కుల్‌చా మాయ!

Kulcha Maya!– చాహల్‌, కుల్దీప్‌ మాయజాలం
– రాణించిన అర్షదీప్‌, హార్దిక్‌
– వెస్టిండీస్‌ 149/6
– భారత్‌, విండీస్‌ తొలి టీ20
కరీబియన్లపై టీమ్‌ ఇండియా ప్రతాపం కొనసాగుతుంది. టెస్టు, వన్డేల్లో విండీస్‌ను చిత్తు చేసిన భారత్‌.. ఇప్పుడు పొట్టి ఫార్మాట్‌లోనూ అదే దారిలో నడుస్తుంది. ‘బౌండరీ హిట్టర్ల’ జట్టును తొలుత స్పిన్నర్లు కట్టడి చేయగా.. పేసర్లు శాసించారు. భారత బౌలర్లు రాణించటంతో తొలి టీ20లో వెస్టిండీస్‌ తొలుత 149/6 పరుగులే చేసింది.
నవతెలంగాణ-టరౌబ
సుదీర్ఘ విరామం అనంతరం ‘కుల్‌చా’ కాంబినేషన్‌ ఖతర్నాక్‌ ప్రదర్శన చేసింది. యుజ్వెంద్ర చాహల్‌ (2/27), కుల్దీప్‌ యాదవ్‌ (1/20)లు స్పిన్‌ మాయజాలంతో చెలరేగారు. ఆరంభంలో కుల్‌చా జోడీ.. ఆ తర్వాత అర్షదీప్‌ సింగ్‌, ముకేశ్‌ కుమార్‌లు మెరవటంతో తొలి టీ20లో తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ 149/6 పరుగులే చేసింది. కెప్టెన్‌ రోవ్‌మాన్‌ పావెల్‌ (48, 32 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), నికోలస్‌ పూరన్‌ (41, 34 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) వెస్టిండీస్‌కు గౌరవప్రద స్కోరు అందించారు. కైల్‌ మేయర్స్‌ (1), జాన్సన్‌ చార్లెస్‌ (3), షిమ్రోన్‌ హెట్‌మయర్‌ (10) విఫలమయ్యారు.
స్పిన్‌ మాయ : టాస్‌ నెగ్గిన వెస్టిండీస్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఆతిథ్య జట్టు ఓపెనర్లు ప్రణాళికల ప్రకారం దూకుడుగా ఆడారు. పవర్‌ప్లేలో ఫటాఫట్‌ బాదారు. బ్రాండన్‌ కింగ్‌ (28, 19 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌), కైల్‌ మేయర్స్‌ (1) తొలి వికెట్‌కు 29 పరుగులు జోడించారు. ఓ ఎండ్‌లో బ్రాండన్‌ కింగ్‌ ధనాధన్‌ మోతకు సిద్ధమయ్యాడు. కొత్త బంతితో పేసర్లను ఓపెనర్లు దీటుగా ఎదుర్కొవటంతో బంతిని స్పిన్నర్లకు చేతికి అందించాడు కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య. కరీబియన్‌ టూర్‌లో తొలిసారి తుది జట్టులో నిలిచిన యుజ్వెంద్ర చాహల్‌.. సంధించిన తొలి బంతికే వికెట్‌ పడగొట్టాడు. తొలి ఓవర్లో ఏకంగా రెండు వికెట్లు పడగొట్టి కరీబియన్లను దెబ్బతీశాడు. కైల్‌ మేయర్స్‌, బ్రాండన్‌ కింగ్‌లు ఒకే ఓవర్లో నిష్క్రమించగా.. కుల్దీప్‌ యాదవ్‌ ఓవరోల జాన్సెన్‌ చార్లెస్‌ (3) డగౌట్‌కు చేరుకున్నాడు. పవర్‌ప్లేలో 54 పరుగులు చేసిన వెస్టిండీస్‌.. ఆ తర్వాత దూకుడుగా ఆడలేకపోయింది. స్పిన్నర్ల మాయజాలం, పేసర్ల ప్రతాపంతో విండీస్‌ బ్యాటర్లు తడబాటుకు గురయ్యారు. నికోలస్‌ పూరన్‌ (41, 34 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), రోవ్‌మాన్‌ పావెల్‌ (48, 32 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరిసినా.. ఆతిథ్య జట్టు ఆశించిన స్కోరును సాధించలేదు. షిమ్రోన్‌ హెట్‌మయర్‌ (10) విఫలమయ్యాడు. డెత్‌ ఓవర్లలో అర్షదీప్‌ సింగ్‌ (2/31) నిప్పులు చెరుగగా.. ముకేశ్‌ కుమార్‌ (0/24) ఆకట్టుకున్నాడు. కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య (1/27) ఓ వికెట్‌తో మెరిశాడు.
