అది ఊహించని విషాదమేమీ కాదు. దానిపై ఏలిన వారి వాదనలూ,విన్యాసాలు కూడా ఊహించదగినవే. మహాకుంభమేళా గురించి సాగిన మహా హడావుడి ప్రచారంతో పోలిస్తే అక్కడ ముప్పై మంది బలైన తర్వాత రాజ్యమేలుతున్న మౌనం అలవాటైందే. కోట్లాది మంది పుణ్యస్నానం చేయడానికి వస్తారని ఊదరగొట్టిన పాలకులు అంతమంది ప్రజల భద్రత కోసం ప్రత్యేకంగా ఎలాటి ఏర్పాట్లు చేశారనేదానికి మాత్రం సమాధానం లేదు. ట్రాఫిక్, మంచినీరు, రాకపోకలు,పారిశుధ్యం ఏ విషయంలోనూ కోట్లమందికి అవసరమైన ఏర్పాట్లు అక్కడ లేవు. వారు కోరుకున్నట్టు స్నానాలు చేయడం పెద్ద సవాలుగా మారింది. వీఐపీలకు మాత్రం పవిత్రజలాల్లో మునకలు వేసేందుకు కావలసినంత వసతి కల్పించారు. వారికోసం విస్తారమైన సహాయక వ్యవస్థ ఏర్పాటు చేశారు. వారికి ఎలాగూ సమస్య వుండదు గానీ, భద్రత అవసరమైంది సామాన్య యాత్రీకులకే. తొక్కిసలాటల్లో చిక్కేది ప్రాణాలు కోల్పోయేది వారే. ప్రయాగరాజ్‌గా పేరు మారిన అలహాబాద్ త్రివేణీ సంగమంలో మౌని అమావాస్యనాడు జరిగిన ఘోర విషాదం అందుకు భిన్నమైంది కాదు. మృతి చెందినవారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున సహాయం ప్రకటించడం తప్ప లోతైన పరిశీలన గానీ, కనీస ఆత్మ విమర్శ గానీ లేవు. సర్కారు సంగతి అలావుంచితే బడా మీడియాలో పెద్ద భాగం కూడా ఇదే తంతు. అదే రోజున అమిత్‌షా స్నానం ఈవెంట్‌ను గొప్పగా చెప్పిన మీడియా ఈ విషాదం తీవ్రతను దాని వెనక వైఫల్యాలను నివేదించడంలో విఫలమైంది లేదా దాటేసింది. ఇంకా దారుణమేమంటే ఈ రోజున ప్రాణాలు పోగొట్టుకున్నవారు నేరుగా స్వర్గానికి వైకుంఠానికి పోతారని కూడా ప్రచారాలు సోషల్‌మీడియాలో నడుస్తున్నాయి. పురాణ సంబంధమైన విషయాల రచనలో సిద్ధహస్తుడైన దేవదత్తుని పట్నాయక్ దీనిపై వ్యాఖ్యానిస్తూ విశ్వాసం అనేది ఎలాటి విషాదానికైనా భాష్యం చెప్పగలదని అన్నారు. ఎందుకంటే త్రివేణీ సంగమంలో ఈ కుంభమేళా వెనక నమ్మకమే అది.దేవదానవులు సముద్రాన్ని మధించి అమృతం పాదించినప్పుడు కొన్నిచుక్కలు త్రివేణీ సంగమంలో కలిశాయి గనక అది పవిత్ర ప్రదేశమైందంటారు భక్తులు. త్రివేణీ అంటూ మూడు నదులను సూచిస్తున్నా సరస్వతీ నది ఉనికి ఇప్పటికీ అగోచరమే. కాకపోతే మీడియా విస్తరణ కారణంగా క్రమేణా ఇలాంటి క్రతువులు భారీ ఈవెంట్లుగా మారిపోయాయి.
