పెరిగిన ధరలకనుగుణంగా ప్రతి ఐదేండ్లకో సారి కార్మికులకు కనీస వేతనాలు పెంచాలని చట్టం చెబుతున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదు. పది సంవత్సరాలుగా వేతనాలు సవరించకుండా కాలయాపన చేస్తున్నది. అందుకే కనీస వేతనాలు సవరించి కార్మిక చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో జూన్ 12 నుండి జూలై 14 వరకు రాష్ట్రవ్యాప్తంగా క్యాంపెయిన్ జరిగింది. ఈ సంవత్సరం రెండు దశలుగా ఆందోళనా, పోరాటాలు కొనసాగాయి. అయినప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగానే ఉంటోంది తప్ప కార్మికులను పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలోని 73 షెడ్యూల్డ్ ఎంప్లాయిమెంట్స్‌లో సుమారు కోటీ మంది కార్మికులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. అన్ని కార్మిక సంఘాలు కలిసికట్టుగా విజ్ఞప్తి చేసినా, కనీస వేతనాల సలహా మండలి తీర్మానాలు చేసి పంపినా ముఖ్యమంత్రి ఈ సమస్యను పరిష్కరించకుండా రాష్ట్రంలోని పెట్టుబడుదారులకు యజమానులకు ప్రయోజనం కలిగించే పనిలో నిమగమై ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2006 నుండి 2012 మధ్యకాలంలోనే కనీస వేతనాలు సవరించబడ్డాయి. ఈ కాలంలో ధరలు ఆకాశాన్నంటిన కార్మికుల జీతభత్యాలు మాత్రం పెరగలేదు. వాస్తవంగా పరిశ్రమల కార్మికుల జీతాలు మూడుసార్లు పెరగాలి. కార్మిక సమస్యలు పరిష్కరిం చడంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వ విధానాలనే రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నది. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్‌లను సమర్థించింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం కనీస వేతనం రోజుకు 178 నిర్ణయిస్తే, రాష్ట్ర ప్రభుత్వం 2012 సంవత్సరం నాటి కాంట్రాక్టు కార్మికుల కనీస బేసిక్ 5,579 తోనే వెట్టిచాకిరి చేయిస్తున్నది. ఈ రకంగా 73రంగాలలో కార్మికుల జీతాలు చాలా నామమాత్రంగా ఉన్నాయి. వీటిని సవరించాలని సిఐటియు రెండవ దశ పోరాటాన్ని ప్రారంభించింది. జూలై 4న రంగారెడ్డి జిల్లా కాటేదాన్లో జీపు యాత్ర ప్రారంభించింది. రంగారెడ్డి జిల్లా హైదరాబాదు సంగారెడ్డి మెదక్, సిద్దిపేట, మేడ్చల్ జిల్లాలలో అనేక పారిశ్రామిక కార్మికులను కలుసుకుంటూ, వాళ్ళ సమస్యలను తెలుసు కుంటూ 13న చర్లపల్లిలో యాత్రను ముగించడం జరిగింది. జూలై 14న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్ ఆఫీస్‌ల ఎదుట, హైదరాబాద్‌లోని కమిషనర్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమాలు చేసినా ప్రభుత్వం కార్మికుల సమస్యల పట్ల స్పందించకుండా మొండిగానే వ్యవహరిస్తున్నది.
ఈ యాత్రలో భాగస్వాములైన కార్మికులు తమ సమస్యల్ని బృంద నాయకత్వం దృష్టికి తీసుకొచ్చారు. దయనీయమైన పరిస్థితులలో కార్మికులు బతుకులు వెళ్ళదీస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కాటేదాన్ పారిశ్రామిక ప్రాంతంలో కార్మికులకు రోజుకు రూ.300 మహిళలకు, పురుషులకు రూ.400 ఇస్తూ 12గంటలు పనిచేయించు కుంటున్నారు. పిఎఫ్, ఈఎస్‌ఐ, బోనస్, ఓవర్ టైం వేతనాలు, సెలవులు అమలు చేయడం లేదు. రావిర్యాల హార్డ్‌వేర్ పార్కులో ఆస్ట్రా మైక్రోవేవ్, ఆవిష్కరణ కంపెనీలలో వందలాది మంది కార్మికులతో వెట్టిచాకిరి చేయించుకుంటున్నారు. పెండ్లికాని వందల మంది అమ్మాయిలను హాస్టల్స్‌లో పెట్టి నెలకు మూడు వేల రూపాయలు వసూలు చేసుకుని కాంట్రాక్టర్లు దోపిడీ చేస్తున్నారు. 11గంటల పాటు పనిచేయిస్తున్నారు. మంకాల ఇంజనీరింగ్ కెమికల్, ప్లాస్టిక్ పరిశ్రమలలో 12గంటలు పని చేయించుకుని 8వేల నుంచి 9వేల రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో మహేంద్ర ముసుకో కంపెనీ భారీ పరిశ్రమలు కూడా కనీస వేతనాలు జీఓ కన్నా తక్కువ చెల్లిస్తున్నారు. జిల్లాలోని అనేక పరిశ్రమలలో ప్రొడక్షన్ వైపు కాంట్రాక్ట్ కార్మికులతో పని చేయించుకుని జీతాలు చెల్లిస్తున్నారు. పాషా మైలారం, పటాన్‌చెరు, జిన్నారం, బొల్లారం లాంటి పారిశ్రామిక ప్రాంతాలలో వలస కార్మికుల బతుకులు కడు దయనీయంగా ఉన్నాయి. వేల మంది కార్మికులకు కార్మిక చట్టాలు అమలు చేయడం లేదు, 12 గంటల పాటు పని చేయించుకుంటున్నారు. హేటిరో, ఏసేన్, గ్రాంన్ వెల్స్, రెడ్డి ల్యాబ్స్ ఇలాంటి పరిశ్రమలలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఉత్పత్తిలో పని చేయించుకొని కాంట్రాక్ట్ కార్మికులకు తక్కువ జీతాలు చెల్లిస్తున్నారు. కొన్ని కంపెనీలలో బోనస్ కూడా చెల్లించడం లేదు.
