
నవతెలంగాణ – రామగిరి
అందుబాటులో ఉండే అనుభవం ఉన్న నాయకుడు కొప్పుల ఈశ్వర్ అని మంథని బీఆర్ఎస్ ఎన్నికల ఇంచార్జ్ వోరుగంటి రమణారావ్ విమర్షించారు. మంగళవారం సెంటినరీకాలనీలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొప్పుల ఈశ్వర్ ప్రజల మధ్య ఉండే అనుభవం గల ప్రజానాయకుడని ఆయన కొనియాడారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను ప్రజలు నమ్మక పోవడంతో కొత్త తరహాలో దేవుళ్ళ మీద ఒట్టేసి మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను చెప్పిన వంద రోజుల్లో అమలు చేయలేక దేవుళ్ళపై ప్రమాణాలెందుకని ఆయన ప్రశ్నించారు. ఆచరణ సాధ్యం కాని హామీలను ప్రకటించి, తీరా వాటిని అమలు పరచలేక తప్పించుకునేందుకు మార్గాలను అన్వేషిస్తున్నారనీ దుయ్యబట్టారు. అందులో భాగంగానే హామీలను అమలు చేస్తామని దేవుళ్ళ పై ప్రమాణాలు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాలం గడుపుతున్నారన్నారు. ఆచరణ సాధ్యం కాని హామీలను, వంద రోజుల్లో అమలుచేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ వింధగా అమలు చేస్తారో శ్వేతపత్రం విడుదల చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. హామీల అమలకు ప్రభుత్వం వద్ద ఉన్న లెక్కలను, బడ్జెట్ వివరాలను సవివరంగా వివరిస్తూ..ప్రభుత్వం విడుదల చేసిన శ్వేత పత్రాన్ని ప్రజాక్షేత్రంలో ఆమోదం పొందితే మేమూ జేజేలు కొడుతూ మిమ్ములను స్వాగతిస్తమన్నారు. అలగే పెద్దపల్లి పార్లమెంటరీ వ్యాప్తంగా అన్నా అని పలకరించే కొప్పుల ఈశ్వర్ ను ప్రజలందరూ అక్కున చేర్చుకొని కేసీఆర్ పాలనకు బలోపేతం చేస్తారని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో రామగిరి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శెంకేషి రవీందర్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు మ్యాదరవేన కుమార్ యాదవ్, మాజీ ఏఎంసీ ఛైర్మన్ పూదరి సత్యనారాయణగౌడ్, సెంటనరీ కాలనీ టౌన్ ప్రెసిడెంట్ కాపరబోయిన భాస్కర్, మాజీ ఉపసర్పంచ్ దామెర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.