కేటీఆర్‌ రాక ఆలస్యం..?

– బీఆర్‌ఎస్‌ వర్గాలకు సైతం స్పష్టత కరువు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అమెరికా పర్యటనలో ఉన్న బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ తిరిగి హైదరాబాద్‌కు రావటానికి ఇంకా సమయం పడుతుందా..? ఇప్పుడప్పుడే ఇక్కడకు రావటానికి ఆయన సుముఖంగా లేరా..? అంటే అవుననే సమాధానమే ఆ పార్టీ వర్గాల నుంచి వస్తున్నది. బీఆర్‌ఎస్‌ తొలి జాబితా నేపథ్యంలో.. అలకలు, అసంతృప్తులకు దూరంగా ఉండేందుకే ఆయన గత నెల 19న అమెరికా ఫ్లయిటెక్కిన విషయం విదితమే. దీంతోపాటు పలు అధికారిక, కుటుంబ పనుల నిమిత్తం మంత్రి ఆ దేశంలో పర్యటించారు. ఈ క్రమంలో షెడ్యూల్‌ ప్రకారం ఆయన శుక్రవారమే హైద రాబాద్‌కు తిరిగి రావాల్సి ఉంది. కానీ రాలేదు. దీంతో శనివారం కేటీఆర్‌ తిరుగు ప్రయాణమవుతారనే వార్తలొచ్చాయి. అయితే ఈ వార్తలపై ఇటు మంత్రి కార్యాలయంగానీ, అటు తెలంగాణ భవన్‌ వర్గాలుగానీ స్పష్టతని వ్వలేకపోవటం గమనార్హం. ఈ క్రమంలో ఆయన రాక మరింత ఆలస్యం కానుందని తెలుస్తోంది. దీంతో టిక్కెట్లు ఆశించిన ఆయన సన్నిహితులు, స్నేహితులు మరిన్ని రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.