
గజరాజు హుషారుగా నీళ్లలోకి అడుగెట్టాడు. అల్లంత దూరాన ఇసకలో నోరు తెర్చుకుని పడుకున్న మొసలి గుట్టుచప్పుడు కాకుండా పాకి నీళ్లలోకి జారింది. గజరాజు తొండంతో నీళ్లు చిమ్ముకుంటూ ముందుకు సాగాడు. నీటి అడుగునించి ముందుకు సాగింది మొసలి.
షవర్‌బాత్ మత్తులో మరింత ముందుకి కదిలాడు గజరాజు. మొసలి అవసరమైన జాగా చూసుకుని వెయిట్ చేస్తున్నది. గజరాజు గజంనించి అరగజం నించి, పావుగజం దూరంలోకి రానే వచ్చాడు. తెరచుకున్న మొసలి పళ్లు ఒకదానికొకటి రాసుకుని రెడీ అయినవి. గజరాజు కాలుకి ఏదో చల్లగా తాకింది. వెనక్కి జరపాలనుకున్నాడు కాలుని. ఒక్కసారే రెండు పక్కలనంచీ దిగబడ్డయి మొసలి పళ్లు. కసిక్కిన చర్మంలో దిగబడ్డ వాటిని విదుల్చుకుందుకు కాలు జాడించాడు గజరాజు.
అంగుళం కదల్లేదది. వెనక్కి లాగేడు బలంగా. లాభం లేదు. అప్పుడు తెల్సింది గజరాజుకి తనను పట్టుకున్నదెవరో. గజరాజు కాలి మీద పట్టు దొరికే చోటు సరిగ్గా చూసుకుని పళ్లు బిగించి ‘హుమ్మంది’ మొసలి.
గజరాజు ముందుకు తూలాడు. బలమంతా ఉపయోగించి కాలు వెనక్కి లాగాడు. అవతల మొసలి మళ్లీ ‘హుమ్మని’ లాగింది. గజరాజు మళ్లీ ముందుకు తూలాడు. నీట్లో కల్సిపోతున్న నెత్తుర్ని చూసి బెంబేలు పడుతూ వెనక్కి లాగాడు. మొసలి పళ్లని మరో ఇంచి గజరాజు కాల్లో దించి లాగింది. గజరాజు ముందుకు తూలాడు. మళ్లీ వెంటనే వెనక్కి లాగాడు.
మొసలి ముందుకి… గజరాజు వెనక్కి… నీటిలో గజరాజుకి కాలు వెనక్కి లాక్కునే వీలు కలగడం లేదు. మొసలికి తన పట్టుకు గజరాజు బెంబేలు పడుతుండడం తెల్సిపోతున్నది.
భూమ్మీదయితే దీని సంగతి చెప్పుండేవాణ్ణి అనుకున్నాడు గజరాజు, శాఖాహారి. భూమి కాదిది. నువ్వూ నీ ఆకారమూ నాకో లెక్కా అనుకుంది మొసలి, మాంసాహారి.
ఎంతన్యాయం. హాయిగా స్నానం చేస్తుంటే వచ్చి పట్టుకుంది అనుకున్నాడు గజరాజు. నాకు ఛాన్సు దొరికితే వదిలిపెట్టను. నీలాగ ఎందరో అనుకుంది మొసలి.
గజరాజు వెనక్కి… మొసలి ముందుకి…. లాగడంతో చాలాసేపు గడిచింది. ఒక్క పావుగజం ఇటయితే చాలు అనుకుంది మొసలి. ఒక్క పావు గజం ఇటయితే ఒడ్డుకు చేరుకోనూ అనుకున్నాడు గజరాజు.
క్షణాలు, నిమిషాలు, గంటలు గడుస్తున్నాయి. ఇక తనవల్ల కాదనుకున్నాడు. ఒడ్డు కనిపిస్తున్నది కాని అంగుళం కూడా కదల్లేననుకున్నాడు. ఆపద్భాంధవుడు, అనాధ రక్షకుడు ఆ శ్రీమన్నారాయణ మూర్తిని తలచుకుని ‘యూ ఓన్లీ కెన్ సేవ్ మీ’ అనుకున్నాడు. గజరాజు. శ్రీహరీ! శ్రీహరీ! అని కేకేశాడు.
అక్కడ వైకుంఠంలో మిసెస్ లక్ష్మీదేవితో పాచికలాడుతున్న శ్రీహరి క్షణకాలం ఆట ఆపి విన్నాడు. ఆట మధ్యలో వున్నాడు కదా పట్టించుకోలేదు. హరీ! శ్రీహరీ! అరిచాడు గజరాజు ఈ సారి బిగ్గరగా. ఆ అరుపుకు శేషుడు నిద్రాభంగమైందని విసుక్కున్నాడు. సందడికి శ్రీహరి తనను పిలుస్తున్నదెవరా అని దృష్టి సారించేడు. హరీ.. శ్రీహరీ.. హరీ.. శ్రీహరీ… ఆపకుండా అరుస్తున్నాడు గజరాజు. ఆపద్భాంధవుడన్న టైటిల్ నిలబెట్టకోవడానికి కదలాల్సిందే అనుకున్నాడు హరి.
