– అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్
నవతెలంగాణ- నల్లగొండ
తెలంగాణ రాష్ట్రంలో కూలిబంధు పథకం ప్రవేశపెట్టాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ చట్టం రక్షణ కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. శుక్రవారం నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం దుప్పలపల్లి గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఆయన పరిశీలించి కూలీల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో కేంద్ర పాలిత ప్రాంతాలను కలుపుకొని 716 జిల్లాలు, 7168 బ్లాకులు, 269,453 గ్రామపంచాయతీలలో ఉపాధి పనులు అమలు అవుతున్నాయన్నారు. 6కోట్లా 77 లక్షల కుటుంబాలకు చెందిన 15 కోట్లా 78 లక్షల మంది జాబ్ కార్డులు కలిగి ఉన్నారని తెలిపారు. ఈ జాబ్ కార్డులలో 32 కోట్ల మంది కూలీలు తమ పేర్లు నమోదు చేసుకొని ఉన్నారని తెలిపారు. వీరందరూ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా ప్రభుత్వం 9.95 కోట్ల జాబు కార్డులలోని 15.78 కోట్ల మంది కూలీలకు మాత్రమే గత సంవత్సరం పని కల్పించినట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయని తెలిపారు. అంటే 50శాతం మంది కూలీలకు కూడా ప్రభుత్వం పని చూపడం లేదన్నారు. రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం గత సంవత్సరం కేటాయించిన రూ.73 వేల కోట్ల బడ్జెట్‌ను ఈసారి రూ.63 వేల కోట్లకు అంటే 21.66శాతం కుదించిందని, బడ్జెట్లో కోత విధించడం అంటే పని కల్పించే బాధ్యత నుంచి తప్పుకోవడమేనన్నారు. కూలీల పని దినాలను తగ్గించుకోవడం కోసం కొత్త విధానాలను ముందుకు తీసుకొస్తుందన్నారు. ఈ విధానాలను వ్యతిరేకిస్తూ కూలీలు పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు మండల కేంద్రంలో సుందరయ్య వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈయన వెంట వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నారి ఐలయ్య, తిప్పర్తి మండల అధ్యక్ష, కార్యదర్శులు మన్యం బిక్షం, గండమల్ల రాములు గ్రామ నూతన అధ్యక్ష, కార్యదర్శులు సహిన, సరిత తదితరులు పాల్గొన్నారు.