కనీస వేతనాల అమలుకై కార్మిక గర్జన

నవతెలంగాణ-తాడ్వాయి 
కేజీబీవీ నాన్ టీచింగ్ & వర్కర్స్ కు కనీస వేతనాలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ & వర్కర్స్ యూనియన్ (ఐ ఎఫ్ టి యు) ఆధ్వర్యంలో  కార్మిక గర్జన పోస్టర్లను కామారెడ్డి జిల్లా జంగంపల్లి (బిక్కునూరు),  టేక్రియాల్ (కామారెడ్డి) కేజీబీవీల్లో ఆవిష్కరించరు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్ మాట్లాడుతూ.. కేజీబీవీల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ & వర్కర్స్ కు ఇప్పటికీ కనీస వేతనాలు అమలు కావడం లేదన్నారు. వీరికి పీఎఫ్, ఈఎస్ఐ లాంటి ఆరోగ్య, ఉద్యోగ భద్రత లేదన్నారు. కనీస వేతనాలు అమలు కాక, శ్రమదోపిడికి గురవుతున్నారన్నారు. కాంటాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులకు వేతనాలు పెంచుతూ ప్రభుత్వం ఇచ్చిన జీవో నెం.60 కూడా వీరికి అమలు కావడం లేదన్నారు. పని భారం పెరిగినా ఖాళీలు భర్తీ చేయడం లేదన్నారు. ఇంటర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ ఐన కేజీబీవీల్లో పనిభారం మరింత తీవ్రంగా ఉందన్నారు. కనీస వేతనాల చట్టాన్ని అమలు చేయాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. కేజీబీవీల్లో పనిచేసిన సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగాల్లో సర్వీస్ వెయిటేజీ ఇవ్వాలన్నారు. ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు ఇవ్వాలన్నారు.  కాలేజీలుగా అప్ గ్రేడ్ అయిన కేజీబీవీల్లో కుక్, స్వీపర్, అటెండర్, స్కావేంజర్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. కంప్యూటర్,  ఒకేషనల్ ట్రైనర్లకు ఫుల్ టైం వేతనాలు ఇవ్వాలన్నారు. ఏ.ఎన్.ఎంల నైట్ డ్యూటీలను 03 రోజుల నుండి ఒక రోజుకు తగ్గించాలన్నారు. పదవీ విరమణ చేసిన వారికి గ్రాట్యుటీ చెల్లించాలన్నారు. చనిపోయిన వారి కుటుంబానికి 10 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధనలో భాగంగా ఆగస్టు 4న హైదరాబాదులో కార్మిక గర్జన నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలోని కేజీబీవీ నాన్ టీచింగ్, వర్కర్లు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమంలో కేజీబీవీ సిబ్బంది వాణి, శిరీష, శ్యామల, సుకన్య, లలిత, రజిత, శ్రీలత, లక్ష్మి, సంధ్య, లత, మాధవి, నర్సవ్వ లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.