– ఫిషరీస్ చైర్మెన్ మెట్టుసాయికుమార్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర విభజన వ్యతిరేకులైన మాజీ మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, గంగుల కమలాకర్ పక్కన పెట్టుకుని కేటీఆర్ దీక్షా దివస్ సంబురాలా? అని ఫిషరీస్ చైర్మెన్ మెట్టు సాయికుమార్ ఎద్దేవా చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. బీఆర్‌ఎస్ నేతల జీవితమంతా అబద్ధాలేనని విమర్శించారు. కేసీఆర్ లేకపోతే కేటీఆర్ ఎవరు? ఆయన స్థాయి ఎంత? బతుకెంత? అని ప్రశ్నించారు. కేటీఆర్ లాంటి కంచరగాళ్లకు తాము బయపడుతామా? కేటీఆర్ డ్రగ్స్ తీసుకోకుండా బయటకు వస్తాడా? కేటీఆర్ అనుకోకుండా లీడర్ అయ్యారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో బీఆర్‌ఎస్ పార్టీ ఉండదనీ, కేటీఆర్ కూడా ఉండబోరని తెలిపారు. పదేండ్ల పాలనలో విద్యార్థులను, రైతులను అరెస్టు చేసి జైళ్లకు పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌పై ఇంకోసారి పిచ్చిపిచ్చిగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఎవరు, ఎవర్ని ఉరికిస్తారో చూసుకుందామా? అని సవాల్ విసిరారు. బీఆర్‌ఎస్ పేరు పెట్టుకున్న రోజే తెలంగాణతో మీకు పేగు బంధం తెగిపోయిందని తెలిపారు. ఇప్పటికైనా కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.