‘పుణ్యం కోసం వెళ్తే పాపం చుట్టుకుందనే’ నానుడికి ‘ప్రయాగ్‌రాజ్’ సరిగ్గా సరిపోతుంది.ప్రపంచంలోనే ప్రసిద్ధిగల ఆధ్యాత్మిక వేడుకగా పిలువబడుతున్న ‘మహా కుంభ మేళా’ ఈనెల 13న ఉత్తరప్రదేశ్‌లో ప్రారంభమైంది. ఫిబ్రవరి 26వరకు 45 రోజుల పాటు సాగే ఈ క్రతువుకు దేశ,విదేశాల నుంచి సుమారు యాభై కోట్ల వరకు హాజరవుతారని యూపీ సర్కార్ అంచనా వేసింది. అయితే అందుకు తగిన వసతులు, భద్రతా ఏర్పాట్లు చేసిందా? నూట నలభై కోట్ల మన జనాభాలో మూప్పావు వంతు జనం ప్రయాగ్‌రాజ్‌కే తరలుతున్న పరిస్థితి. ఈమూడు రోజుల్లోనే సుమారు ఆరుకోట్ల మంది సందర్శకులు వచ్చినట్టు వార్తలు. గుడి వద్ద వందమంది గుమికూడితేనే వారిని క్రమపద్ధతిలో పెట్టడం ఒక పెద్ద సమస్య. అలాంటిది కోట్లమంది సందర్శించే ప్రాంతం,అక్కడి పరిసర వాతావరణం ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఏదైనా ప్రమాదం తలెత్తితే జరిగే నష్టాన్ని అంచనా కూడా వేయలేం.
పన్నెండేండ్లకు ఓసారి వచ్చే మహా కుంభమేళాలో భాగంగా గంగా, యుమునా, సరస్వతీ నదులు కలిసే త్రివేణి సంగమంలో భక్తులు స్నానాలాచరిస్తే పుణ్యం వస్తుందని, ఆయూరా రోగ్యాలు సిద్ధిస్తాయని ప్రజల నమ్మకం, ఆధ్యాత్మికవేత్తల ప్రచారం కూడా. అయితే ప్రజల విశ్వా సాన్ని మూఢత్వంలోకి తీసుకెళ్లే తీరు పెరిగింది. మోడీ అధికారంలోకి వచ్చిన ఈ పదేండ్లలో ఇది మరింత రెట్టింపయింది. పదివేల ఎకరాల్లో ఏర్పాటు చేసిన మహాకుంభమేళాను 55 పోలీస్‌స్టేషన్లు, 45వేల మంది పోలీసులతో భద్రతను పర్యవేక్షిస్తున్నామని యోగి సర్కార్ చెబుతున్నది. కానీ వైద్య సౌకర్యాల పరిస్థితేమిటి? నామమాత్రం. ఇప్పటికే చలికి తట్టుకోలేక పద కొండుమంది చనిపోయినట్టు సమాచారం.దీన్ని ప్రభుత్వం కొట్టిపారేస్తున్నది. ఈ మేళాలో వివక్ష కూడా బయటపడింది. సీఎం యోగి కమ్యూనిటీకి చెందిన వారికే అక్కడ సకల సౌకర్యాల్ని కల్పించి మిగతా భక్తుల్ని గాలికొదిలేసింది.
‘పుష్కరాల్లో మునగండి..పుణ్యం తెచ్చుకోండి’ అంటూ ఆరెస్సెస్-బీజేపీ పరివారం ప్రచారం చేస్తున్నది. కానీ నదిలో మునిగితే నీళ్లు కలుషితమై రోగాలు వస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వారు చెప్పింది వాస్తవం. ఇటీవల నదిలో స్నానం చేసిన యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్ భార్య పావెల్ అలర్జీతో బాధపడుతున్నట్టు జాతీయ మీడియా పేర్కొంది. స్నానం చేస్తున్నప్పుడు నీళ్లలోనే మూత్రం వదలడం జీవ సహజ లక్షణం. లక్షలాది మంది పాల్గొనే మేళాలో అన్ని టాయిలెట్లు కూడా ఉండవు. అలాగే ఒళ్లంతా బూడిద పూసుకున్న అఘోరీలు, సాధువులు కూడా ఇందులోనే మునుగుతారు. భక్తులు స్నానం చేస్తున్నప్పుడు ఈ నీళ్లన్నీ సహజంగానే నోట్లోకి పోతాయి. అది ‘పవిత్ర’ జలమా? పుష్కరాల్లో మునిగితే పుణ్యంమాట దేవుడెరుగు అంటువ్యాధులు రావడం మాత్రం ఖాయం.