అఘోరాల,అఖడాల హడావుడి
పన్నెండేండ్లకు ఒకసారి జరిగే పుష్కరాలు 12 గడిస్తే అంటే 144 ఏండ్లకు ప్రత్యేక మహాకుంభమేళాలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతం తప్ప మరొకటి కాదనే ప్రచారాలు ఉధృతంగా నడిచాయి. అందులోనూ మౌని అమావాస్య మరింత ప్రత్యేకమన్నారు.ఈ సహస్రాబ్ది ప్రారంభంలో 2001లో కుంభమేళా నాటికే మీడియా సందడి మిన్నంటింది.అప్పుడే నగ నాగసాధువులు ప్రత్యేకాకర్షణగా మారిపోయారు.పత్రకల నిండా చానళ్ల ప్రసారాల్లో వారే. హిందీ మీడియాలో ఇది మరెన్నో రెట్లు అధికంగా వుంటుంది.నాగసాధువులు శంకరాచార్యుడు ఎప్పుడో స్థాపించిన శాఖకు చెందిన వారుగా చెబుతుంటారు. వారికోసం కేటాయించిన స్థలాలనే ఆఖడాలు అంటారు. కుంభమేళాల్లో ఇలాంటి అఖాడాలు అనేకం వుంటాయి. యూపీ ప్రభుత్వం కుంభమేళాలో మత సమ్మేళనం (పార్లమెంటు)కూడా జరుపుతారు. యూపీ ప్రభుత్వం ఇందుకు స్థలం కేటాయించడం గతంలోనే వివాదమైంది.
భక్తితో పాటు భంగు కూడానా?
ఈ సాధువుల్లో ఎవరు ఎక్కువ ఏ బృందం ముందు ఎవరు వెనక వంటి అంశాలపై తగాదాలు కూడా జరుగుతుంటాయి. విదేశాల నుంచి వచ్చేవారికి ప్రత్యేక ప్రచారం హైప్ వుంటాయి. భక్తి భజనలతో పాటు భంగు వంటివి కూడా ఇక్కడ యథేచ్చగా సేవిస్తుంటారని అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతుంటాయి. క్రమం తప్పకుండా వాటిని చిత్రించేందుకే తాను కుంభమేళాకు వస్తుంటానని ఫ్రెంచి ఫొటోగ్రాఫర్ ఒకరు ప్రకటించారు. అసలు తాను వచ్చేదే అందుకోసమని ముంబాయికి చెందిన నరేంద్ర మీడియాతో చెప్పారు. గతంలోనైతే నిర్మొహి అఖడాకు చెందిన తాతంబరి బాబా ఫోకస్ పొందారు. దేశీయ సాధువులకు తోడు మామూలు సన్యాసులు కూడా వస్తారు.వీరందరితో ప్రయాగరాజ్ ముందే కిక్కిరిసిపోయింది. మొబైల్ పోన్లు ఇంటర్‌నెట్లు విచ్చలవిడిగా వ్యాపింపచేసే సందేశాలు, సమాచారాలతో మొదలుపెట్టినా త్వరగానే వాటికి అంతరాయం ఏర్పడిందట. ప్రత్యేకించి జియో, ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌లు గంటలతరబడి పనిచేయలేదట. ఒకవైపు అమావాస్యరోజు స్నానం చేస్తేనే పుణ్యం అత్యధికంగా వస్తుందనే నమ్మకం,మరోవైపు కదలలేని తొక్కిడి, ఇంకోవైపు ట్రాఫిక్ ఆంక్షలు, సమాచారం తెలుసుకోలేని ప్రతిష్టంభన వీటన్నిటి మధ్యన ఈ విధమైన విషాదాలు జరడగంలో ఆశ్చర్యం ఏముంది? అసలు ఎంతమంది చనిపోయారనే దానిపైన కూడా కనీస స్పష్టత లేకపోయింది. ఇక తమవారు ఏమైపోయారనే భయాందోళనలు మరింత ఒత్తిడి పెంచుతాయి.
నిజంగా జరిగిందేంటి?
