– శ్రీశైలం, సాగర్ నుంచి ఏపీ అక్రమ తరలింపు
– నిర్వహణ సమస్యలతో ప్రతిరోజూ వందలాది గ్రామాల్లో ఎద్దడి భగీరథ ఉద్యోగులకు
– రెండు నెలలపాటు సెలవులు రద్దు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాష్ట్రంలో తాగునీటి కొరత ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పుడే తీవ్రరూపం దాల్చిన ఎండలు, ప్రాజెక్టుల నుంచి పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుల నుంచి అక్రమంగా నీటిని తరలించుకుపోతున్న నేపథ్యంలో సమస్య తీవ్రత మరింత పెరిగే ప్రమాదముంది. ఈ సంగతిని రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే గుర్తించి అప్రమత్తత ప్రదర్శిస్తున్నా, ఏప్రిల్, మే నెలల్లో తాగునీటి ఎద్దడి ఉత్పన్నం కానుందని అంచనాలు వెలువడుతున్నాయి. అలాగే ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహణ సమస్యలతో ప్రతిరోజూ వందలాది గ్రామాల్లో మంచినీటి సమస్య నెలకొన్నది. ఈనేథ్యంలో మిషన్ భగీరథ ప్రధాన నీటివనరుగా మారే పరిస్థితి ఉన్నట్టు అధికారులు అంటున్నారు. దాదాపు రూ. 38 వేల కోట్లతో పాత బీఆర్‌ఎస్ సర్కారు నిర్మించిన ప్రాజెక్టుకు చెందిక కీలకమైన ఇంట్రానెట్‌వర్క్ పనుల్లో జరిగిన నాణ్యతా లోపాల మూలంగా గ్రామాల్లో తాగునీటికి ఇబ్బందులు తప్పడం లేదు.
అక్రమంగా 50 టీఎంసీల తరలింపు
శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి తాగునీటి పేరుతో ఇతర అవసరాలకు ఏపీ వాడుకుంటున్నది. అలా అక్రమంగా దాదాపు 51 టీఎంసీల నీటిని తరలించినట్టు రాష్ట్ర సాగునీటి శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బోజ్జా కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ)కి లేఖ రాయడమే ఇందుకు సాక్ష్యం. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ రెండు ప్రాజెక్టుల్లో ప్రస్తుత నీటిమట్టాన్ని అలాగే కొనసాగించాలనీ, అందులో 11.769 టీఎంసీలు నిల్వ ఉంచాలని ఆ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో అత్యవసర తాగునీటి పరిస్థితులు ఏర్పడ్డాయనీ, ఈనేపథ్యంలో తెలంగాణకు సహకరించాలని కోరారు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో ఉన్న 15.231 టీఎంసీలను పూర్తిగా తెలంగాణకు కేటాయించాలని కేఆర్‌ఎంబీని కోరారు. సర్కారు, కేఆర్‌ఎంబీ చెర్మెన్‌కు రాసిన లేఖ ప్రకారం జురాలకు 0.4 టీఎంసీలు, రామనపాడు రిజర్వాయర్‌కు 0.208 టీఎంసీలు, శ్రీశైలం ప్రాజెక్టు(ఎల్లూరు రిజర్వాయర్)కు 1.765 టీఎంసీలు, పాలేరు రిజర్వాయర్‌కు 1.443 టీఎంసీలు, ఉదయ సముద్రం రిజర్వాయర్‌కు 0.35 టీఎంసీలు, అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు 7.584 టీఎంసీలు, పెండ్లిపాక రిజర్వాయర్‌కు 0.0191 టీఎంసీలు అవసరమని లేఖలో తెలియజేశారు. ఇదిలావుండగా రాష్ట్రంలో ఇప్పటికే ఆయా జిల్లాల్లో తాగునీటి సమస్య ముందుకొచ్చింది.
లీకేజీలతో
రాష్ట్రంలోని భగీరథ పథకానికి ప్రధాన బలహీనత లీకేజీలు. పైపులైన్ల నిర్మాణం నాణ్యంగా లేకపోవడం, నల్లాల ఏర్పాటు సైతం సరిగ్గా జరగకపోవడంతో తాగునీటికి కష్టాలు తప్పడం లేదు. వీటిని సరిచేస్తే ఆయా జిల్లాల్లో ఎద్దడిని తగ్గించడానికి వీలుందని తెలిసింది. మిషన్ భగీరథ ఇంజినీరింగ్ అధికారులు ఆకోవలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రెండుసార్లు సమీక్ష చేశారు.
అలాగే ఆ శాఖ మంత్రితోపాటు ఉన్నతాధికారులు సైతం సమీక్షలతోపాటు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. రిజర్వాయర్లల్లో నీళ్లు నిండుకుంటే పరిస్థితి ఏంటనే ఆలోచనలో సర్కారుంది. ఈనేపథ్యంలోనే కేఆర్‌ఎంబీ చైర్మెన్‌కు ప్రభుత్వం లేఖరాసింది. ఆదిలాబాద్ , ములుగు, ఖమ్మం, కుమ్రంబీమ్, ఆదిలాబాద్, నారాయణపేట, నాగర్‌కర్నూల్, ఖమ్మం తదితర జిల్లాల్లో తలెత్తిన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం ఉన్నతాధికారులను ఆదేశించింది. అలాగే ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు మిషన్ భగీరథ ఇంజినీర్లు, ఉద్యోగులకు రెండు నెలలపాటు సెలవులను రద్దు చేసింది. సమస్యలు ఉన్న చోట వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
ప్రాజెక్టులు..జిల్లాలు
రాష్ట్రంలోని ఆయా ప్రాజెక్టుల పరిధిలోని జిల్లాల్లో నీటికొరతకు ఆస్కారముందని అధికారులు గుర్తించారు. జురాల ప్రాజెక్టు కింద గద్వాల, వనపర్తి, శ్రీశైలం కింద నాగర్‌కర్నూల్, వనపర్తి, మహబూబ్‌నగర్, నారాయణపేట, వికారాబాద్, రంగారెడ్డి తదితర జిల్లాల్లో ఏప్రిల్ తర్వాత తాగునీటి సమస్య రానుంది. నాగార్జునసాగర్ నుంచి హైదరాబాద్‌తోపాటు నల్లగొండకు ఇబ్బంది రావచ్చని ప్రభుత్వం అంచనా వేసినట్టు తెలిసింది. పాలేరు కింద మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలకు సమస్య రానుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు కిందా ఇబ్బందులు తప్పకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు. కృష్ణాబేసిన్‌లో వర్షాలు పడకపోవడమే నీటిఎద్దడికి కారణం. వర్షాభావం నేపథ్యంలో భూగర్భజలాలు తగ్గాయి. ఇదిలావుండగా మిషన్ భగీరథ పథకం ద్వారా రాష్ట్రంలోని 23,900 ప్రదేశాలకు ప్రస్తుతం తాగునీటి సరఫరా జరుగుతున్నది. నిర్వహణ ఇబ్బందుల నేపథ్యంలో ప్రతిరోజూ 600 నుంచి 800 గ్రామాల్లో తాగునీటికి ఇక్కట్లు ఎదురవుతున్నాయని సమాచారం.