శ్రీహరి లేచి నుంచున్నాడు. పీతాంబరం సర్దుకున్నాడు. కిరీటం సరిచేసుకున్నాడు. ఉత్తరీయం మడత నలగకుండా చుట్టుకున్నాడు. బయల్దేరేముందు రెండు చేతులూ చూసుకున్నాడు. ఖాళీ చేతుల్తో వెడితే లాభమేం అనుకున్నాడు.
హరీ.. శ్రీహరీ… ఉండవయ్యా బాబూ వస్తున్నా.. అంటూ శంఖు చక్రాల్ని కేకేశాడు. చాలా కాలంగా డ్యూటీలో లేవు కదా నిదానంగా వచ్చాయవి. చక్రాన్ని తిప్పి చూశాడు. వేగం తగ్గింది. మొనలు మొండిగా వున్నాయి. శంఖం ఊదాడు. సౌండే లేదు. యముడో గిముడో వాడి దగ్గరికెళ్లి రిపేరయి రండి అన్నాడు.
అవి వచ్చేదాకా మళ్లీ లక్ష్మీదేవితో ఆటకు కూర్చున్నాడు. హరీ… శ్రీహరీ.. అని గజరాజు అరుపులు కంటిన్యూ అయినాయి. శంఖమూ, చక్రమూ వచ్చినయి. పీతాంబరం సర్దుకుని కిరీటం చూసుకుని శంఖుచక్రాలు తీసుకుని పాదుకల్లో పాదాలు దూర్చి బయల్దేరాడు.
హరీ… శ్రీహరీ.. హరీ… శ్రీహరీ… పోతున్న ప్రాణాల్ని కూడదీసుకుంటూ అరిచాడు గజరాజు. ‘ఎమర్జెన్సీ కేకల్లా వున్నాయి. తొందరగా వెళ్లాలి కానీ ఇలా నడిచివెత్తే ఎలా డియర్’ అంది లక్ష్మీదేవి.
హరీ.. శ్రీహరీ.. ‘ఆ గజరాజు అరుపులు చూస్తుంటే మీ పాదయాత్ర పనికిరాదు అనిపిస్తున్నది. ఆగండి.. గరుడ వాహనం రానీయండి’ అన్నది బెటరాఫ్.
‘ఏడీ పిలు’ అన్నాడు హబ్బీ అయిన హరి. ‘ఓ పనిమీద ఇంద్రలోకం పంపించేను’ అన్నదామె. ఏం పని అని అడిగితే కోప్పడుతుందేమో అని ఊరుకున్నాడు భరించాల్సిన భర్త.
శ్రీహరి మళ్లీ మనసు మార్చుకుని ఆటకు కూర్చోక ముందే వచ్చేడు గరుడుడు. ‘రైట్’ అన్నాడు హరి.
హరీ… శ్రీహరీ… అన్న కేకలు వస్తున్న చోటికి ఉడాయించాడు గరుడుడు. హరి పర్సనల్ డ్రైవర్. గజరాజును రక్షించేందుకు పనికి వస్తుందా లేదా అని చక్రాన్ని పరీక్షిస్తూ కూచున్నాడు హరి.
గజరాజు శక్తి సన్నగిల్లింది. ఆఖరుసారి తొండం ఆకాశం కేసి ఎత్తి చావుకేక వేశాడు. గజరాజు కంగారునీ, బేజారునీ వాడుకుని మొసలి మరింత పట్టు బిగించింది. ఆ పట్టునుంచి విడిపించుకునే ప్రయత్నం చెయ్యలేదు గజరాజు. సమయం మించి పోయింది.
తన శక్తినంతా కూడగట్టుకుని గజరాజుని నీళ్లలోకి లాగేసింది మొసలి. గరుడ వాహనం మీద శంఖుచక్రాలతో సహా వచ్చి దిగిన హరికి మునిగిపోతున్న గజరాజు వీపు కనిపించింది. చక్రం తీయబోతుంటే నీటినిండా గజరాజు నెత్తురు కనిపించింది.
ఎక్కడైనా దోపిడీ జరిగితే, ఎక్కడైనా దొమ్మీ జరిగితే, ఎక్కడైనా హత్యలు జరిగితే, ఎక్కడైనా గుడిసెలు తగలబడితే… అంతా అయిపోయాక, వచ్చి ఏమీ చెయ్యలేక నిలబడిపోయే పోలీసు ఆఫీసర్లా నించుండిపోయాడు హరి. అనుచర కానిస్టేబుళ్లలా నించున్నారు గరుడుడూ, శంఖు చక్రాలూ!!
– చింతపట్ల సుదర్శన్
9299809212