అతనొక అగ్గి బరాటా. గెరిల్లా పోరాట యోధుడు. ఆదివాసీల ఆత్మగౌరవ ప్రతీక. ఆయన పేరు వింటేనే నిజాం సర్కార్‌కు దడ పుట్టేది. స్వపరిపాలన, ఆత్మగౌరవం కోసం పోరాట మార్గాన్నే ఎంచుకున్న ధీరుడు. ఇదే నిజాం నుంచి తన జాతి ప్రజలను విముక్తి చేస్తుందని నమ్మి ఉద్యమించిన నాయకుడు. అతనెవరో కాదు, తెలంగాణ పోరుబిడ్డ, ఆదివాసుల ముద్దుబిడ్డ కొమురంభీమ్. ఆయన పోరాటం, అమరత్వానికి ఎనిమిది దశాబ్దాలు నిండాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, గోండు తెగకు చెందిన భీమ్ 22 అక్టోబరు 1901న జన్మించారు. నిజాం చెర నుంచి గిరిజన, ఆదివాసుల విముక్తి కోసం హైదరాబాద్ నవాబు అసఫ్‌జహికి వ్యతిరేకంగా పోరాడాడు. అడవిని జీవనోపాధిగా చేసుకుని కొండకోనల్లో, ప్రకృతితో సహ జీవనం సాగించే ఆదివాసీ ప్రజలకు అడవిపై హక్కులుండాలని, స్వయం పాలన కోసం ‘జల్-జంగిల్-జమీన్’ నినాదంతో ఉద్యమించాడు. పశువుల కాపర్లపై విధించిన సుంకానికి వ్యతిరేకంగా గిరిజనులను ఒక్కతాటిపై నడిపించాడు. తాను పదిహేడేండ్ల వయసులో అటవీశాఖ సిబ్బంది జరిపిన దాడిలో తండ్రి మరణించగా కుటుంబ సభ్యులంతా కరిమెర ప్రాంతంలోని సర్దాపూర్‌కు వలసెళ్లారు. అక్కడ వాళ్లు సాగుచేసుకుంటున్న భూమిని జమిందార్ ఆక్రమించుకోవడంతో ఆగ్రహంతో భీమ్ అతన్ని హతమార్చాడు. ఆ తర్వాత ఆసిఫాబాద్ పరిసర ప్రాంతాలు, జోడేఘాట్ గుట్టల్ని కేంద్రంగా చేసు కుని నిజాం నవాబుపై గెరిల్లా పద్ధతిలో పోరాటం చేశాడు. భీమ్‌కు అండగా, వెన్నంటే కొమురం సూరు, వెడ్మరాము సహచరులుగా ఉన్నారు.
రాష్ట్రంలో గోండు తెగకు సంబంధించిన ప్రధాన్, తోటి, మన్నె, కోయ తెగలే కాకుండా నాయక్‌పోడ్, ఆంధ్ ఇతర ఆదివాసీ తెగలు ఆదిలాబాద్,ములుగు, భద్రాద్రి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో నివసిస్తున్నాయి. వారి జీవనాధారం పోడు వ్యవసాయం. వారంతా ఎప్పటికీ ఒక రాజ్యంలో ఇమిడిలేరు. అయితే వారిని అడవినుంచి తరిమేసే విధానాలు, దూరం చేసే చట్టాలతో నేటికీ తలపడుతూనే ఉన్నారు. అడవిని నరికి పంటవేస్తే అది జంగ్లాత్ భూమి అని ఒకరు, కాదు రెవెన్యూ భూమి అని మరొకరు అంటూ గోండ్లను ఆభూముల నుంచి తరిమేశారు. పంటల్ని ధ్వంసం చేశారు.. జరిమానాలతో వేధించారు. ఈ వేధింపులు, అణచివేతల నేపథ్యం నుంచే కొమురంభీమ్ నాయకత్వంలో గోండ్లు సంఘటితమ య్యారు. నైజాం నుంచి విముక్తి కోసం ‘మాఊర్లో..మా రాజ్యం’ అంటూ పన్నెండు గూడాల ప్రజలు ఉద్యమించారు. భీమ్ పోరాటం పలు ప్రాంతాలకు విస్తరించేలోపే నిజాం సేనలతో యుద్ధం జరిగింది. పాశవికంగా ఆ పోరాటాన్ని అణిచేసే ప్రయత్నం చేసింది. ఒక నమ్మకద్రోహి ఇచ్చిన సమాచారంతో నిజాం సైనికులు 1940 అక్టోబర్ 27న జోడేఘాట్ అడవుల్లో భీమ్ స్థావరాన్ని ముట్టడించి అతన్ని హతమార్చారు. నిజాం సైన్యంమీద కొమురంభీమ్ కొదమసింహంలా గర్జించేవాడని నేటికీ అతని పోరాట స్ఫూర్తిని తలచుకుం టారు.ఆయన చనిపోయిన రోజునే ఆదివాసులు తమ పవిత్రమైన పండగను జరుపుకుంటారు.
