ఆరు నెలల కాలంలో ఒక్క నోటిఫికేషన్ రాలేదు..గాడిద గుడ్డే వచ్చింది: కేటీఆర్

నవతెలంగాణ – హాలియా 

కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన ఆరు నెలల కాలంలో ఒక్క నోటిఫికేషన్ రాలేదని గాడిద గుద్దే వచ్చిందని.30 వేల ఉద్యోగాలు ఇచ్చామంటూ సీఎం రేవంత్ రెడ్డి బొంకుతున్నాడని బీఅర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు అరోపించారు. వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికల్లో భాగంగా మంగళవారం హాలియాలో జరిగిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఊసరవెల్లి రంగులు మార్చినట్లే సీఎం రేవంత్ రెడ్డి మాటలు మారుస్తున్నాడని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ గత పదేళ్ల కాలంలో ఎంతో అభివృద్ధి చేసిందని అన్నారు. రాష్ట్రంలో రూ. 3. 5 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించి దేశానికి 5.5 శాతం జీడీపీ కి సహకరించినట్టు తెలిపారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య కేవలం 1.8 శాతం మాత్రమే ఓట్ల తేడా ఉందని, సీట్లలో కాంగ్రెస్ పార్టీకి 25 సీట్లు అధికంగా వచ్చాయని వివరించారు.2014 లో తాము అధికారంలోకి వచ్చిన సమయంలో రాష్ట్రంలో 3.5 లక్షల మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారని, గత పది ఏళ్లలో తమ ప్రభుత్వం పది లక్షల ఉద్యోగాలు కల్పించిందని పేర్కొన్నారు. అంతేకాకుండా కొత్త జోనల్ వ్యవస్థలో 95 శాతం రిజర్వేషన్లు స్థానికులకే దక్కేందుకు రాష్ట్రపతిచే అమోదముద్ర వేయించిన ఘనత మాజీ సీఎం కేసీఆర్ దేనని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు డిసెంబర్ 9 న రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని, రైతుబంధు ఇస్తానని రైతులను మోసం చేశారని ఆరోపించారు. అంతేకాకుండా తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు రూ.500 బోనస్ ను ఇస్తామని నమ్మబలికి ఓట్లు వేయించుకున్నాడని విమర్శించారు.
బోనస్ పై సీఎం రేవంత్ రెడ్డి మాట మారుస్తున్నాడని, కేవలం సన్నా వడ్లకే బోనస్ ఇస్తామని, దొడ్డువడ్లకు ఇవ్వమని మరోసారి మోసం చేసేందుకు సిద్ధమయ్యాడని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది బోనస్ కాదని, అంతా బోగస్సే నని ఆరోపించారు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో బోనస్ లో అంతే నిజాయితీ ఉండని విమర్శించారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టును అధికారానికి వచ్చిన నెలలోపే కేఅర్ఎంబీకి అప్పగించాడని, ఈ విషయంపై మాజీసీఎం కేసీఆర్ ప్రశ్నిస్తే తాము సంతకం చేయలేదని నమ్మబల్కుతున్నాడని మండిపడ్డారు.కేంద్ర ప్రభుత్వ షరతుకు లొంగనోడు మాట మాటకు ఉత్తరాలు ఎందుకు రాస్తున్నాదని ప్రశ్నించారు. గత రబీ సీజన్లో పంటలను కాపాడేందుకు ఒక్క తడి నీరిస్తే పది లక్షల ఎకరాల పంట పండేదని, ఏపీ ప్రభుత్వం ఎటువంటి షరతులు లేకుండా 4.5 టీఎంసీల నీరు తీసుకుపోయినా ప్రశ్నించకపోవడం దారుణం అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న ఓ బ్లాక్ మెయిల్ అని, ఆయనను గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులను అందర్నీ బ్లాక్ మెయిల్ కు పాల్పడతాడని ఆరోపించారు. ఉన్నత విద్యావంతుడైన రాకేష్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు పట్టభద్రులు ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, గుంటకండ్ల జగదీష్ రెడ్డి మాట్లాడుతూ బీఅర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే ప్రశ్నించే గొంతుక అవుతారని తెలిపారు. నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ అభ్యర్థి విశ్రాంత ఐజి అర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాదారు. పట్టభద్రుల నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎం సీ కోటిరెడ్డి, జెడ్బీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నోముల భగత్, కంచర్ల భూపాల్ రెడ్డి, గాదరి కిషోర్, కర్నే ప్రభాకర్, ఇస్లావత్ రామచంద్రనాయక్, రాజీవ్ సాగర్, విజయేందర్ రెడ్డి, కడారి అంజయ్య, ఎంపీపీలు సుమతి జయమ్మ, బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు వర్ర వెంకటరెడ్డి, నల్లగొండ సుధాకర్,అయా మండల పార్టీల అధ్యక్షులు పాల్గొన్నారు.