చరిత్ర పురాణ కాలక్షేపం కాదు. పైగా అది రాణివాసపు అంశాల గురించో, అంత:పుర అవశేషాల గురించో, రాజ్యాల ముట్టడుల గురించో కాదు. మట్టి మనుషులు, వారి విముక్తి కోసం తెగించి పోరాడిన వీరగాథలవి. వారాలపించిన విప్లవ గీతాలవి. అవి దశాబ్దాల అణచివేతలపై రేగిన చైతన్య బావుటాలు. దొడ్డి కొమరయ్య నేలకొరిగిన 1946 జులై 4 నుండి అధికారయుతంగా సాయుధ పోరాటాన్ని ఉపసంహరించుకున్న 1951 అక్టోబరు 21 వరకు ఐదేండ్లకుపైగా సాగిన సాయుధ సంఘర్షణ అది. బ్రిటిష్ పాలకులచే ”హిజ్ ఎగ్జాల్టెడ్ హైనెస్”గా కీర్తించబడ్డ నైజాం నవాబుపై సాగిన సాయుధ రైతాంగ ప్రతిఘటనోద్యమం గురించి ఆనాటి ట్రేడ్ యూనియన్ ఉద్యమ ప్రారంభ దినాల గురించీ నేడు చర్చిస్తున్నాం. సగం తెలుగు మాట్లాడే తెలంగాణ ప్రాంతం (50శాతం), 28శాతం మరాఠీ మాట్లాడే మరాట్వాడా ప్రాంతం, 22 శాతం కర్నాటక ప్రాంతం ఉన్న 83వేల చ.మైళ్ళ వైశాల్యంలో విస్తరించింది నైజాం రాజ్యం.
‘బాంచన్ దొర నీ కాల్మొక్తా’నన్న మట్టి మనుషులు బందూకులై విప్లవించిన కాలంలో (1941కి) తెలంగాణ ప్రాంతంలో ఐదు వందల ఫ్యాక్టరీలు, వాటిలో 23 వేల మంది కార్మికులుండేవారని ‘వీర తెలంగాణ విప్లవ పోరాటం – గుణపాఠాలు’ గ్రంథంలో పుచ్చలపల్లి సుందరయ్య రాశారు (పేజీ14).
”పట్టణాల్లో కార్మికవర్గంలో, మధ్యతరగతి వర్గాలలో కమ్యూనిస్టు ఉద్యమం బలహీనంగా ఉండింది”అని ఆ గ్రంథంలో కామ్రేడ్ పీ.ఎస్. రాశారు. అయినా, ఉన్న మేరకు ‘సాయుధ పోరాట’ ప్రభావం సంపూర్ణంగా ఉండేదన్నారు. నగరాల్లో ముఖ్యంగా హైదరాబాద్, వరంగల్ ప్రాంతంలో ముఖ్యంగా బొగ్గు గనుల ప్రాంతం. అజాంజాహి మిల్లు, హైదరాబాద్‌లోని ఇతర నేత మిల్లులు, ఆర్టీసీ, రైల్వే కార్మికులు, రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు, మున్సిపల్ కార్మికులు వంటి అనేక రంగాలు, ఫ్యాక్టరీల కార్మికులు వారి దైనందిన సమస్యలపై చేసే ఉద్యమాల్లో కమ్యూనిస్టులు జోక్యం చేసుకున్నారు.
ట్రేడ్ యూనియన్ ఉద్యమం ఎక్కడ, ఎలా ప్రారంభించాలో అనుభవపూర్వకంగా ఆ గ్రంథంలో కామ్రేడ్ సుందరయ్య పేర్కొన్నారు. నేటి ట్రేడ్ యూనియన్ కార్యకర్తలకు గైడ్‌గా అది ఉపయోగపడుతుంది. ఇటువంటి ముఖ్య నేతల అనుభవాల నుండే 1967 ”కార్మికరంగంలో కర్తవ్యాలు” అనే సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ తీర్మానం ఆవిర్భవించింది.
