కాంగ్రెస్‌పై భ్రమలు తొలిగాయి : కేటీఆర్‌

– నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ముఖ్యనేతల సమావేశంలో కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజలకున్న భ్రమలు వంద రోజుల్లోనే తొలిగిపోయాయని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు, ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. అతి తక్కువ సమయంలోనే గారడీ మాటలు తప్ప చేతలు లేని సర్కారు అని తేలిపోయిందని చెప్పారు. శనివారం హైదరాబాద్‌లో నాగర్‌ కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గ ముఖ్యనేతలతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నాగర్‌ కర్నూలు పార్లమెంట్‌ స్థానం నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌ వందకు వందశాతం గెలవబోతున్నారని కుండబద్దలు కొట్టారు. నేతలు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి.. అత్యధిక మెజారిటీ సాధించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. తనకు వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నాయని సీఎం అసహనంతో మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.