
– త్వరలో తండ్రీకొడుకులు కూడా జైలుకెళ్లడం ఖాయం
– రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు కాలం చెల్లింది
– సంస్కారహీనుడు జగదీష్ రెడ్డి గురించి ఇక మాట్లాడను
– పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ 15 స్థానాలు గెలవబోతోంది
– ఎన్నికల తర్వాత నల్లగొండలో అభివృద్ధి వేగం
– మీడియా సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
కేసీఆర్ బస్సు యాత్ర కాదు కదా..మోకాళ్ళ యాత్ర చేసినా భువనగిరి, నల్లగొండలో డిపాజిట్ కూడా దక్కదు. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవితకు బెయిల్ దొరకదు. త్వరలో తండ్రీకొడుకులు కూడా జైలుకెళ్లడం ఖాయం. రాష్ట్రంలో బిజెపి, బీఆర్ఎస్ పార్టీలకు కాలం చెల్లిందని రాష్ట్ర రోడ్డు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోష్యం చెప్పారు. మంగళవారం అయన జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.పదేళ్లు అధికారంలో ఉండి అభివృద్ధి చేయలేని వారు ఇప్పుడేం చేస్తారని మంత్రి ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల్లో 15 స్థానాలలో గెలవబోతున్నాం. నన్ను గెలిపించిన విధంగానే అత్యధిక మెజార్టీతో రఘువీర్ రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు.పదేళ్లు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన సీఎం కేసీఆర్, మంత్రిగా ఉన్న జగదీశ్ రెడ్డి వేలకోట్లు సంపాదించారు.ఉమ్మడి నల్లగొండ జిల్లాను బ్రస్టు పట్టించిన సంస్కారహీనుడు జగదీష్ రెడ్డి గురించి ఇక మాట్లాడి నా స్థాయిని దిగదార్చుకోను అని అన్నారు.
పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత నల్లగొండ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులన్నింటిని వేగవంతం చేస్తాను. రాష్ట్రంలో పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తాం. నాకు రాజకీయ జన్మనిచ్చిన నల్లగొండ నియోజక వర్గాన్ని ఎన్నటికి మరువను.సీఎం రేవంత్ రెడ్డితో తామంతా రాష్ట్ర అభివృద్ధి కోసం టీం వర్క్ గా పని చేస్తున్నామని తెలిపారు.ఇటీవల నల్గొండ జిల్లా కేంద్ర ఆసుపత్రిని సందర్శించి గర్భిణీలు, చిన్నపిల్లలు ఉండే వార్డుకు ప్రతిక్ ఫౌండేషన్ ద్వారా 32 ఏసీలు పెట్టించాను.ఎండ వేడితో వారంతా ఇబ్బందులు పడుతున్నారు. త్వరలో సూర్యాపేట, ఖమ్మం ఆస్పత్రులను సందర్శించి అక్కడ కూడా ఎయిర్ కండిషన్లను ఏర్పాటు చేయిస్తా.రాష్ట్రంలోని అన్ని ఐటిఐ లలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తాం. నేడు జరిగే రఘువీర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు అంత పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.నీటి జలాలు పంపకంలో జగన్, కేసీఆర్ లాలూచీ పడ్డారు. కేసీఆర్ వలనే జిల్లాకి కరువు వచ్చింది. మిర్యాలగూడకి కేసీఆర్ ఏ ముఖం పెట్టుకొని వస్తారు.బస్ యత్ర చేయడానికి కేసీఆర్ కి సిగ్గు ఉండాలి. కేసీఆర్ శకం ఇక ముగిసింది. మతాల మధ్య చిచ్చుపెట్టి బీజేపీ రాజకీయాలు చేస్తోంది.
ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుంది. రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారు. పదేళ్ళలో ఏమి చేయని కేసీఆర్ బస్ యాత్ర ద్వారా ఏమి చేస్తారని ప్రశ్నించారు. నేను పిలిస్తే పార్టీలోకి రావడానికి 25 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు. నల్గొండ, భువనగిరిలోని భారాస అభ్యర్థులు సర్పంచులుగా కూడా పనికిరారు. భారాస నేతలు గురుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి బాగా చెప్పాడు.జగదీశ్ రెడ్డి గురుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి సరిగా చెప్పాడు. సుఖేందర్ రెడ్డి కి ధన్యవాదాలు చెబుతున్నా. బి ఆర్ ఎస్ నాయకులు ఏం చేసినా గెలిచేది మాత్రం లేదన్నారు. ఈ సమావేశంలో డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్, జడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య, నల్లగొండ పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి, పాశం రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.