హెచ్‌ఎండీఏ కుంభకోణం వెనుక కేటీఆర్‌

– టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
హెచ్‌ఎండీఏ కుంభకోణం వెనుక మాజీ మంత్రి కేటీఆర్‌, ఐఏఎస్‌ అధికారి అరవింద్‌కుమార్‌ హస్తముందని టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్‌ విమర్శించారు. బీఆర్‌ఎస్‌ పదేండ్ల పాలనపై చర్చకు సిద్ధమా?అని ఆయన సవాల్‌ విసిరారు. శనివారం హైదరాబాద్‌లో ఆయన మీడియా తో మాట్లాడుతూ హైదరాబాద్‌, రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో విలువైన భూములను హస్తగతం చేసుకోవడానికి కేటీఆర్‌ బృందం అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. హెచ్‌ఎండీఏలో బాలకృష్ణలాగే మరికొంతమంది తిమింగ లాలున్నాయని అన్నారు. ఒక డైరెక్టర్‌ రూ.500 కోట్లు సంపాదిస్తే ఆ పదవి ఇచ్చిన కేటీఆర్‌ ఎంత సంపాదించి ఉంటారో ఆలోచించాలని కోరారు. ఢిల్లీలో ఉన్న అరవింద్‌కుమార్‌ను తెచ్చి హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా నియమించి అవినీతిని ప్రోత్సహించారని విమర్శిం చారు. ప్రజాపాలనపై కేటీఆర్‌, హరీశ్‌రావుకు మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. 50 రోజుల పాలనలో రాష్ట్రంలో మార్పు వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యూఐ ఓయూ అధ్యక్షులు మెడ శ్రీను, నాయకులు సుమన్‌గౌడ్‌, స్వాతి, సైదులు, మహేంద్ర, రాజు, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.