యూట్యూబ్‌ ఛానళ్లపై క్రిమినల్‌ కేసులు పెడతాం : కేటీఆర్‌

On youtube channels We will file criminal cases: KTRనవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కుట్రపూరితంగా అసత్యాలను ప్రచారం చేస్తూ, పరువునష్టం కలిగిస్తున్న యూట్యూబ్‌ ఛానళ్లపై క్రిమినల్‌ కేసులు పెడతామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారకరామారావు హెచ్చరించారు. కచ్చితంగా అలాంటి ఛానళ్లపై పరువు నష్టం దావాలు వేస్తామన్నారు. వ్యక్తిగతంగా తనను, తమ పార్టీని దెబ్బతీయాలన్న కుట్రతోనే కొన్ని యూట్యూబ్‌ ఛానళ్లు వ్యవహరిస్తున్నాయనీ, ఇలాంటి వాటిపై అధికారికంగా గూగుల్‌కి కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. ప్రజలు ఇలాంటి ఛానళ్ల ప్రచారంపై జాగ్రత్త వహించాలని చెప్పారు. ఈ మేరకు ఆదివారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన యూట్యూబ్‌ ఛానళ్లు కొన్ని, ఏలాంటి ఆధారాలు లేకుండా అడ్డగోలుగా, అసత్యాలను పదేపదే ప్రసారం చేస్తున్నాయని చెప్పారు. ప్రజలను తప్పుతోవ పట్టించేలా థంబ్‌ నెయిల్స్‌ పెడుతూ, వార్తల పేరుతో అబద్ధాలను చూపిస్తున్నాయని మండిపడ్డారు. గుడ్డి వ్యతిరేకతో… అధికార పార్టీ ఇచ్చే డబ్బులకు ఆశపడో ఇలాంటి నేరపూరితమైన, చట్టవిరుద్ధమైన వీడియోలను, ఫేక్‌ న్యూస్‌లను ప్రచారం చేస్తున్నాయన్నారు.
రైతుల్ని కాపాడండి : బీఆర్‌ఎస్‌ నేతల విజ్ఞప్తి
రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయనీ, ప్రభుత్వం రైతుల్ని ఆదుకోవాలని బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆదివారంనాడిక్కడి తెలంగాణ భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి, నల్గొండ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి, భువనగిరి అభ్యర్థి క్యామ మల్లేష్‌, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, మల్లికార్జున్‌రెడ్డి తదితరులు మాట్లాడారు. బ్యాంకులు అప్పులు ఇవ్వకపోయినా, రైతులు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు ప్రయివేటు అప్పులు తెచ్చుకుంటున్నారని అందోళన వ్యక్తం చేశారు. లక్షలాది ఎకరాల పంట పొలాలు నీళ్లు లేక ఎండిపోతున్నాయనీ, కాళేశ్వరం నుంచి 100 టీఎంసీల నీరు లిఫ్ట్‌ చేసుకునే అవకాశం ఉన్నా చేయలేదనీ, కుంగిన పిల్లర్ల పేర్లు చెప్పి రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. దేశరాజధాని ఢిల్లీ ఎన్నికల్లో తరచూ ఓడిపోతున్నామనే మోడీ ప్రభుత్వం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిందనీ, రెండేండ్లు విచారించిన కేంద్ర దర్యాప్తు సంస్థలు ఒక్క ఆధారం సంపాదించలేకపోయాయని అన్నారు. ఎమ్మెల్సీ కవితపై పెట్టిన కేసు రాజకీయ ప్రేరేపితమేననీ, అది వీగిపోతుందనే విశ్వాసం తమకు ఉందన్నారు.