కొత్తగూడెం, బెల్లంపల్లి ఏరియాల్లో గని కార్మికులు బోనస్‌పై సమ్మె చేశారు. యాజమాన్యం కొన్ని సౌకర్యాలు అమలు చేస్తానని ప్రకటించినా, కార్మికులు సంతృప్తి చెందక సమ్మె కొనసాగించారు. బోనస్ విధానాన్ని సక్రమంగా అమలు చేయాలని, బియ్యం రేషన్ సరిపడినంతగా ఇవ్వాలని, పౌరహక్కులు పునరుద్ధరించాలన్న డిమాండ్‌తో 1949 మే నెలలో తిరిగి సమ్మె చేశారు. అరెస్టులు కొనసాగాయి. ”వరంగల్లు, నల్లగొండ జిల్లాల్లో గెరిల్లా చర్యల ప్రభావం పడినప్పటికీ, వారి విజయాలను విని ఉత్సాహం పొందుతున్నప్పటికీ, పార్టీ పలుకుబడి, నిర్మాణమూ కార్మికులను సంఘటితపరిచి నాయకత్వం వహించడానికి పరిస్థితులు తగినంతగా లేవు. ఆర్థిక కోరికల సాధనకై కార్మికులు అనేక పోరాటాలు జరిపారు. అవి వాటంతట అవే తలెత్తాయి (పీఎస్ గ్రంథం పేజీ 251).
ఈ పోరాటాలలో ప్రత్యేకతే మంటే ఒక ఫ్యాక్టరీ కార్మికులు, మరొక ఫ్యాక్టరీ కార్మికులకు అండగా నిలుస్తున్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ ఉద్యమంలో పాల్గొన్న వారికి ఉరిశిక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేయడమే కాదు, ఆ రైతాంగ ఉద్యమాన్ని బలపరుస్తూ రాజకీయ సమ్మెలు కూడా చేశారు. డిటెన్యూలపట్ల ప్రభుత్వ విధానాన్ని ఖండిస్తూ కామ్రేడ్ గణపతి (మల్లయ్య) హత్యను నిరసిస్తూ హైదరాబాద్‌లో రోడ్డు రవాణా కార్మికులు పెద్ద సభ జరిపారు. మే -23న గంటపాటు నిరసన వ్యక్తం చేశారు. మున్సిపల్, పబ్లిక్ వర్క్స్, ఆయిల్ మిల్లు కార్మికులు కూడా ఆ రోజున సమ్మె చేశారు.
ఒక యూనియన్ పిలుపునివ్వంగానే కార్మికులు పాల్గొనే దశ కాదది. యూనియన్ల అఫిలియేషన్లు, పిలుపులకు స్పందనలు కాక కార్మికుల స్వచ్ఛంద స్పందనలవి. జనం రోసిన నిజాము రాజ్యం అంతమొందిన రోజుల్లో ‘పోలీసు చర్య’ తర్వాత సాధారణ ప్రజలతో కలిసి బెల్లంపల్లిలో గని కార్మికులు హిందూ, ముస్లిం బడా వ్యాపారస్తుల, ఇతర ప్రజా పీడకుల ‘గడీ’లపై దాడులు చేసిన సందర్భమది. నిజాం రాజ్యం స్థానంలో వచ్చిన నెహ్రూ సైన్యం ప్రజలపై విరుచుకుపడ్డ రోజులవి. కార్మికవాడల్లో ఎర్రజెండాలెగరేయడాన్ని నిషేధించిన రోజులవి. అయినా, 1950 జనవరి 26న నైజాంను నెహ్రూ ప్రభుత్వం ‘రాజ్ ప్రముఖ్’గా నియమిస్తే హైదరాబాద్‌తో సహా అనేక చోట్ల విద్యార్థుల సమ్మెలు, వారికి మద్దతు గా నిలిచిన ప్రజలపై లాఠీలతో పోలీసులేగాక కాంగ్రెస్ కార్యకర్తలు సైతం విరుచుకుపడినా కార్మికులు ప్రతిఘటించిన సందర్భమది.
”హైదరాబాద్‌లో కాంగ్రెస్ నిరంకుశ పాలన పదకొండు మాసాలు సాగడంతోనే అది తగిలించుకున్న ‘విమోచన’ ముసుగు కాస్తా పటాపంచలైంది. తుపాకీ బలంతో సాగుతున్న పెట్టుబడిదారీ వర్గపు దుష్ట నియంతృత్వంగా దాని నిజస్వరూపం బట్టబయలైంది.
