కార్మిక సమ్మెలు – లెనిన్‌ బోధనలు

కార్మిక సమ్మెలు - లెనిన్‌ బోధనలుప్రపంచమనే కావ్యానికి ప్రతిపదార్ధం లెనిన్‌
బతుకనే చిక్కు సమస్యకి పరిష్కారం లెనిన్‌ – శ్రీశ్రీ
మార్క్సిజం అనేది ఒకరిద్దరి మేధో సిద్ధాంతం కాదు. అది కార్మికవర్గ విముక్తి మార్గం. శ్రమజీవే సమస్త సంపదకు సృష్టికర్త. కార్మికుల శారీరక, మానసిక శ్రమలే సమాజ పురోగతికి రథచక్రాలు. అంతటి ఉన్నతోన్నతమైన కార్మికులు ఆకలి, దారిద్య్రం, నిరుద్యోగం లాంటి సకల అసమాన రుగ్మతల బారినుండి తనను తాను, తన చుట్టూ ఉన్న సకల జనావళిని విముక్తి చేసి సోషలిస్టు సమాజాన్ని నిర్మించడం నేటి చారిత్రక కర్తవ్యం అని మార్క్స్‌, ఎంగెల్స్‌ శాస్త్రీయంగా సిద్ధాంతీకరించారు. వారు అందించిన మార్క్సిజం అనే వజ్రాయుధాన్ని చేపట్టి వర్గపోరాటమనే కదనరంగమందు అమానవీయమైన, నీతిబాహ్యమైన, లజ్జాకరమైన పెట్టుబడిదారీ వ్యవస్థను దునుమాడి ప్రపంచంలో మొట్టమొదటిసారి రష్యాలో సోషలిస్టు విప్లవాన్ని సాధింపచేసిన చిరస్మరణీయుడు లెనిన్‌. ఆయన అస్తమించి ఈ నెల 21 నాటికి వంద సంవత్సరాలు అవుతుంది. వంద సంవత్సరాల్లో సమాజం ఎంతగానో పురోగమించింది. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో, ఉత్పత్తి విధానంలో అద్భుతమైన ఆవిష్కరణలు జరిగాయి, జరుగుతున్నాయి. దీని ఫలితంగా సంపద పెద్దఎత్తున సృష్టించబడుతుంది. అయితే లెనిన్‌ జీవించిన నాటి కంటే నేడు అతి కొద్దిమంది దగ్గరే లక్షల కోట్లు పోగుబడుతుంటే, అత్యధిక మంది దారిద్య్రం, పేదరికం లాంటి సర్వకష్టాలతో కునారిల్లుతున్నారు. ఈ స్థితి నుండి సమాజాన్ని సమూలంగా మార్చకుండా అత్యధికుల వేదనలు, రోదనలు, బాధలు, కన్నీళ్లు నిర్మూలించడం సాధ్యం కాదు. ఇందుకు లెనిన్‌ బోధనల నుండి ముఖ్యంగా కార్మిక సమ్మెలు, వాటి ప్రాధాన్యతల గురించి ఆయన ఏం చేయాలని చెప్పాడో విస్తృతంగా అధ్యయనం చేయాలి.
కార్మిక సమ్మెలు వాటి ప్రాధాన్యతల గురించి లెనిన్‌ అనేక సందర్భాల్లో వ్యాసాలు, కరపత్రాలు ప్రచురించారు. అందులో 1899లో ‘సమ్మెలపై వైఖరి’, 1901లో ‘ఏం చేయాలి?’, 1912లో ‘ఆర్థిక, రాజకీయ సమ్మెల’ గురించి రాసిన వ్యాసాలను నేటి నిర్దిష్ట పరిస్థితులకు అన్వయించి అధ్యయనం చేయడం, ఆచరించడం ఆ మహనీయునికి ఇచ్చే నిజమైన నివాళి.

సమ్మెలు ఎందుకు జరుగుతాయి?
