నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తమకు సంబంధం లేని విషయాల్లో, తమ పేరును, ఫొటోలను ప్రస్తావిస్తున్న ప్రతి ఒక్క మీడియా సంస్థ యూట్యూబ్ ఛానల్ పైనా న్యాయపరమైన చర్యలతో పాటు పరువు నష్టం కేసులు వేస్తామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. ఈ మేరకు శనివారం మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానళ్లకు ఆయన నోటీసులు పంపారు. ఆ సంస్థలు భవిష్యత్తులోనూ నోటీసులతోపాటు, కేసులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. కేవలం తనను, తన కుటుంబాన్ని బదనాం చేయాలనే కుట్రలో భాగంగా అసత్య ప్రచారాలను, కట్టు కథలను ప్రచారం చేస్తున్నారని తెలిపారు. మీడియా ముసుగులో కుట్రలు చేస్తున్నాయని పేర్కొన్నారు. తమ ఫొటోలను వాడుకుంటూ అత్యంత హీనమైన తంబ్ నెయిల్స్ పెడుతూ పబ్బం గడుపుతున్న ఈ ఛానళ్లపై చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. ఇప్పటికైనా తమకు, తమ కుటుంబానికి సంబంధంలేని అంశాలపై పెట్టిన వీడియోలను వెంటనే తొలగించాలని ఆయా సంస్థలకు పంపిన లీగల్ నోటీసుల్లో పేర్కొన్నారు. వాటిని తొలగించకుంటే మరిన్ని చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొందరు వ్యక్తులు నడిపే యూట్యూబ్ ఛానల్‌తో పాటు కొన్ని మీడియా సంస్థలు కూడా పక్కా ప్రణాళిక ప్రకారం తమపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు.