లచ్చీరాంనాయక్‌ సేవలు మరువలేనివి..

– కమ్యూనిస్టుల పోరాట ఫలితాలే
– నేటి సంక్షేమ ఫలాలు : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ-మద్దిరాల
సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు, తెలంగాణ సాయుధ పోరాట యోధులు బానోత్‌ లచ్చీరాంనాయక్‌ పార్టీకి, ప్రజలకు చేసిన సేవలు మరువలేనివని, నేటి యువతరానికి ఆయన జీవితం స్ఫూర్తి అని కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం చౌళ్ల్లతండాలో సోమవారం బానోత్‌ లచ్చీరాం సంతాప సభలో ఆయన మాట్లాడారు. నాటి వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తుంగతుర్తి ప్రాంతం ప్రముఖ పాత్ర పోషించిందని చెప్పారు. దొరలు, భూస్వాములు, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం జరిగిన ప్రాంతం తుంగతుర్తి నియోజకవర్గమని, ఈ ప్రాంతంలో ఏ చెట్టును, పుట్టను అడిగినా అమరవీరుల త్యాగాలు గుర్తు చేస్తాయని అన్నారు. దొరల దోపిడీకి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో భీంరెడ్డి నర్సింహారెడ్డి, మల్లుస్వరాజ్యం కలిసి నడిచిన ఈ ప్రాంత ఎర్రమందారం బానోతు లచ్చీరాంనాయక్‌ అన్నారు. నిరుపేద గిరిజన కుటుంబంలో పుట్టిన ఆయన చివరి వరకు నీతి, నిజాయితీగా ప్రజల కోసం పని చేశారని చెప్పారు. శత్రువుల నుంచి పార్టీ కార్యకర్తలను కాపాడేందుకు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కర్రసాము నేర్పి సాయుధులుగా తీర్చిదిద్దిన ఘనత ఆయనకే దక్కిందన్నారు.