పెట్టుబడిదారీ వ్యవస్థ ఉన్నంత కాలం కార్మికవర్గ సమ్మెలు అనివార్యం అని లెనిన్‌ చెప్పాడు. ఎందకంటే ఈ వ్యవస్థలో ఆస్తి అని చెప్పబడే భూమి, యంత్రాలు, పెట్టుబడి కొద్దిమంది దగ్గరే ఉంటాయి. ”భూ యజమానులు, ఫ్యాక్టరీ యజమానులు కార్మికులను నియమించుకుంటారు. వారు మార్కెట్‌లో అమ్మడానికి అవసరమైన వస్తువులను ఉత్పత్తి చేయిస్తారు. యజమానులు కార్మికులకు వారి కుటుంబాలు కనీస జీవనాన్ని గడపడానికి సరిపడ వేతనాన్ని మాత్రమే చెల్లిస్తారు. అయితే కార్మికుడు తనకు ఇచ్చిన వేతనానికి మించి ఉత్పత్తి చేసే ప్రతిదీ ఫ్యాక్టరీ యజమానికి లాభంగా మారి అతని జేబులోకి వెళుతుంది. అత్యధికమంది ప్రజలు ఇతరులకు కూలి పని చేస్తారు. వారు తమ కోసం పని చేయరు. వేతనాల కోసం, యజమానుల కోసం పని చేస్తారు. యజమానులు ఎల్లప్పుడూ వేతనాలను తగ్గించాలని లేదా పెంచకుండా ఉండాలని చూస్తారు. కార్మికులకు ఎంత తక్కువ ఇస్తే, వారికి అంత ఎక్కువ లాభం చేకూరుతుంది. కార్మికులు తమ కుటుంబాలను పోషించుకోవడానికి, బిచ్చగాళ్ళుగా మారకుండా ఉండటానికి సాధ్యమైనంత ఎక్కువ వేతనం పొందడానికి ప్రయత్నిస్తారు. అందువల్ల, వేతనాలపై యజమానులు, కార్మికుల మధ్య నిరంతర పోరాటం జరుగుతూ వుంటుంది” అన్నాడు. పెరుగుతున్న ధరలు, పేదలకు దూరమవుతున్న ప్రభుత్వ సేవలు ఇప్పుడు పొందుతున్న వేతనాలను కూడా నిజవేతనాలుగా ఉంచవు. వేతనాల పెంపుదల పోరాటం పడిపోతున్న నిజవేతనాలను కాపాడుకోవడానికి, పెరుగుతున్న ధరల భారాలను తట్టుకోవడానికి కార్మికవర్గాన్ని అనివార్యంగా సమ్మెలకు, పోరాటాలకు సిద్ధంచేస్తుంది.
”1930 నాటి మహా మాంద్యం కారణంగా ఏర్పడిన ఆర్థిక వినాశనాన్ని పరిష్కరించడానికి, పెట్టుబడిదారీ విధానాన్ని రక్షించే ప్రధాన లక్ష్యంతో సంక్షేమ రాజ్యం అనే కీన్స్‌ సిద్ధాంతం ఉద్భవించింది”. సమ్మె పోరాటాలు వర్గ పోరాటాలుగా మారకుండా, తమ ఉనికిని ప్రశ్నార్థకం చేయకుండా ఉండడానికి పెట్టుబడిదారీ ప్రభుత్వాలు కార్మికులకు సమ్మె హక్కును ఇవ్వాల్సి వచ్చింది. అయితే సరళీకరణ విధానాల నేపథ్యంలో ఈ హక్కును కాలరాయడానికి ప్రపంచంలోని పెట్టుబడిదారీ దేశాలన్నీ ప్రయత్నిస్తున్నాయి. ”అయితే ఒక్క కార్మికుడు ఒంటరిగా పోరాటం చేయడం సాధ్యమేనా? శ్రామిక ప్రజల సంఖ్య పెరుగుతోంది: రైతులు నాశనం చేయబడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణం లేదా ఫ్యాక్టరీల వద్దకు చేరిపోతున్నారు. భూస్వాములు, ఫ్యాక్టరీ యాజమాన్యాలు కార్మికుల ఉపాధిని దోచుకునే యంత్రాలను ప్రవేశపెడుతాయి. నగరాలలో నిరుద్యోగుల సంఖ్య పెరుగుతోంది. యజమానికి వ్యతిరేకంగా కార్మికుడు స్వయంగా పోరాడటం అసాధ్యం. కార్మికుడు వేతనాలు పెంచమని కోరితే లేదా వేతన కోతను అంగీకరించకపోతే వీరిని బయటకు పంపి అంతకంటే తక్కువ వేతనాలకు పని చేయడానికి ఆకలితో గేట్ల వద్ద అనేక మంది ఉంటారు” నిరుద్యోగాన్ని సృష్టించిన పాలకులే ఆ నిరుద్యోగ భూతాన్ని చూపి ఉపాధి పొందుతున్న కార్మికుల వేతనాలు పెంచకుండా అడ్డుకుంటారు. 125 ఏళ్ళ క్రితం లెనిన్‌ చెప్పిన మాటలు ఎంత అక్షర సత్యమో నేడు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న అంగన్‌వాడీల సమ్మె సజీవ సాక్ష్యం. ”పెట్టుబడిదారీ విధానంలో కార్మికులు ప్రతిఘటనను ప్రదర్శించలేనప్పుడు లేదా యజమానుల ఏకపక్ష చర్యలను అడ్డుకోలేనప్పుడు శ్రామిక ప్రజలపై భయంకరమైన అణచివేత కొనసాగుతుంది” అని హెచ్చరించాడు.