స్కోరు వివరాలు :
వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌ : బ్రాండన్‌ కింగ్‌ (ఎల్బీ) చాహల్‌ 28, కైల్‌ మేయర్స్‌ (ఎల్బీ) చాహల్‌ 1, చార్లెస్‌ (సి) తిలక్‌ (బి) కుల్దీప్‌ 3, నికోలస్‌ పూరన్‌ (సి) తిలక్‌ (బి) హార్దిక్‌ 41, పావెల్‌ (సి) సూర్య (బి) అర్షదీప్‌ 48, హెట్‌మయర్‌ (సి) అక్షర్‌ (బి) అర్షదీప్‌ 10, షెఫర్డ్‌ నాటౌట్‌ 4, హోల్డర్‌ నాటౌట్‌ 6, ఎక్స్‌ట్రాలు : 8, మొత్తం : (20 ఓవర్లలో 6 వికెట్లకు) 149.
వికెట్ల పతనం : 1-29, 2-30, 3-58, 4-96, 5-134, 6-138.
బౌలింగ్‌ : అర్షదీప్‌ సింగ్‌ 4-0-31-2, ముకేశ్‌ కుమార్‌ 3-0-24-0, అక్షర్‌ పటేల్‌ 2-0-22-0, యుజ్వెంద్ర చాహల్‌ 3-0-24-2, హార్దిక్‌ పాండ్య 4-0-27-1, కుల్దీప్‌ యాదవ్‌ 4-0-20-1.
తిలక్‌ వచ్చాడు
తెలుగు తేజం, యువ క్రికెటర్‌ తిలక్‌ వర్మ జాతీయ జట్టు తరఫున అరంగేట్రం చేశాడు. 20 ఏండ్ల నంబూరి ఠాకూర్‌ తిలక్‌ వర్మ.. అండర్‌-19, దేశవాళీ, ఐపీఎల్‌లో నిలకడగా రాణించి జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. వెస్టిండీస్‌తో తొలి టీ20లో తిలక్‌ వర్మ భారత్‌ తరఫున తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ అవకాశం దక్కించుకున్నాడు. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో 9 మ్యాచుల్లోనే ఓ శతకం, రెండు అర్థ సెంచరీలతో 523 పరుగులు చేసిన తిలక్‌ వర్మ.. లిస్ట్‌-ఏలో 25 మ్యాచుల్లో ఐదు శతకాలు, ఐదు అర్థ సెంచరీలతో 1236 పరుగులు చేశాడు. టీ20 ఫార్మాట్‌లో 47 మ్యాచుల్లో 10 అర్థ సెంచరీలతో 1418 పరుగులు పిండుకున్నాడు. ఆఫ్‌ స్పిన్నర్‌గా ఫస్ట్‌ క్లాస్‌, లిస్ట్‌-ఏ, టీ20ల్లో 13 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. లెఫ్డ్‌ హ్యాండ్‌ బ్యాటర్‌ తిలక్‌ వర్మ.. ఈ ఏడాది ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌ తరఫున కండ్లుచెదిరే ప్రదర్శన చేశాడు. భారత వైట్‌బాల్‌ జట్టులో యువరాజ్‌ సింగ్‌, సురేశ్‌ రైనాల తర్వాత ఆ స్థాయిలో ప్రభావం చూపగల క్రికెటర్‌గా తిలక్‌ వర్మను క్రికెట్‌ పండితులు పరిగణిస్తున్నారు. చూడచక్కని బ్యాటింగ్‌ శైలి, ఒత్తిడిలోనూ అలవోకగా భారీ షాట్లు ఆడగల భయమెరుగని క్రికెట్‌ ఆడటంలో తిలక్‌ వర్మ ఇప్పటికే విమర్శకుల మెప్పు పొందాడు. పార్ట్‌ టైమ్‌ స్పిన్నర్‌గా తిలక్‌ వర్మ జట్టుకు ఉపయుక్తం. ఇక పేసర్‌ ముకేశ్‌ కుమార్‌ సైతం టీ20ల్లో అరంగేట్రం చేశాడు. విండీస్‌ పర్యటనలో మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేసిన ఘనత ముకేశ్‌ కుమార్‌ దక్కించుకున్నాడు. గతంలో 2020-21 ఆస్ట్రేలియా పర్యటనలో తమిళనాడు పేసర్‌ టి.నటరాజన్‌ సైతం మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేసినా.. గాయాలతో స్వల్ప కాలంలోనే జాతీయ జట్టుకు దూరమయ్యాడు.
నేటి నుంచి తైక్వాండో పోటీలు
హైదరాబాద్‌ : 7వ దక్షిణాసియా, 18వ సౌత్‌ వెస్ట్‌ జోనల్‌ తైక్వాండో పోటీలు గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో నేటి నుంచి ఆరంభం కానున్నాయి. 10 దేశాల నుంచి 1000కి పైగా అథ్లెట్లు ఈ టోర్నీలో పోటీ పడనున్నారు. శ్రీలంక, భారత్‌, బంగ్లాదేశ్‌, భూటాన్‌, అఫ్ఘనిస్థాన్‌, నేపాల్‌, మయన్మార్‌కు చెందిన అగ్రశ్రేణి తైక్వాండో క్రీడాకారులు పతక వేటలో బరిలోకి దిగుతున్నట్టు నిర్వాహకులు గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. క్రీడాశాఖ మంత్రి వి. శ్రీనివాస్‌ గౌడ్‌, శాట్స్‌ చైర్మెన్‌ డాక్టర్‌ ఆంజనేయ గౌడ్‌ ఈ పోటీలను నేడు అధికారికంగా ఆరంభించనున్నారు.