– వ్యవసాయం తెలియని వారికి మార్కెట్ చైర్మన్ గిరి కట్టబెట్టిన కొమ్మూరి
– సీపీఐ (ఎం )చేర్యాల మండల, పట్టణ కార్యదర్సులు
నవతెలంగాణ-చేర్యాల
చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని కాంగ్రెస్ పార్టీ జనగామ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అమ్ముకొని సొమ్ము చేసుకున్నారని సీపీఐ (ఎం )చేర్యాల మండల కార్యదర్శి కొంగరి వెంకట మావో, పట్టణ కార్యదర్శి రాళ్లబండి నాగరాజు ఆరోపించారు.మండల కేంద్రంలోని సీపీఐ (ఎం )కార్యాలయంలో ఆదివారం ఆ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ వ్యవసాయం అంటే తెలియని హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగిని నల్ల నాగుల శ్వేత ను నియమించడం చేర్యాల ప్రాంత ప్రజలను మరొకసారి ద్రోహం చేసి కించపరిచిన విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని,దీనిపైన పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు.చేర్యాల వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవిని రూ.55 లక్షలకు కక్కుర్తి పడి చేర్యాల ప్రాంతం కాని వారికి, వ్యవసాయం అంటేనే తెలియని వారిని నియమించిన తీరును కొమ్మూరి ప్రతాపరెడ్డి ఇకనైనా మార్చుకోవాలని, సిద్దిపేట జిల్లా చేర్యాల ప్రాంతంలో ని ప్రజలకు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా అర్హత లేదా అని ప్రశ్నించారు. ఎన్నో పోరాటాలకు నిలయమైన ఈ ప్రాంతాన్ని స్వార్థ రాజకీయంతో డబ్బులకు పదవులను అమ్ముకునే నీచ బుద్ధిని ఇకనైనా మానుకోవాలని, లేదంటే చేర్యాల ప్రాంత ప్రజలు నీకు నీ కుటుంబ రాజకీయాలకు స్వస్తి చెప్పే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయన్నారు.ఇప్పటికైనా తప్పును తెలుసుకొని వ్యవసాయం తెలియని హైదరాబాద్ లో నివసిస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగినిని చైర్మన్ పదవి నుండి వెంటనే తొలగించి చేర్యాల ప్రాంతంలోని వారికి మార్కెట్ చైర్మన్ పదవిని ఇవ్వాలని సూచించారు. డబ్బులే ప్రధానమని అను కుంటే నీ గౌరవాన్ని నీవే కోల్పోవడం ఖాయమన్నారు. చేర్యాల ప్రాంత రైతులు, వ్యవసాయ కార్మికులు, వర్తకులు, మేధావులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పదవులను అమ్ముకునే దిగజారుడు రాజకీయాలను వ్యతిరేకించాలని కోరారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) నాయకులు ముస్త్యాల ప్రభాకర్, బోయిని మల్లేశం, దర్శనం రమేష్, రాళ్ల బండి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.