సమ్మెల ప్రాముఖ్యత – వాటి అణచివేత చర్యలు
కుల, మత, ప్రాంతీయ, భాషాభేదాల కంటే తమ ఐక్యతే తమకు రక్ష అని గుర్తించడం సంఘ చైతన్యం. ఈ చైతన్యం చేసే పోరాటాలు, సమ్మెల ద్వారా వర్గ చైతన్యం వస్తుందని ఇలా వివరించారు. ”కార్మికుని వేతనాలు యజమాని, కార్మికుడి మధ్య ఒప్పందం ద్వారా నిర్ణయించబడతాయి. ఈ దశలో వ్యక్తిగతంగా కార్మికుడు శక్తిహీనుడు, అందుకే తమ డిమాండ్ల కోసం ఉమ్మడిగా పోరాడాలని అనుభవం నుండి కార్మికులు స్పష్టంగా గుర్తిస్తారు. యజమానులు వేతనాలు తగ్గించకుండా లేదా వేతనాలు పెంచుకునేందుకు సమ్మెలు నిర్వహించవలసి వస్తుంది. కార్మికులు సమ్మె చేయడం ద్వారా మాత్రమే ఉమ్మడిగా యజమానులను ప్రతిఘటించగలుగుతారు… ఏదేమైనా, పెట్టుబడిదారీ సమాజం స్వభావం నుండి ఉత్పన్నమయ్యే సమ్మెలు, ఆ సమాజ వ్యవస్థకు వ్యతిరేకంగా కార్మిక-వర్గ పోరాటానికి నాందిగా మారుతాయి” అన్నాడు. ”సమ్మెలు పెట్టుబడిదారులలో ఎల్లప్పుడూ భయాన్ని కలిగిస్తాయి. ఎందుకంటే అవి వారి ఆధిపత్యాన్ని అణగదొక్కుతాయి” అందువల్ల సమ్మెలను విచ్ఛిన్నం చేయడానికి తమ చేతుల్లోని సర్వ ఆయుధాలను వాడతారు. అధికారుల ద్వారా, పాలకపక్ష ప్రతినిధుల ద్వారా, పోలీసుల ద్వారా సామ, దాన, భేద, దండోపాయాలను ప్రయోగిస్తారు. మీడియా, సోషల్‌ మీడియాను ఉపయోగించి సమ్మె చేస్తున్న కార్మికులపై, వారిని బలపరుస్తున్న కార్మికవర్గ పార్టీలపై దుష్ప్రచారాలు, అబద్ధపు కట్టుకథలు, నిందారోపణలు చేస్తారు. ఇందుకు తాజా ఉదాహరణలు మన రాష్ట్రంలో జరిగిన ఉద్యోగ, ఉపాధ్యాయ ఆందోళనలు, మున్సిపల్‌, ఎస్‌ఎస్‌ఏ, అంగన్‌వాడీ కార్మికుల సమ్మెల సందర్భంగా జరుగుతున్న సంఘటనలు.
