ఇవ్వాళ్ళ తెలుగు బాల సాహిత్యాకాశంలో కొత్త గొంతుకలు బలంగా వినిపిస్తున్నాయి. కొత్త సంతకాలు పదిలమై కనిపిస్తున్నాయి. అచ్చంగా యిది బాల సాహిత్యానికే కాదు తెలుగు సాహిత్యానికీ కొత్త చేరికనే. వందలాదిగా ప్రఖ్యాత రచయితలు మొదలుకుని ఉదీయమాన రచయితల వరకు, యువ రచయితలు మొదలుకుని మన పిల్లల వరకు బాల సాహిత్య సృజన చేస్తున్నారు. ఈ కోవలో పైలా పచ్చీసు దశ నుండే కొత్త గొంతులెగరేసుకుంటూ ‘పక్కా’గా తన బాటను బాల సాహిత్యంలో పదిలపరుచుకున్న రచయిత ముక్కామల జానకీరామ్.
నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కొండకింది పల్లెలో 15 అక్టోబర్, 1988 న పుట్టిన ఈ పిలగాడు తన కథల వయ్యితో ఆ కొండెక్కి నిలుచుని కొత్తదారి పరచుకుంటున్నాడు. కవి, రచయిత, గీతకర్త, కథారచయిత, ఉపాధ్యాయుడు అన్నింటికి మించి నాకు నచ్చడానికి కారణం బాల సాహిత్య వికాసోద్యమంలో కార్యకర్త. జానకీరామ్ తల్లి శ్రీమతి లక్ష్మి, తండ్రి శ్రీ ముక్కామల అడిమయ్య. తెలుగు సాహిత్యంలో ఎం.ఎ చదివి తెలుగు స్కూల్ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తున్న జానకీరామ్ యునివర్సిటి గ్రాంట్స్ కమీషన్ అర్హత పరిక్ష కూడా ఉత్తీర్ణుడయ్యాడు. ఉపాధ్యాయునిగా తాను పనిచేస్తున్న బడిలోని పిల్లల దృష్టిని సాహిత్యం వైపుకు మరల్చడమేకాక సూర్యాపేట జిల్లాలోని మేళ్ళ చెరువు బడి పిల్లల కథల వయ్యి ‘ఊహలకే రెక్కలొస్తే…’ పేరుతో తెచ్చాడు. బాల సాహిత్య వికాసకారుల పెద్దన్న గరిపెల్లి అశోక్ అన్నట్టు ‘…పెద్దల మాటలు కాదు, పిల్లల మాటలు కూడా వినాల్సిందే అని చెప్పడానికి నిదర్శనం’ ఈ మేళ్ళ చెరువు పిల్లల కథలు. జానకీరామ్ కవి కూడా. పాటను, గేయాన్ని ప్రతిభావంతంగా కైగడతాడు. ‘పోయిరావాలె ఊరు’ పాట అటువంటిదే. వేలాదిమంది ఈ పాటను అంతర్జాలంలో చూడడం గమనించొచ్చు. తానే స్వయంగా జెఆర్ యూట్యూబ్ చానల్‌ను నడుపుతూ ముచ్చటగా మూడు పాటలను రిలీజ్ కూడా చేశాడు. తొలి కథ ‘భలే భలే బాలల చెరువు’ నుండి నిన్న మొన్న బాల చెలిమి నిర్వహించిన పర్యావరణ కథల పోటీల్లో బహుమతి అందుకోవడం వరకు బాలల కథా రచనలో తనకు తాను ఎంచుకున్న పద్ధతి కారణం. తొలి కథ నుండి తాను సంకలనంగా కథలను అచ్చువేసుకునే వరకు రచయితగానే కాక బాలల కోసం కార్యశాలలు నిర్వహించిన బాల వికాసకార్యకర్తగా తన బాధ్యతను మరవకుండా నిలిచిన రచయిత జానకీరామ్.
