
రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని సీపీఐ (ఎం.ఎల్) మాస్ లైన్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుదవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ విక్రమ్ భవన్ లో జరిగిన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన అకాల వర్షాల వల్ల అనేక మంది రైతులు నష్టపోయారని,దీనికి కారణం ఐకెపి సెంటర్లో ఉన్న వడ్లను సకాలంలో కాంటాలు వేసి ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం అధికారుల నిర్లక్ష్యమేనని అన్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల అనేక చోట్ల ఐకెపి లో ఉన్న వడ్లు తడిచి రైతులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు.అదేవిధంగా మరికొన్ని చోట్ల కోతకోయని పొలాలు కూడా ఈ వర్షం వల్ల నష్టం జరిగిందని అన్నారు.అందుకే ప్రభుత్వం స్పందించి ఎలాంటి షరతులు లేకుండా తడిచిన వడ్లను కొనుగోలు చేసి మార్కెట్ రేటును బేషరతుగా ఇవ్వాలని అన్నారు.అదేవిధంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 30వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.రాబోయే రోజుల్లో అకాల వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి ఐకెపి సెంటర్లో ఉన్న వడ్లను యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మాస్ లైన్ పార్టీ జిల్లా నాయకులు కారింగుల వెంకన్న, పిఓడబ్ల్యు జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పిడిఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్, ఐఎఫ్టియు జిల్లా మాజీ కార్యదర్శి రాంజీ, జిల్లా నాయకులు లింగయ్య, సయ్యద్,పిఓడబ్ల్యు జిల్లా అధ్యక్షులు చంద్రకళ, ఉపాధ్యక్షులు సూరం రేణుక తదితరులు పాల్గొన్నారు.