సమ్మెలు- వర్గ చైతన్యం
కార్మికులు తమ వర్గ చైతన్యాన్ని వేగంగా పెంచుకోవడానికి సమ్మెలు ఎలా తోడ్పడతాయంటే ”ప్రతి సమ్మె కార్మికులకు వారి స్థితి నిరాశాజనకంగా లేదని, వారు ఒంటరిగా లేరని గుర్తుచేస్తుంది. సమ్మెలు, సమ్మె చేస్తున్న వారిపైనే కాకుండా వారి పొరుగున ఉన్న కార్మికులపై విపరీతమైన ప్రభావాన్ని చూపుతాయి. సాధారణ, శాంతియుత సమయాల్లో కార్మికులు తన పనిని గొణుగుడు లేకుండా చేస్తారు. యజమానికి విరుద్ధంగా ఉండరు. సమ్మెల సమయంలో తమ డిమాండ్లను బిగ్గరగా చెబుతారు, తన వేతనాల గురించి మాత్రమే ఆలోచించరు, తన సభ్యులందరి గురించి ఆలోచిస్తారు.” అంతేకాదు ”సమ్మె కార్మికులకు యజమానుల బలం ఏమిటో, కార్మికుల బలం ఏమిటో అనుభవం నుండి బోధిస్తుంది. ఇది వారి స్వంత యజమాని గురించి మాత్రమే ఆలోచించ కూడదని ప్రభుత్వ యంత్రాంగం గురించి ఆలోచించేటట్లు చేస్తుంది. వేతనాలలో పెరుగుదలను ఇవ్వడానికి నిరాకరించినప్పుడు కార్మికులు ప్రతిఘటిస్తే, ఆ వేలాది మందిని విధుల నుండి బయటకు నెట్టేందుకు కూడా యాజమాన్యం, ప్రభుత్వాలు ప్రయత్నిస్తాయి. పెట్టుబడిదారీ వర్గం మొత్తం కార్మికవర్గానికి శత్రువు అని, తమ ఐక్య కార్యాచరణపై మాత్రమే ఆధారపడాలని కార్మికులు స్పష్టంగా గుర్తిస్తారు….సమ్మె వర్గ పోరాట పాఠశాల” లాంటిదని లెనిన్‌ బోధించారు. నేటి సమ్మెల అనుభవం ఇదే విషయాన్ని మరింతగా రుజువు చేస్తున్నది. ”కార్మికులు తగినంత వర్గ స్పృహతో ఉన్నచోట మాత్రమే సమ్మెలు విజయవంతమవుతాయి, సమ్మెకు అనుకూలమైన క్షణాన్ని ఎంచుకోగలుగుతారు” అన్నాడు. లెనిన్‌ యొక్క పై బోధనల నుండి మనం నేర్చుకోవలసిన గొప్ప పాఠం సమ్మెలో కార్మికులను సమీకరించడానికి సన్నాహక ప్రచారాలు, వర్గ స్పృహ, దృఢ నిశ్చయం, దఢ సంకల్పాన్ని కలిగించడం ఒక ముఖ్యమైన వర్గ కర్తవ్యమని గుర్తించడం. సమ్మెను అణచివేయాలని చూస్తున్న యాజమాన్యాలు, ప్రభుత్వాల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా కార్మికులు పోరాటాలు కొనసాగించాలి. సమ్మె చేస్తున్న కార్మికులకు వర్గ స్పహతో ఆయుధాలు కల్పించకుండా, దీర్ఘకాలిక లక్ష్యమే కాదు, స్వల్పకాలిక లక్ష్యాలను కూడా సాధించే పోరాటాన్ని కార్మిక ఉద్యమం ముందుకు తీసుకెళ్లలేదు, ఈ వర్గ చైతన్యం బయటి నుండి కల్పించాలి. అందుకు కార్మికవర్గ పార్టీ తన యావత్‌ శక్తిని కేంద్రీకరించాలి.
ప్రపంచీకరణ విధానాల నేపథ్యంలో దోపిడి తీవ్రత మరింతగా పెరిగిపోతుంది. కార్మికుల హక్కులను కాపాడడం, వేతనాలు, సౌకర్యాలు కల్పించడంలో పెట్టుబడిదారులకు ఆదర్శ యజమానిగా ఉండాల్సిన ప్రభుత్వాలే కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయి. సమ్మె హక్కును హరించివేయడం, లేదా సమ్మె డిమాండ్లను అంగీకరించకుండా కార్మిక ఉమ్మడి బలాన్ని అణచివేయడం ఈ విధానాల సారం. అందుకు ప్రతిగా విశాల కార్మిక, కర్షక పోరాటాలు అనివార్యం. వాటిని సమర్థవంతంగా నిర్వహించడమే లెనిన్‌కు మనం అర్పించే నిజమైన నివాళి.
(వ్యాసకర్త సిపిఎం ఆంధ్ర రాష్ట్ర
కార్యదర్శివర్గ సభ్యులు)
– వి.రాంభూపాల్‌ 9490164222