పౌర హక్కులు పూర్తిగా అణిచివేయబడ్డాయి. నిజమైన ప్రజాతంత్ర ఉద్యమాన్ని దేన్నీ సాగనివ్వలేదు. ఏ సంస్థ మీదనైనా, ఫ్యాక్టరీ మీదనైనా పోలీసులు విరుచుకుబడి విచక్షణా రహితంగా అరెస్టులు చేయడానికి, బీభత్సకాండ సాగించడానికి పూనుకున్నారు. కమ్యూనిస్టు పార్టీ, ట్రేడ్ యూనియన్లు, విద్యార్థి, యువజన సంఘాలకు చెందిన అచ్చుయంత్ర సామాగ్రిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ క్రూరులు పురుషులపైన సాగించినట్టే స్త్రీలపై కూడా దుర్మార్గాలు సాగించారు” (పీ.ఎస్. గ్రంథం పేజీ : 253).
వివిధ రంగాలకు సంబంధించిన అనేకమంది ట్రేడ్ యూనియన్ నాయకులను ఏ విధంగా డిటెన్యూలుగా ఉంచారో వారి పేర్లు, వివరాలు సుందరయ్య తన గ్రంథంలో ఉటంకించారు.
ఈ సందర్భంగా ఒక కీలక విషయం మన గమనంలో ఉండాలి. దాదాపు 400 రోజులు ఢిల్లీ చుట్టూ రైతాంగం ముట్టడించి మూడు నల్ల చట్టాల రద్దుకు పోరాడుతుంటే కార్మికవర్గ స్పందన తగు రీతిలో ఉందో లేదో కార్మికోద్యమం నిశితంగా పరిశీలించుకోవాలి.
1948 డిసెంబరు మధ్యలో 16 వందల మంది మున్సిపల్ కార్మికులు తమ వేతనాలు పెంచాలని, కరువు భత్యం కోసం, పర్మినెంట్ చేయాలనీ ఎర్రజెండా నాయకత్వాన హైదరాబాద్‌లో ప్రదర్శనలు జరిపారు. పోలీసు లాఠీలను లెక్కచేయకుండా సాగిన ఆ ప్రదర్శన అనేక ఫ్యాక్టరీల కార్మికులను ఉత్తేజపరిచి రంగంలోకి దింపింది. 30 వేల పనిదినాలు నష్టమైనాయి. మహిళా కార్మికులపై జరిగిన లాఠీచార్జీకి నిరసనగా రైల్వే, ఆర్టీసీ కార్మికులు సమ్మె చేయడంతో రెండు రోజులు నగరం స్తంభించిపోయింది. అఖిల భారత స్థాయిలో రైల్వే సమ్మెకు సన్నాహాలు జరుగుతున్న దశ అది. దక్షిణ భారతదేశంలో అనేకమంది రైల్వే కార్మికులు సమ్మెకు అనుకూలంగా బ్యాలెట్‌లో పాల్గొన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు మిలటరీ అత్యాచారాలకు వ్యతిరేకంగా ఒకసారి, మున్సిపల్ కార్మికులకు సంఘీభావంగా ఒకసారి సమ్మె చేసియున్నారు.
రైల్వే సమ్మె ప్రాధాన్యతను అర్థం చేసుకున్న నెహ్రూ ప్రభుత్వం ఆ సమ్మెను క్రూరంగా అణచివేసింది. చివరికి లాలాగూడ ప్రాంతంలో మంచినీరు పట్టుకునే ఆడవారిని సైతం తమ కుటుంబసభ్యుల అరెస్టుల విషయంలో మాట్లాడుకోనీకుండా చెల్లాచెదురు చేసేశారు.
