ ఆపద వచ్చినా సహాయం చేసే గుణం ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్ ను విమర్శించడం పట్ల ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. చిరుమర్తికి టికెట్ ఇవ్వకుంటే పోటీ చేయమని టికెట్ ఇప్పించింది కోమటిరెడ్డి బ్రదర్స్ కాదా.. అని ప్రశ్నించారు. బిఆర్‌ఎస్ పార్టీలోకి పోయిన తర్వాత నాలుగు పైసలు జమ కాగానే ఎదుగుదలకు పునాది అయిన వారిని విమర్శించడం పట్ల ప్రజలు ఈసడించుకుంటున్నారని పేర్కొన్నారు. రాజగోపాల్ రెడ్డి కెసిఆర్ ను గద్దె దించేందుకే బిజెపిలోకి వెళ్లాడని, బిజెపి, బిఆర్‌ఎస్ ఒక్కటే అని తెలుసుకొని తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారని చెప్పారు. నకిరేకల్ నియోజకవర్గం వదిలి నలగొండ, మునుగోడులో ప్రచారం చేస్తానని అంటున్నావ్. అంటే నకిరేకల్ లో గెలవనని నువ్వే డిసైడ్ అయినావా.. అని ప్రశ్నించారు. అంత గొప్ప స్థాయి గల వారి తోటి చాలెంజ్ చేయడం నీ స్థాయికి తగిన పని కాదని హితవు పలికారు. కోమటిరెడ్డి బ్రదర్స్, నేతి విద్యాసాగర్ తో పాటు తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్న చిరుమర్తికి నోటీసులు ఇవ్వాలని జిల్లా ఎలక్షన్ కమిషన్కు విజ్ఞప్తి చేశారు టిపిసిసి అధికార ప్రతినిధి నకిరేకంటి ఏసు పాదం, కేతపల్లి పిఎసిఎస్ చైర్మన్ బొల్లా వెంకట్ రెడ్డి ,డిసిసి ప్రధాన కార్యదర్శి యాస కరుణాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ పన్నాల రంగమ్మ రాఘవరెడ్డి, నాయకులు బచుపల్లి గంగాధర్ రావు, సకినాల రవి, లింగాల వెంకన్న, గాధగోని కొండయ్య, గాజుల సుకన్య, వలిశెట్టి స్వప్న, పెద్ది యాదగిరి పాల్గొన్నారు.