అంతర్ రాష్ట్ర వలస కార్మికులకు 1979 చట్టం ప్రకారంగా కనీస వసతి సౌకర్యాలు లేకుండా చిన్న పూరి గుడిసెల్లో ఉంచి కనీసం మంచినీరు, టాయిలెట్స్, సౌకర్యాలు లేకుండా నిర్బంధంగా గొడ్డుచాకిరీ చేయించుకుంటున్నారు. మెదక్ జిల్లాలోని కూడా కాళ్ళకల్ పారిశ్రామిక ప్రాంతాల్లో స్టీల్ మిల్లులలో ఇంజనీరింగ్ పరిశ్రమల్లో కార్మికుల దుస్థితి కూడా ఇదే విధంగా ఉంది. శివంపేట చేగుంట తూప్రాన్ పారిశ్రామిక ప్రాంతాలలో చట్టాలు అమలు గురించి అడిగే పరిస్థితి లేదు. సిద్దిపేట జిల్లాలో కూడా ముఖ్యమంత్రి నియోజకవర్గమైన గజ్వేల్, కరకపట్ల ప్రాంతాలలో కార్మిక చట్టాల అమలు జరగడం లేదు. 12గంటలు పని చేయించుకుని ఓవర్ టైం వేతనాలు చెల్లించకుండా దోపిడీ చేస్తున్నారు. కొన్ని పరిశ్రమలలో మహిళలకు ఆరువేల రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. మేడ్చల్ జిల్లాలో సుమారు 2500 పరిశ్రమల్లో రెండు లక్షల పైగా కార్మికులు ఉన్నారు. ఏ పారిశ్రామిక ప్రాంతానికి వెళ్లిన కార్మిక చట్టం అమలు జరగడం లేదు. చర్లపల్లి ప్రాంతంలో రెండువేల మంది మహిళలు పనిచేసే ఒక గార్మెంట్ కంపెనీలో ఏడు వేల రూపాయలు ఇస్తూ దోపిడీ చేస్తున్నారు. పీఎఫ్ ఈఎస్‌ఐ సౌకర్యాలు అమలు కావడం లేదు. కార్మిక చట్టాలు అమలు చేయాలని చిత్తశుద్ధిగాని ఇటు ప్రభుత్వానికి, అటు అధికార యంత్రాంగానికి లేదు.
రాష్ట్రంలో కార్మిక చట్టాల అమలు ఇంత దయనీయంగా ఉండడానికి కనీస వేతనాలు లేకపోవడానికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వంలో పెట్టుబడిదారులు భాగస్వాములై ఉండటం. అది తన వర్గ స్వభావాన్ని చాటుకుంటున్నది. కొంతమంది పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా పారిశ్రామికవేత్తలు అవడం వల్లే కనీస వేతనాల గురించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం లేదు. కార్మిక శాఖ మంత్రి ఒక పెట్టుబడిదారుడు కావడం వల్ల కూడా సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం తన బడ్జెట్‌తో వేతనాలు పెంచే ఉద్యోగులకు మాత్రం రెండుసార్లు పిఆర్సిని ఇచ్చింది. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులందరూ జీతభత్యాలు పెంచుకున్నారు. ప్రయివేటు పరిశ్రమలో పనిచేస్తూ యజమానులకు లాభాలు తెస్తున్న కార్మికుల వేతనాలు నిర్ణయించడానికి మాత్రం ప్రభుత్వం ముందుకు రాకపోవడానికి ప్రధాన కారణం తన పెట్టుబడుదారి అను కూల వైఖరి వల్లేనని స్పష్టంగా చెప్పొచ్చు. రాష్ట్రంలో అనేక పారిశ్రామిక ప్రాంతాల్లో భూములు కేటాయిస్తూ మౌలిక సదుపాయాలు కల్పిస్తూ వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది. కానీ కార్మిక జీతభత్యాలు పెంచడానికి మాత్రం ముందుకు రావడం లేదు. కార్మిక సంఘాల కోరినా, హైకోర్టు చెప్పినా కనీస వేతనాలు సలహా మండలి తీర్మానం చేసిన ప్రభుత్వంలో చలనం లేకపోవడానికి ఇదే కారణం. కంటితుడుపు చర్యగా కనీస వేతనాల సలహా మండలి ఏర్పాటు చేసి కొందరికి రాజకీయ ఉపాధిని కల్పిస్తుందని అపవాదు ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభు త్వం కనీస వేతనాలు సవరించి కార్మికులకు న్యాయం చేయాలి. లేనిపక్షంలో భవిష్యత్తులో కోటి మంది కార్మికుల ఆగ్రహం చూడవలసిన పరిస్థితి వస్తుంది. సెల్:9490098034
భూపాల్