చట్టసభల్లో కమ్యూనిస్టులు లేని లోటు

చట్టసభల్లో కమ్యూనిస్టులు లేని లోటు– సీపీఐ(ఎం) అభ్యర్థి దశరథ్‌ను శాసనసభకు పంపించండి
– ప్రజాసమస్యలపై నిత్యం పోరాడే వ్యక్తి.. : రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌.వీరయ్య
నవతెలంగాణ-ముషీరాబాద్‌
”చట్టసభల్లో కమ్యూనిస్టులు లేని లోటు స్పష్టం కనిపిస్తోంది.. ప్రజాసమస్యలపై నిత్యం పోరాడుతున్న సీపీఐ(ఎం) ముషీరాబాద్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దశరథ్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించి శాసనసభకు పంపించండి.. అక్కడ ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేస్తారు” అని పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌.వీరయ్య అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగింపు సందర్భంగా ముషీరాబాద్‌ నియోజకవర్గంలోని దోమలగూడ చౌరస్తా నుంచి అన్నానగర్‌ చౌరస్తా వరకు పాదయాత్ర చేశారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌.వీరయ్య హాజరై ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో సీపీఐ(ఎం) అభ్యర్థులను గెలిపించాలని కోరారు. రాష్ట్ర శాసనసభలో కమ్యూనిస్టులు లేని లోటు కనిపిస్తున్న దన్నారు. చట్టసభల్లో కార్పొరేట్ల, పెట్టుబడిదారులకు ఉపయోగకరమైన చర్చలు.. లేదంటే ఒక పార్టీని ఇంకో పార్టీ తిట్టుకోవడం మాత్రమే జరుగుతోందన్నారు. కమ్యూనిస్టులు శాసనసభలో ఉంటే ప్రజా సమస్యల మీద చర్చ జరిగేందుకు పట్టుపడతారన్నారు. పేద ప్రజల సమస్యలపై పోరాడుతారని తెలిపారు. ముషీరాబాద్‌ నియోజకవర్గం నుంచి దశరథ్‌ను శాసనసభకు పంపించాలని ఓటర్లను కోరారు. అనంతరం పాదయాత్ర భారీ జన సందోహంతో ముందుకు వెళ్లింది.
అన్నానగర్‌ వద్ద సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డిజి.నర్సింహారావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీ, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం దోస్తీ స్పష్టంగా కనిపిస్తోందన్నారు. నగరంలో బీజేపీ అభ్యర్థులు గెలిస్తే మత కొట్లాటలు సృష్టిస్తారని చెప్పారు.
కమ్యూనిస్టులకు వేసే ప్రతి ఓటు ఎంతో విలువైనది అన్నారు. కామ్రేడ్‌ దశరథ్‌కు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. అభ్యర్థి దశరథ్‌ మాట్లాడుతూ.. ముషీరాబాద్‌ నియోజకవర్గంలో బస్తీస్థాయిలో అణువణువూ ప్రజా సమస్యలు తెలిసిన వ్యక్తిని తానని, పోటీలో ఉన్న ఇతర పార్టీల అభ్యర్థులెవరూ ఏనాడూ నియోజకవర్గ సమస్యల మీద పోరాడిన చరిత్ర లేదన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నగర కార్యదర్శి ఎం.శ్రీనివాస్‌, నగర కార్య దర్శివర్గ సభ్యులు ఎం.శ్రీనివాసరావు, ఎం.వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.