– టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు మాటలు మతిభ్రమించినట్టున్నాయని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు జి.నిరంజన్ విమర్శించారు. సోమవారం గాంధీభవన్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కూడా కాలేదు. ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు మెరుపు తీగల్లాగా పని చేస్తున్నారు. ఆరు గ్యారంటీ స్కీమ్స్ అమలు చేయడానికి కృషి చేస్తున్నారు. గ్యారంటీలు ఎన్నికల కోడ్ రాకముందే అమలు చేయాలంటూ హరీశ్ రావు ప్రజల్లో అభద్రత కల్పించే ప్రయత్నం చేస్తున్నారని నిరంజన్ విమర్శించారు. వంద రోజుల్లో అమలు చేస్తామని హామీ ఇచ్చామనీ, చేసి తీరుతామని తెలిపారు. 32 యూట్యూబ్ ఛానెల్స్ పెట్టుకుంటే గెలిచేవారమంటూ కేటీఆర్ ట్వీట్ చేయడం అహంకారానికి నిదర్శనమని నిరంజన్ విమర్శించారు. దిగజారుడు రాజకీయాలకు స్వస్తి పలకాలని బీఆర్‌ఎస్ నాయకులను డిమాండ్ చేశారు. 22 క్రూయిజ్ వాహనాలపై కడియం శ్రీహరి, కల్వకుంట్ల కవితలు ఒకే రోజు భిన్నంగా మాట్లాడారని గుర్తుచేశారు.