పల్లెలు, పట్టణాల్లో పడకేసిన పాలన : కేటీఆర్‌

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఇందిరమ్మ పాలనలో రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాల్లో పాలన పడకేసిందనీ, పారిశుధ్యం, డ్రెయినేజీ నిర్వహణ అధ్వాన్నంగా తయారై కంపుకొడుతున్నాయని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షులు కె.తారకరామారావు విమర్శించారు. బుధవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. నిధుల్లేక, పెండింగ్‌ బిల్లులు రాక పంచాయతీలు తీవ్ర సంక్షోభంలో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజాపాలనంటే పంచాయతీలకు పైసలివ్వకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనా? కేంద్రం నిధులను దారిమళ్లించడమేనా? అని ప్రశ్నించారు. డెంగ్యూ, మలేరియా లాంటి విష జర్వాలు విజృంభించి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ పాలనలో ప్రతి నెలా పంచాయతీలకు ఠంచన్‌ గా రూ.275 కోట్లు విడుదల చేశామని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ పాలనలో పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని అడిగిన పాపానికి 1800 మంది మాజీ సర్పంచులపై నిర్బంధాలు, అక్రమ అరెస్టులు మోపారని విమర్శించారు. 15వ ఆర్థిక సంఘం నుంచి అందిన రూ.500 కోట్ల నిధులను గ్రామపంచాయతీలకు ఎప్పుడు ఇస్తారని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఉపాధి హామీ చట్టం, హెల్త్‌ మిషన్‌ నుంచి వచ్చిన రూ. 2100 కోట్ల కేంద్ర నిధులను ఎందుకు దారి మళ్లించాలో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. మొత్తం 12,769 పంచాయతీల్లో పేరుకుపోయిన విద్యుత్‌ బకాయిలే రూ.4305 కోట్లుగా ఉన్నాయని తెలిపారు. మున్సిపాలిటీల్లో రూ.1200 కోట్లకుపైగా ఉన్న పెండింగ్‌ బిల్లులను ఇంకెప్పుడు విడుదల చేస్తారని ప్రశ్నించారు. కనీసం కార్మికులకు వేతనాలు కూడా చెల్లించలేని దుస్థితి రాష్ట్రంలో ఉందని విమర్శించారు. ఆగష్టు 15 లోపు బకాయిలు చెల్లించకపోతే ఆందోళన చేస్తామంటున్న మున్సిపల్‌ కాంట్రాక్టర్ల కష్టాలను తీర్చే తీరిక ఈ ప్రభుత్వానికి లేదా? అని ప్రశ్నించారు.