నవతెలంగాణ-కంటోన్మెంట్
ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబాన్ని ఆదివారం మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పరామర్శించారు. సికింద్రాబాద్ కార్ఖానాలోని లాస్య నివాసానికి వెళ్లి ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లర్పించారు. అనంతరం కుటుంబసభ్యులను పరామర్శించారు. బీఆర్ఎస్ ఎల్లవేళలా వారి కుటుంబానికి అండగా ఉంటుందని, లాస్య తల్లి గీత, సోదరీలు నమ్రత, నివేదితకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. చిన్న వయసులోనే లాస్య రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరంగా ఉందన్నారు. తాను విదేశాల్లో ఉన్న కారణంగా లాస్య అంత్యక్రియలకు హాజరుకాలేక పోయానని తెలిపారు. లాస్య ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నానన్నారు. ఏడాది వ్యవధిలోనే సాయన్న, లాస్యలు మరణించడం కంటోన్మెంట్ ప్రజానీకానికి తీరని లోటని అన్నారు. వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని కోరుతున్నట్టు చెప్పారు. ఆయనతో పాటు ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మాధవరం కృష్ణారావు, మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ రావు, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహమూద్ అలీ, మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, అలా వెంకటేశ్వర రెడ్డి పాల్గొని లాస్య కుటుంబ సభ్యులను పరామర్శించారు.