ఇటీవల తిరుపతిలో జరిగిన ఘటన గుర్తుండే ఉంటుంది. వైకుంఠ ద్వారా దర్శనం టోకెన్లు జారీచేసే కేంద్రం వద్ద తొక్కిసలాటలో ఆరుగురు చనిపోయారు, అనేకమంది గాయపడ్డారు. వేలాది మందిలోనే అంతటి ప్రాణనష్టం సంభవిస్తే, లక్షలాది మంది పాల్గ్గొంటున్న మహా కుంభమేళాలో ఇలాంటిదేదైనా పొరపాటు జరిగితే? ఎవరైనా ఆ దిశగా ఆలోచించారా? గతేడాది హత్రాస్‌లో బోలేబాబా ఆశ్రమంలో జరిగిన ఘోర దుర్ఘటన మరచిపోగలమా? బాబా కాలి దూళిని తాకడానికి ప్రయత్నించిన భక్తులు తొక్కిసలాటలో 238 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదివరకు జరిగిన ఉజ్జయినీ, నాసిక్ కుంభమేళాల్లోనూ పదుల సంఖ్యలో చనిపోయారు. 1954 నుంచి జరుగుతున్న ఇలాంటి మేళాలు, కార్యక్రమాల్లో రెండువేలకు పైగానే మరణించినట్టు సమాచారం.
మతం వ్యక్తిగతం, విశ్వాసాల్ని కాదనలేం.ఎవరి విశ్వాసాలు వారికుంటాయి. కానీ వాటిని యథేచ్ఛగా ప్రేరేపించి లబ్ధి పొందాలనుకోవడమే ప్రమాదకరం. కేంద్రంలో బీజేపీ, యూపీలో యోగి సర్కార్ చేస్తున్నదదే. శాస్త్ర,సాంకేతిక పరిజ్ఞానం పెరిగేకొద్దీ సమాజంలో ఆరాధన, విశ్వాసం తగ్గాలి. కానీ ఆచరణలో అందుకు భిన్నంగా ఉండటం ఆందోళనా కరం. ప్రజల్లో తరతరాలుగా వారి మెదళ్లలో నాటుకున్న విశ్వాసాల్ని వ్యాపార సరుకుగా మార్చిన పాలక పార్టీల నేతలు పుష్కరాలు, ప్రత్యేక దర్శనాలు, మేళాల పేరుతో వారిని స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్న పరిస్థితి బాధాకరం. ప్రజల బాధలకు దేవుడు కారణం కాదు, ఆ వైపున ప్రజల్ని మళ్లించడం భావ్యం అంతకన్నా కాదు.ప్రజల కష్టాలు తీర్చాల్సింది, కన్నీళ్లు తుడవాల్సింది ప్రజలెన్నుకున్న పాలకులే.
1990ల్లో వచ్చిన ప్రపంచీకరణ విధానాలు ప్రజలకు ఉపాధి అవకాశాలు తగ్గించాయి. వీటిననుసరించిన ప్రభు త్వాలు ప్రజల్ని భ్రమల్లో ముంచి ఆశలు పెంచాయి. దీంతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన జనం ఓ వైపు రాజకీయ పార్టీలను, మరోవైపు మతవిశ్వాసాలను ఆశ్రయించాల్సిన పరిస్థితికి తెచ్చాయి. పాలక పార్టీల వాగ్దానాలను నమ్మి మోసపోవడం ఒకటైతే, కనిపించని దైవం కరుణిస్తుందనే ఆశతో పరుగులు పెట్టడం మరోటి. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని అనుకోని ఘటన జరిగితే కన్నుమూయడం పరిపాటి. ఇలాంటివి పునరావృతం కాకుండా అడుకట్ట వేయాల్సింది ప్రజా చైతన్యం. దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సింది పౌర సమాజం.