బీజప్రాయంలో ఫ్యాక్టరీ వ్యవస్థఉన్న రోజుల్లోనే ట్రేడ్ యూనియన్ ఉద్యమం ఎట్నుంచి ఎటు ప్రారంభించాలో దాని గతి ఏ విధంగా ఉండాలో 1940వ దశకంలో సుందరయ్య అనుభవపూర్వకంగా వివరించిన ఆ పది పేజీలు ఈ గ్రంథంలో ట్రేడ్ యూనియన్ కార్యకర్తలకు కీలకం. నాటి సంఘటితరంగ పరిశ్రమలతోపాటు ఆర్టీసీ, రైల్వేలపై పార్టీ కేంద్రీకరణ, దానితోపాటు మున్సిపల్, ప్రభుత్వోద్యోగుల్లో కృషి వంటిది ఎంత ముఖ్యమో అర్థం కావల్సియున్నది. ట్రాన్స్‌పోర్టు రంగంలో (రైల్వే, ఆర్టీసీ) సంస్కరణ వాద సంఘాలు కార్మికుల్ని ఏ విధంగా భ్రమలకు లోను చేస్తున్నాయో తెలిస్తే మన కృషి ప్రాధాన్యత అవగతమవుతుంది.
లెనిన్ చెప్పిన క్రింది విషయాన్ని కమ్యూనిస్టు ట్రేడ్ యూనియన్ శ్రేణులు అర్థం చేసుకోవడం అవసరం. ”పెట్టుబడితో తాను దోపిడీ చేయబడ్తున్నాననే విషయం (ఫ్యాక్టరీ) కార్మికుడు తేలిగ్గా అర్థం చేసుకుంటాడు. తన ఆర్థిక కోర్కెల పరిష్కారమేగాక, పని పరిస్థితులు మెరుగవ్వాలన్నా, పోరాటం మొత్తం బూర్జువా వర్గంపైనే కేంద్రీకరించాలని సులభంగానే అర్థం చేసుకుంటారు. ఎందుకంటే ఫ్యాక్టరీల్లో తమని అణచివేయడమే కాదు, యావన్మంది కార్మికుల్నీ అన్నిచోట్లా అణచివేసేది ఈ బూర్జువా వర్గమేనన్న విషయం ఆచరణలో అతనికి అర్థమవుతుంది. అందుకే ఫ్యాక్టరీ కార్మికుడు మొత్తం దోపిడీకి గురయ్యే వర్గానికి ప్రతినిధి. ఒక నిరంతర, సంఘటిత పోరాటం చేయాలనే విషయాన్ని అతని దృష్టికోణంలో నిలపాల్సిన పనిలేదు. ఆనాటి ఆర్థిక, రాజకీయ పరిస్థితుల్లో అతనిపై సాగుతున్న దోపిడీని అర్థం చేయించి, దాన్లో అతని స్థానాన్ని ఎరుకపరచడం కీలకం”
– (1894లో రష్యాలో విస్తరిస్తున్న ఫ్యాక్టరీ వ్యవస్థపై లెనిన్ రచనల నుండి)
కామ్రేడ్స్ అసోసియేషన్
1939లో హైదరాబాద్‌లో యువత, కొందరు మేధావులు కలిసి ఏర్పడ్డదే ‘కామ్రేడ్స్ అసోసియేషన్’. దాని నాయకుడు జవాద్ రజ్వీ. రష్యన్ విప్లవం, జాతీయో ద్యమం ద్వారా ప్రభావితులైన వారు ప్రగతిశీల సాహిత్యం అధ్యయనం చేస్తూ ముందుకు సాగారు వారు. కామ్రేడ్స్ అసోసియేషన్ నుండి కమ్యూనిస్టు పార్టీ వైపు ఆకర్షితు లైన వారిలో రాజబహదూర్ గౌర్, సయ్యద్ ఇబ్రహీం, అలంఫ్‌ుమీర్‌లు తెలంగాణలోనూ, మహారాష్ట్ర పరిషద్ నుండి సోషలిస్టు భావజాలంవైపు ఆకర్షితులైన వారిలో హబీబుద్దీన్, వి.డి. దేశ్‌పాండే వంటి వారు ముఖ్యులు.
భావసారూప్యతగల ఈ యువకుల్ని కమ్యూనిస్టుపార్టీ వైపు ఆకర్షించడంలో సుందరయ్య, చండ్రరాజేశ్వర్రావు, కంభంపాటి సత్యనారాయణ కృతకృత్యులైనారు.
(‘తెలంగాణ సాయుధ పోరాటం, రాజకీయ, సైద్ధాంతిక విశ్లేషణ’లో డా|| కందుకూరి రమేశ్)
– ఆరెస్బీ