కులరక్కసి రక్తదాహం

Kularakkasi is bloodthirstyకులోన్మాదం ఎంతటి దారుణానికైనా ఒడిగడుతున్నది. ఆ ఉన్మాదం తలకెక్కి సొంతవారినే బలితీసుకుంటున్న పరిస్థితి నెలకొంది. తక్కువ కులం వ్యక్తిని పెండ్లి చేసుకున్నారని కడుపున పుట్టిన పిల్లల్ని సైతం పొట్టన పెట్టుకుంటున్న సమాజంగా దిగజారింది. పరువు పేరుతో రక్త పంచుకు పుట్టినవారి ప్రాణాలు నిలువునా తీస్తున్న దుస్థితికి చేరడం ఆందోళన కలిగిస్తోంది. అలాంటి ఘటనే రెండు రోజులు కిందట హైదరాబాద్‌ మహానగరానికి కూతవేటు దూరంలోని ఇబ్రహీంపట్నంలో జరిగింది.
ప్రేమించిన వ్యక్తిని పెండ్లి చేసుకున్నందుకు తమ్ముడి చేతిలో మహిళా కానిస్టేబుల్‌ విగతజీవిగా మారింది. పెండ్లి చేసుకున్న ఇరవైరెండు రోజులకే కడతేరిపోయింది. ఈ ఘటనలో కులంతో పాటు ఆర్థికాంశం కూడా ప్రధాన భూమిక పోషించింది. కులం తక్కువ వ్యక్తిని పెండ్లి చేసుకున్నందుకు తల్లి ద్వారా ఆమెకు సంక్రమించిన ఎకరం పొలాన్ని తిరిగి తన పేర రాయమంటూ ఇబ్బంది పెట్టాడు తమ్ముడు. రాసిన తర్వాత భవిష్యత్తులో మళ్లీ ఎక్కడ పేచీకి వస్తుందోనని, ఇకపై ఆ ఆస్తితో ఆమెకు ఎలాంటి సంబంధం వుండబోదని సంతకాలు పెట్టమని బెదిరింపులకు గురిచేశాడు. ఆమె దానికి ఒప్పుకోకపోవడంతో కక్ష పెంచుకున్నాడు. అవకాశం కోసం ఎదురుచూసి కారుతో గుద్ది, కొడవలితో దాడిచేసి ఆస్తికి అడ్డులేకుండా పాశవికంగా హత్యచేశాడు.
సమాజంలో తరతరాలుగా కొనసాగుతున్న కుల వివక్షకే కాదు, లింగ వివక్షకూ ఈ ఉదంతాన్ని ఓ ఉదాహరణగా చూడొచ్చు. మనుషులు ఇలా కులం కోసం, ఆస్తి కోసం ప్రాణాలు తీస్తూ దారుణాలకు పాల్పడుతున్నారు. కాదు కాదు.. ఇలాంటి పరిస్థితుల్లోకి నెట్టివేయబడుతున్నారు. మానవ విలువలు, కుటుంబ విలువలను మంటగలుపుతున్నారు. కులోన్మాదాన్ని పెంచి పోషిస్తున్న నేటి సమాజం వీటికి పరువు హత్యలు, హానర్‌ కిల్లింగ్స్‌ అంటూ గౌరవ ప్రదమైన పేర్లతో పిలుస్తోంది. ఇలాంటి హత్యలకు బలైపోతున్న వారు ముఖ్యంగా దళితులు, మహిళలే. వాస్తవానికి ఇవన్నీ కులదురహంకార హత్యలు. సమాజం ప్రజలపై రుద్దిన మూర్ఖత్వపు మూఢాచారాలకు నిదర్శనాలు. అలాంటి మూఢాచారాలను పెంచిపోషిస్తున్న ప్రతి ఒక్కరికీ ఈ హత్యల్లో భాగమున్నట్టే.
