ఎమ్మెల్యే విజయుడిపై అధికారుల తీరు పట్ల కేటీఆర్‌ ఆగ్రహం

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఎమ్మెల్యే విజయుడిపై ప్రభుత్వాధికారులు వ్యవహరించిన తీరు పట్ల బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షులు, ఎమ్మెల్యే కే.తారకరామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయిన కాంగ్రెస్‌ నాయకుల్ని గద్వాల జిల్లా యంత్రాంగం అధికారిక సమావేశాలకు, కార్యక్రమాలకు ఎందుకు ఆహ్వానిస్తున్నదనే దానిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమాధానం చెప్పాలని అడిగారు. ప్రజాపాలనలో ప్రజాప్రతినిధులకు ప్రతిరోజూ అవమానాలేనా? అని ప్రశ్నించారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులను అవమానించేందుకు ఈ ప్రభుత్వం ప్రోటోకాల్‌ విధానాలను ఏమైనా మార్చిందా? అని నిలదీశారు.