కులకష్పే

మంద వెట్టి శెండ్లల్లా వడకుంటా
సుట్టు జాలనో తడకలో కట్టినట్లు
మనం అక్షరాల వైపు పొకుంటా
కాళ్ళకు సూట్టుకున్న కులకష్పేను
పాతాళానికి దిగ్గొట్టెందుకు
క్రాంతి కొయ్యల జాడ దోరుకుతదేమో లెంకలే

పాల్మర్వని పిల్లలు
తల్లేంబడి వడకుంటా గూడ్కా గప్పినట్టు
బడిబాట పట్టకుంట
మనల్ని నిర్బంధించిన కులకష్పే గప్పను ఎత్తెందుకు
హైడ్రలెమన్న ఇటుబందుకు అస్తున్నయేమో సూడలే

మేత కోసం మందను మన్నెం తోలినట్టు
కులకష్పేను ఏ గుట్టకన్న గెద్మి
మనల పుస్తకాలు పట్టిపిచ్చేందుకు
సుట్టు ఏడెడు పద్నాలుగు ఊర్ల అవుతలన్న
మాయల మరాఠీ పాణం చిలుకలున్నట్టు
సూది మొనంత అవకాశం ఉన్నదేమో అడిగి రావలే

మంద ఆకలి దిర్స తుమ్మకాయ దులిపినట్టో
యాపమండ నరికినట్టో
అడువులకు జోగు దొలుతున్న కులకష్పే అంటును నరికి పలక బలపల సద్ది గట్టే
గొడ్డలసుంటి గట్టి సుట్టమేవరన్న
మనకున్నరేమో ఆలోచన జేయ్యలే

గొవర్దన గిరిని మొసినట్టు
2020 విజన్‌ దాటేసి అచ్చిన
నిరక్షరాస్యతను భుజాల మీద ఎత్తుకుని మొస్తున్న
జాతి కులకష్పేను దించి
అక్షరాలతో 2050 వైపుకు నడిపించే
అల్లా ఉద్దీన్‌ అద్భుత దీపం ఎమన్నా ఉన్నదేమో కనుగొనలే

అక్కడిక్కడ దేవులడుతు ఎతుకుడు బంజేసి
ఇంకా కులకష్పేనే బతుకుదెరువు జేసుకొని బతుకుమని
కుల పథకాలు పెడుతున్న
పాలకుల కుతికే విస్కలా
అప్పుడే సుద్దముక్క మన చేతిలోకచ్చి
విద్యతో విలువైన ఆయుధంగా తయారవుతం
– జి.యం.నాగేష్‌ యాదవ్‌ 9494893625