ఒకప్పుడు కులదురహంకార హత్యలు ఉత్తర భారతదేశానికి మాత్రమే పరిమితం. కానీ ఇప్పుడు దక్షిణ భారతదేశానికి కూడా వ్యాపిం చాయి. మరీ ముఖ్యంగా తమిళనాడు, ఆంధ్రా, తెలంగాణలో ఇటీవల కాలంలో కులోన్మాద హత్యల సంఖ్య నానాటికి పెరిగిపోతోంది. ‘చంపకపోతే మనకు పరువు లేదు, చంపితేనే మన కులగౌరవాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు’ అంటూ ఇలాంటి హత్యలను రెచ్చగొడుతున్న వారు చుట్టూ ఎందరో ఉన్నారు. ఇక మనిషి అణువణువునా అంటరాని తనాన్ని జొప్పించే మనువాదాన్ని నెత్తిన పెట్టుకు తిరుగుతున్న నేటి బీజేపీ పాలనలో కులదురహంకార హత్యలు పెరగడంలో ఆశ్చర్యమేముంది. మనుధర్మం మనుషులను ముక్కలుగా చేస్తోంది. కుల, మతాల గీతలు గీసుకుని బయటి ప్రపంచాన్ని చూడలేక దేశం తిరోగమన దారిపట్టింది.
అంటరానితనం అమానుషం అని స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి చెప్పుకుంటూనే ఉన్నాం. అయినా కులం తన పంజా విసురుతూనే ఉంది. తక్కువ కులాలపై కత్తులతో దాడి చేస్తూనే ఉంది. దీనికి కారణమెవరు? కచ్చి తంగా స్వార్థ రాజకీయాలే. తమ రాజకీయాలకు అనుకూలంగా వీటిని మార్చుకుంటున్నారు. కులాల మధ్య చిచ్చురేపి అధికారాన్ని నిలబెట్టుకో వాలని చూసే నాయకులు ఉన్నంత కాలం కులం ఇలా వర్ధిల్లుతూనే ఉంటుంది. పరువు పేరుతో ఎంతమందినైనా పొట్టన పెట్టుకుంటుంది. అందుకే కులాంతర వివాహాల సమస్యను కేవలం కుటుంబ వ్యవహారంగా కాక అదొక సామాజిక సమస్యగా పరిగణించాల్సిన అవసరం ఉంది. ప్రేమ పెండ్లి చేసుకున్నందువల్ల గత రెండు శతాబ్దాల్లో దేశ వ్యాప్తంగా 44,412 హత్యలు జరిగాయని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. బయటపడని కేసులను కూడా లెక్కకడితే ఈ సంఖ్య మరింత పెరుగుతుంది.
ఈ నేపథ్యంలో కులదురహంకార హత్యలను నివారించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ ప్రభుత్వాలు వాటి జోలికి వెళ్లే ధైర్యం చేయడం లేదు. సీపీఐ(ఎం) దీనికి సంబంధించిన ముసాయిదా బిల్లును 15 ఏండ్ల కిందటే ఆనాటి కాంగ్రెస్‌ ప్రభుత్వానికి అందజేసింది. బాధితులకు షెల్టర్‌, పరిహారం, కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్న వారికి రక్షణ తదితర అంశాలు ఆ బిల్లులో పొందుపరిచింది. కానీ నాటి కాంగ్రెస్‌కు గానీ, నేటి బీజేపీకి గానీ ఆ చట్టం రావడం ఇష్టం లేదు. అందుకే మౌనంగా ఉన్నాయి. అయితే రాజకీయ జోక్యం లేకుండా కేవలం సామాజిక అభివృద్ధి ద్వారా మాత్రమే కుల నిర్మూలన, లింగ సమానత్వం అసాధ్యమని అంబేద్కర్‌ ఏనాడో చెప్పాడు. కనుక ఇప్పటికైనా ప్రభుత్వాలు దీనిపై దృష్టిపెట్టాలి. కుల దురహంకార హత్యల నిరోధానికి ప్రత్యేక చట్టం రూపొం దించాలి. ఇలాంటి హత్యలను నివారించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. కుల వివక్షను, ఇలాంటి దారుణాలను తీవ్రంగా పరిగణించి అరికట్టడం ప్రభుత్వాల విధి.