వీఐపీల తాకిడి మధ్య ట్రాఫిక్‌ను క్రమబద్దం చేసేపేరుతో అలాగే ఆపివుంచి, తర్వాత అందరిని ఒకే చిన్న వంతెన మీడుగా వదలడంతో ఈ దారుణం జరిగిందని ప్రాథమిక నివేదికలు చెప్పాయి. 28చిన్న చిన్న వంతెనలను ఒకేసారి రాకపోకలు నిలిపేశారు.దాంతో లక్షల కోట్ల యాత్రీకులు చిన్న చిన్న రోడ్లపై పడ్డారు.ఆ తొక్కిసలాటలో వారు గంగానదిని దాటడం అసంభవమే అయింది. దానికితోడు జనవరి 28న అంటే అమావాస్య రోజున పోలీసులు విచక్షణా రహితంగా ఎటుపడితే అటు తోసేయడం అడ్డుకోవడం ఉద్రిక్తత పెంచింది. ఉదయం మొదలైన ఈ ఒత్తిడి రాత్రి వేళకు పరాకాష్టకు చేరి మహోపద్రవంగా మారింది, సంధ్య వాలుతున్న కొద్ది అమావాస్య తిథి ఘడియలు వస్తున్నాయని లౌడ్ స్పీకర్లలో ప్రకటనలు మార్మోగాయి. నిజంగా స్నానం చేయవలసింది తెల్లవారుజామున అని అనుభవజ్ఞులైన పెద్దవారైన యాత్రీకులు చెబుతుండడంతో లక్షల మంది నదీతీరంలోనే నిద్రపోయారు. తెల్లవారగానే లేచి నదిలో మునగాలని వారి ఆలోచనగా వుండింది. అయితే అర్థరాత్రి 1.30 సమయంలో నదీ తీరానికి కొత్తగా యాత్రీకుల బృందం ఒకటి వచ్చింది.వారి రాకతో వచ్చిన తొక్కిడి ఒకటైతే వెంటనే పోలీసులు వారిని ఇరుకైన సందుల్లోకి తోయడం మొదలెట్టారట. ఈ పరస్పర తోపులాటలో గందరగోళం, అయోమయం తాండవించాయి.క్రమేణా ఇది అందరిలో భయాందోళనలకు కంగారుకు కారణమైంది. అంతపెద్ద యాత్రీకుల బృందాలను పోలీసులు తోసేస్తుంటే వారు ముందుకు వచ్చినప్పుడు అక్కడ నిద్రపోతున్న వేల లక్షల మంది భక్తుల గతి ఏమయ్యేట్టు? అసహాయంగా వారిలో అనేకులు ప్రాణాలు కోల్పోయారు.కేవలం నిర్వహణాలోపం వల్లనే ఇంత ఘోరం జరిగిందనేది అక్కడ ప్రతివారి నోటవినిపించిన మాట.
వీఐపీల జాతర
దానికి తోడు అందరూ అన్నట్టు ఈ కుంభమేళా వీఐపీ కేంద్రంగా జరిగింది.వారి సెల్ఫీలు, ఫొటో ఆప్‌లు,ప్రచారం కోసం మీడియాను తెచ్చుకోవడం, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అంతా వాతావరణాన్ని కల్లోలితం చేసింది.విదేశీ ప్రతినిధి బృందాలను గొప్పగా చూపించడం మరో ప్రహసనమైంది. ఈ క్రమంలో మామూలు భక్తులు పూర్తిగా విస్మరణకు గురయ్యారు. షరా మామూలుగా ఇలాంటి భారీ జాతరలు వ్యాపారాలకు ప్రత్యేక సందర్భాలు.పర్యాటక ఆర్థిక వ్యవస్థకు ఇవే కీలకమనే వ్యూహంతో వున్నదాన్ని పదిరెట్లు ప్రచారంలో పెట్టడం, అసలు ప్రపంచంలో కెల్లా ఇదే అతి పెద్ద సంఘటన అనే భావం పెంచాలన్నది కేంద్రం యోచన.ఇక సనాతనవాదులైతే గనక భౌతిక ప్రపంచంలో ఎన్నికొరతలున్నా ఆధ్యాత్మిక ప్రపంచంలో మత విశ్వాసాల్లో భారతీయులకు సాటిలేదని చాటిచెప్పడానికి కుంభమేళాను వేదికగా చేసుకుంటారు.మౌని అమావాస్య రోజున క్రైస్తవుల జెరూసలేములో కన్నా, ముస్లిం పవిత్రక్షేత్రమైన మక్కాలోకన్నా ఇక్కడే ఎక్కువమంది సమకూరారని ప్రపంచానికి చూపడం వారి పరమలక్ష్యమని చెబుతారు దేవదత్తుని పట్నాయక్. పైగా హిందూ మతగ్రంథం ఏదీ ఆ మాట ఆదేశించకపోయినా కేవలం స్వచ్చందంగా ఇంతమంది రావడం మా మతం గొప్పతనమనేది సనాతనల ప్రచార సారం,ఇక్కడే ఆయన ఇంకో ఆసక్తికరమైన విషయం చెబుతారు.తీర్థాల్లో స్నానం చేసే ఈ సనాతనులనే బౌద్ధులు ఒకప్పుడు తాంత్రికులు అని పిలిచేవారట, సంప్రదాయ మతాల్లో ఆలోచించడం కన్నా ఆచరించడం పాటించడం ముఖ్యమట,తంతు చేయాలు గాని దాని ప్రయోజనమేమిటనిఎక్కువగా ఆలోచించరాదనేది తాంత్రికుల మాట.
