కేసుల నుంచి తప్పించుకునేందుకే కేటీఆర్‌ ఢిల్లీ టూర్‌

– రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కేసుల నుంచి తప్పించుకునేందుకే బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ దిల్లీ పర్యటనకు వెళ్తున్నారని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ విమర్శించారు. బాధ్యతగల ప్రజాప్రతినిధిగా పోలీసుల విచారణకు కేటీఆర్‌ సహకరించాలని సూచించారు. సోమవారం హైదరాబాద్‌లోని రవాణాశాఖ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ హయాంలో నిర్వహించిన కార్‌రేస్‌లో ఆనాటి మున్పిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని విచారణలో తేలిందనీ, ఇందుకు సంబంధించి ఆయనపై చర్యలు తీసుకునేందుకు గవర్నర్‌ అనుమతి కోరామని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎక్కడ జైలుకు వెళ్లాల్సి వస్తుందేమోననే భయంతో ఢిల్లీలోని బీజేపీ నాయకులతో బేరం కుదర్చుకునేందుకు కేటీఆర్‌ వెళ్లారని ఎద్దేవా చేశారు. అమృత్‌ టెండర్లలో రాష్ట్ర ప్రభుత్వ అక్రమాలకు పాల్పడిందని బీఆర్‌ఎస్‌ చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని మంత్రి స్ఫష్టం చేశారు. ”మేం ఎవర్నీ జైల్లో పెడతామని అనలేదు.
అమృత్‌ పథకంలో అవినీతి జరిగితే కేంద్రానికి ఫిర్యాదు చేయవచ్చు. కానీ, మీ మీద జరిగే విచారణను తప్పించుకునేందుకే ఢిల్లీ వెళ్తున్నట్లు తెలుస్తోంది. విచారణకు సహకరించండి. మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి” అని కేటీఆర్‌కు పొన్నం సూచించారు.