– నల్లగొండ నా ఆశ..శ్వాస.. ప్రాణం
– మరోసారి సేవ చేసే అవకాశం కల్పించాలి
– నామినేషన్ సందర్భంగా క్లాక్ టవర్ సెంటర్లో జరిగిన సభలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
– పార్టీ శ్రేణులు, ప్రజలతో కిక్కిరిసిన నల్లగొండ
నవతెలంగాణ- నల్గొండ: నాకు రాజకీయ జన్మనిచ్చిన నల్లగొండ నియోజక వర్గాన్ని నా ప్రాణం ఉన్నంతవరకు మర్చిపోను. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి నాకు రాజకీయంగా ఉన్నత స్థానం కల్పించారు.
నల్లగొండ నియోజకవర్గ ప్రజల కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం. నా చర్మంతో చెప్పులు కుట్టిన వారి రుణం తీర్చుకోలేనిది. మరోసారి గెలిపించి సేవ చేసే అవకాశం కల్పించాలి. నల్లగొండ నుండి కోమటిరెడ్డి సీఎం అయ్యే రోజు వస్తుంది.. ఏదో ఒక రోజు సీఎం మాత్రం అవుతా.. అని భువనగిరి ఎంపీ, నల్లగొండ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు చేసిన కోమటిరెడ్డి కార్యకర్తలతో నల్లగొండ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు, ప్రజలతో కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా గడియారం చౌరస్తాలో నామినేషన్ కు ముందు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. నల్లగొండ అభివృద్దే నా ధ్యేయం గత ఎన్నికలలో దత్తత పేరుతో సీఎం కేసీఆర్ నల్లగొండ నియోజక వర్గ ప్రజలను వంచనకు గురిచేశాడు.అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి చేయలేదు. మహబూబ్నగర్ నుంచి రామకృష్ణారావు, రంగారెడ్డి నుంచి చెన్నారెడ్డి, ఖమ్మం నుంచి జలగం వెంగళరావు సీఎంలు అయ్యారు.నేను కూడా ఎప్పుడో ఒకసారి నల్లగొండ నుంచి సీఎం అవుతా. ఇప్పుడు ఆ కోరిక లేకున్నా ఎప్పుడో ఒకసారి అయి తీరుతా. ఆరు దశాబ్దాల తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను సోనియాగాంధీ నెరవేర్చింది. త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నియంత పాలన సాగిస్తున్నాడని నిప్పులు చెరిగారు. నీళ్లు నిధులు నియామకాల కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరంఅన్నారు. రైతులు ఆత్మహత్య చేసుకున్న రుణమాఫీ చేయడం లేదు.విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే వారి ఇంటికి వెళ్లి ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు.
రైతులకు, విద్యార్థులకు బతికున్నప్పుడు అందని సహాయం చనిపోయినప్పుడు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు రుణమాఫీ, ఉద్యోగ నియామకాలు చేపడితే వారి ఆత్మహత్యలు ఉండేవి కావని అన్నారు. బీఆర్ఎస్ పాలనకు రోజులు దగ్గర పడ్డాయని అన్నారు.రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని, ఉద్యోగ ఖాళీలన్నింటిని భర్తీ చేస్తామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఒకటో తారీఖున వేతనాలు చెల్లిస్తాం. ఈ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ను ఫామ్ హౌస్ కే పరిమితం చేయాలంటే కాంగ్రెస్ ను గెలిపించాలని పిలుపునిచ్చారు. కెసిఆర్ నిజాం నవాబుల వ్యవహరిస్తున్నాడని విమర్శించారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడింది. ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదన్నారు. ఆయన నియంత పాలనకు చరమగీతం పాడాలంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీ స్కీములను కచ్చితంగా అమలు చేయడం జరుగుతుందని అన్నారు. మంత్రి జగదీష్ రెడ్డి సంస్కారహీనుడు అని వ్యాఖ్యానించారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టును అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. సైకిల్ మీద తిరిగిన మంత్రి జగదీష్ రెడ్డి 5 వేల కోట్లు ఎలా సంపాదించాలని ప్రశ్నించారు. ఈ ఎన్నికలలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 కు 12 స్థానాలను గెలుస్తాము. కమిషన్ల కోసమే కెసిఆర్ ప్రభుత్వం ప్రాజెక్టులు కట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కట్టిన నాగార్జునసాగర్, శ్రీశైలం డ్యామ్ లు చెక్కుచెదరలేదు. కమిషన్ల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులన్ని కుంగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పార్టీలకతంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు అవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్, నకిరేకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేముల వీరేశం, నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, నల్గొండ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, నల్లగొండ జడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య, ఎంపీపీ మనిమద్ది సుమన్, తిప్పర్తి జడ్పిటిసి పాశం రామ్ రెడ్డి, నల్గొండ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గోపగాని మాధవి, కనగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం అనుప రెడ్డి, మాజీ జెడ్పిటిసి నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, తిప్పర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జూకూరి రమేష్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షురాలు నాంపల్లి భాగ్య, పలువురు కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.