హిందూత్వ పోటీ
హిందూత్వ ప్రచారం పెరిగేకొద్ది హిందూమతానికి కూడా ఇస్లాం వలె ఏదో ఒక ప్రక్రియ కావాలనే ప్రయత్నం పెరిగింది.ముస్లిములు హజ్‌చేసినట్టుగా హిందువులు కూడా ఏదోఒకటి చేయాలి గనక 2024లో అయోధ్యలో సమీకృతులైనట్టే 2025లో ప్రయాగరాజ్‌కు చేరుకున్నారని పట్నాయక్ ఇచ్చిన వివరణ తర్కబద్దంగానే కనిపిస్తుంది.ఏడో శతాబ్దిలో మొదటగా కనిపిస్తున్న ఈ కథలు ప్రస్తావనలు కాలక్రమంలో చాలా మార్పులకు గురైనాయి. మోడీ హయాంలో యోగి పాలనలో అవి పరాకాష్టకు చేరాయి. దీనికి మళ్లీ రాశులతో సంబంధం. రిషభ్ మేళా,కుంభమేలా,సింహాస్థమేలా, ఇలాచాలా వున్నాయి. అయితే నెమ్మదిగా ఈ అమృతం ప్రయాగరాజ్ దగ్గరైతే ఎప్పుడూ వుంటుందనే నమ్మకాలతో వీటన్నిటికీ కుంభమేళా అనే పేరు ఖాయం చేశారు. బీజేపీకి మెజార్టీ రాకపోవడం, త్వరలో యూపీ శాసనసభ ఎన్నికలు జరగనుండటం వల్ల ఈసారి మరింత కేంద్రీకరించారు. ఈ ఊపులోనే నటుడు ప్రకాశ్‌రాజ్ వంటివారు కూడా స్నానాలు చేస్తున్నట్టు ఫేక్ విడియో సృష్టించి వదిలారు, దానికి ఆయన తీవ్రంగా స్పందించడమే గాక సిగ్గులేదా ఇలా చేయడానికి అని ప్రశ్నించారు. ఇంతగా ప్రచారం చేసినవారు వచ్చిన వారికి తగినట్టు భద్రతా ఏర్పాట్లు ఏమాత్రం చేయకపోవడం నిజంగా సిగ్గుచేటే. గతంలోనూ ఈ ప్రాంతంలో ఇలాగే వందలమంది తొక్కిసలాటలో మరణించిన ఘటనలు నమోదైవున్నాయి. తెలుగునాట తిరుపతిలోతొక్కిసలాట, పదేళ్లకిందట గోదావరిపుష్కరాల్లో తొక్కిసలాట గుర్తు చేసుకుంటే విశ్వాసంతో పాటు భద్రత కూడా చూసుకోవాలనే విచక్షణ చాలా అవసరమని స్పష్టమవుతుంది.
– తెలకపల్లి రవి