భీం అమరత్వం జోడేఘాట్ లొద్దుల్లో నేటికీ ప్రతిధ్వనిస్తునే ఉన్నది.ఏహక్కుల కోసమైతే..నాడు భీం ఉద్యమించాడో.. ఆ హక్కుల కోసం ఆదివాసులు నేటికీ నిరంతరం పోరాటం చేయాల్సి వస్తున్నది. ప్రజాస్వామిక రాజ్యమని చెప్పుకుంటున్న నేడు కూడా..ఆదివాసుల అవస్తలు ఏమీ తీరలేదు. వారికి తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట కూడా గగనమే అవుతున్నది. అడవిలో దొరికే పండ్లు, ఫలాలే వారికి ఆహారం. వారు నివసించే తండాలకు నేటికీ రోడ్లు లేవు. వాగులోని చెలిమెలో నీళ్లు తెచ్చుకోవాలన్నా కొన్ని కిలోమీటర్లు నడిస్తేగాని దొరకవు. విషజ్వరాలు వస్తే గనుక ఇక అంతేసంగతి. డెంగ్యూ, మలేరియా లాంటి జ్వరాలతో ప్రతియేటా ఐదు వందల నుంచి వెయ్యి మంది వరకు చనిపోతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారిని ఒక ఓటుబ్యాంకుగా ఉపయోగించు కుంటున్నాయే తప్ప కొమురంభీమ్ ఏ హక్కుల కోసం పోరాడాడో, ఆ హక్కుల్ని కల్పించడంలో పాలకులు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. భీమ్ అనగానే ఆయన జయంతి, వర్థంతిల సందర్భంగా ఒక పూలమాల వేసి, గిరిజనులకు అండగా ఉంటామని ఉపన్యాసలిచ్చి వెళ్లిపోతారు. కానీ గిరిజన, ఆదివాసులు హక్కుల కోసం చేసే పోరాటాలు వారికి పట్టవు. నేటికీ ఆదివాసులపై నిర్బంధాన్ని ప్రయోగిస్తూనే ఉన్నారు. గిరిజన ప్రాంతాలకు ప్రత్యేక రక్షణ ఇచ్చే రాజ్యాంగంలోని అయిదో షెడ్యూలును తుంగలో తొక్కారు. ప్రాజెక్టులు, గనుల తవ్వకాల పేరుతో వారిని అడవికి దూరం చేసే కుట్ర చేస్తున్నారు. ఆదివాసీ భూరక్షణ చట్టం 1/70 చట్టాన్ని అమలు చేయడం లేదు. అన్యక్రాం తమవుతున్న అడవులను, భూములను పట్టించు కోవడం లేదు. ‘పోరాడితే పోయేది లేదు, బానిస సంకెళ్లు తప్ప’ అని కార్ల్‌మార్క్స్ వందల ఏండ్ల కిందటే పిలుపు నిచ్చాడు. అందుకే కొమురంభీం స్ఫూర్తితో తమ జీవనాధా రమైన అడవి రక్షణకు ఆదివాసులు సంఘటితమవ్వాలి. చట్టాల అమలుకు పాలకులను ప్రశ్నించాలి. ప్రభుత్వాలపై తిరుగుబావుటా జెండా ఎగరేసి హక్కుల్ని సాధించు కోవాలి.అదే భీమ్‌కు ఇచ్చే నిజమైన నివాళి.
(నేడు కొమురంభీమ్ జయంతి)
– కామిడి సతీష్‌రెడ్డి, 9848445134