
ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసి గిరిజన జాతరైన మేడారం మహా జాతరకు ఉత్సవ కమిటీ చైర్మన్ గా ములుగు జిల్లా తాడ్వాయి గ్రామపంచాయతీలోని కొండపర్తి గ్రామానికి చెందిన ఆదివాసి ముద్దుబిడ్డ అర్రెం లచ్చు పటేల్ ను ప్రభుత్వం నియమించినందుకు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సీతక్కకు, దేవదాయ శాఖ మంత్రి కొండ సురేఖ లకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మేడారం ఉత్సవ కమిటీ చైర్మన్ అర్రెం లచ్చు పటేల్ మాట్లాడుతూ మంత్రులు సీతక్క, కొండ సురేఖల ఆధ్వర్యంలో అన్ని సామాజిక వర్గాల నుండి మేడారం మహా జాతరకు పాలకమండలిని ఎన్నుకున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. నాపై నమ్మకంతో ఎన్నుకున్నందుకు మేడారం వనదేవతల జాతరను విజయవంతంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉన్నతాధికారులు మంత్రులు నాయకుల సహాయ సహకారాలతో నావంతు కృషి చేస్తానని చెప్పారు. మేడారం మహా జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఉండే విధంగా కృషి చేస్తానని తెలిపారు.