తాను చదువుకున్న పాఠ్య పుస్తకాల్లోని కవులు, రచయితల బొమ్మలను చూసి తన ఫొటో, పేరు కూడా ఇలా పుస్తకాల్లో వస్తే ఎంత బాగుండో అనుకున్న ఆ అమాయకపు బడి పిల్లగాడు యివ్వాళ్ళ ఏకంగా తన పుస్తకాన్ని అచ్చులోకి తెచ్చుకుని మనముందు నిలుచున్నాడు. సంపాదకునిగా తెచ్చిన తొలి పుస్తకం ‘ఊహలకు రెక్కలోస్తే’ సంకలనం. రచయితగా ముక్కామల జానకీరామ్‌ను కథల రామునిగా నిలిపిన తొలి పుస్తకం ‘ఆఫ్‌లైన్’. నిజానికి కోవిడ్ దెబ్బకు అంతా ఆన్‌లైన్ మయంగా మారిన నేపథ్యంలో, ఉపాధ్యాయునిగా ఆన్‌లైన్ గీసిన లక్ష్మణ రేఖలను గమనించిన జానకీరామ్ తన వయ్యికి ఈ పేరు పెట్టడం బాగుంది. ఇది ఇరవై రెండు కథల వయ్యి. ఆయనే చెప్పుకున్నట్టు నేటి పిల్లల నుండి పెద్దల వరకు బంధీ అయిన ఆన్‌లైన్ వలయాన్ని చేధించడమే ఈ బాలల కథల లక్ష్యమట. అది ఫలవంతం కావాలని కోరుకుందాం. సాంకేతికత మనిషికి ఎంత ఉపయోగంగా ఉందో, దురుపయోగం అయితే అంతే నష్టాన్ని చేకూరుస్తోంది. దీనినే ‘అంతర్జాలంలో ఉడుత’ కథలో వివరించాడు జానకీరామ్. ‘రంగురంగుల కాకి’ కథలో కాకి తన రూపం చూసుకుని బాధపడుతుంది. కోకిల దాని ఆలోచనలో ఎలా మార్పు తెచ్చిందో ఇందులో చూడొచ్చు. మనం చేసే పని మనకు గుర్తింపును, గౌరవాన్ని యిస్తుంది తప్ప ఆహార్యం, రంగు వంటివి కాదని చెప్పే కథ ఇది. ఈ పుస్తకం పేరు ‘ఆఫ్‌లైన్’ అయితే ఈ పుస్తకానికి లైఫ్‌లైన్ లాంటి కథ ‘లైఫ్‌లైన్’. నేటి ఆధునిక సాంకేతికత ఎదుగుదలతో ఆటపాటలకు, నేస్తాలకు దూరమై నిరంతరం టాబ్‌లు, లాప్‌టాప్‌లు, కంప్యూటర్లతో గడిపే పిల్లలు సెలవుల్లో తాత దగ్గరకు వచ్చి, అక్కడి ప్రకృతితో, మనుషులతో మమేకమైనప్పుడు ఏం జరుగుతుంది, ఏ పరివర్తన కలుగుతుందో చెప్పే చక్కని కథ యిది. బాల్యం అందరికీ ఒక చక్కని వరం. అందులోనూ నానమ్మ, తాతలతో గడిపిన వాళ్ళ ముచ్చట చెప్పాల్సిన పనిలేదు. జానకీరామ్ అలా నాయనమ్మతో గడిపే అదృష్టాన్ని కలిగిన రచయిత, ఆ నేపథ్యాన్ని తాను ‘సారీ నాయనమ్మ’ కథతో యాదిగా రాసుకున్నాడు. ఇంకా మోసపు స్నేహాలను బట్టబయలు చేస్తూ పిల్లలకు తెలియజేసే కథ ‘తెరపైన స్నేహం-తెరవెనుక ద్రోహం’ కథ. నక్కకు గుణపాఠం చెప్పే కథ ‘నక్క తిక్క కుదిరింది’. ‘పట్నం వచ్చిన మామయ్య’ అచ్చంగా నేటి పిల్లలు తప్పక చదవాల్సిన కథ. అవును, నేటి కాలపు పిల్లలకు మన కాలపు ఆటలు, పాటలు, అనుబంధాల వంటివి తెలిపేందుకు యిటువంటి రచనలు యింకా రావాల్సివుంది. నల్లగొండ జిల్లా కథల కొండమీద కొంకింది పల్లె నుండి జండా మోసుకుని వస్తున్న ముక్కామల జానకీరామ్‌కు, ఆయన కథలకు అభినందనలు. జయహో బాల సాహిత్యం!
– డా|| పత్తిపాక మోహన్
9966229548