కేటీఆర్ ఆశా కార్యకర్తలకు క్షమాపణలు చెప్పాలి

నవతెలంగాణ- కోటగిరి: హన్మకొండలో కేటీఆర్ పర్యటన సందర్భంగా ఆశా కార్యకర్తలు తమ సమస్యలను పరిష్కరించాలని కోరగా, పనికిమాలిన యూనియన్లు పెట్టుకొని, పసలేని వాళ్ళ మాటలు వింటున్నారని, ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోతున్నారంటూ మాట్లాడిన మాటలను నిరసిస్తూ, సీఐటీయూ ఆధ్వర్యంలో శనివారం కోటగిరి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి నన్నేసాబ్ మాట్లాడుతూ, మంత్రి కేటీఆర్ ఆశా కార్యకర్తలను కించపరుస్తూ, వారి పోరాటాలను హేళన చేసి, మహిళా సమాజాన్ని  అవమానపరిచారని నన్నేసాబ్ మండిపడ్డారు. కరోనా సమయంలో ఆశా కార్యకర్తల సేవలను ప్రభుత్వం కొనియాడిన సంగతి మర్చిపోవద్దన్నారు. మంత్రి కేటీఆర్ మాట్లాడిన మాటలను వెంటనే వెనక్కి తీసుకొని, ఆశా కార్యకర్తలకు, మహిళా సమాజానికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు సుజాత, రేష్మ, స్వప్న, అనిత, కమల, పోషవ్వ, సమత, గంగామణి తదితరులు పాల్గొన్నారు.