ఉద్యోగ భద్రత ‘కరువు’

– ఉపాధిహామీ ఉద్యోగుల వెతలు
– 17 ఏండ్లయినా పర్మినెంట్‌ కాని వైనం
– గ్రామీణ అభివృద్ధిలో కీలక భూమిక
– పే స్కేల్‌ విషయంలో తీవ్ర నిర్లక్ష్యం
– ఆందోళనల దిశగా సన్నద్ధం
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్టం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌) ఉద్యోగుల వెతలు వర్ణనాతీతంగా ఉన్నాయి. 2006లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ నోటిఫికేషన్‌ ద్వారా నియమితులై నేటికీ 17ఏండ్లకు పైగా అయినా పర్మినెంట్‌ చేయకపోవడంతో ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని వీరు వాపోతున్నారు. రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌, రోస్టర్‌ పాయింట్లు అన్ని పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణమైన విద్యార్హతలతో రాత పరీక్షలు రాసి జిల్లా సెలక్షన్‌ కమిటీ ద్వారా ఎంపికైనా.. ఏండ్లకు ఏండ్లుగా కాంట్రాక్టు ఉద్యోగులుగానే చెలామణి అవుతున్నారు. తెలంగాణ గ్రామీణ అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్న సొసైటీ ఫర్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ సర్వీసెస్‌ (ఎస్‌ఆర్‌డీఎస్‌), ఫిక్స్‌డ్‌ టెన్యూర్‌ ఎంప్లాయిస్‌ (ఎఫ్‌టీఈ) పరిస్థితి ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగా ఉంది.
గ్రామీణ అభివృద్ధి శాఖ నిర్లక్ష్యం
గ్రామీణాభివృద్ధిశాఖలో పనిచేస్తున్న ‘ఉపాధి’ హామీ ఉద్యోగులను 2006లో విధుల్లోకి తీసుకున్నా 2008 నుంచి హెచ్‌ఆర్‌ పాలసీ అమలు చేస్తున్నారు. ఈ శాఖ పరిధిలోనే ఎస్‌ఆర్‌డీఎస్‌ను ఏర్పాటు చేసి ఎఫ్‌టీఈలుగా వీరిని కొనసాగిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3,874 మంది ఫిక్స్‌డ్‌ టెన్యూర్‌ ఎంప్లాయిస్‌ (ఎఫ్‌టీఈ) ఉండగా ఖమ్మం జిల్లాలో 172 మంది పనిచేస్తున్నారు. వీరితో పాటు ఇదే సెర్ప్‌ సొసైటీ ద్వారా కాంట్రాక్టు పద్ధతిన తీసుకున్న ఇందిరా క్రాంతి పథకం (ఐకేపీ) ఉద్యోగులను పర్మినెంట్‌ చేసిన గ్రామీణ అభివృద్ధి శాఖ.. ఉపాధిహామీ ఉద్యోగుల విషయంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తోందని సంబంధిత ఉద్యోగ సంఘాల జేఏసీ ఆరోపిస్తోంది. దీనిపై ఇప్పటికే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుతో పాటు మంత్రులు, ప్రిన్సిపల్‌ సెక్రటరీలు, స్పెషల్‌ కమిషనర్‌లు, 70 మందికి పైగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నా తమకు పే స్కేల్‌ అమలయ్యేలా లేదని ఉపాధి హామీ ఉద్యోగులు వాపోతున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రికి రెండు పర్యాయాలు (జోగులాంబ గద్వాల బహిరంగసభ, ఆసిఫాబాద్‌ కలెక్టరేట్‌ ప్రారంభోత్సవం) వినతిపత్రాలు ఇచ్చారు. రాష్ట్రంలో ఏ ఒక్క ఉద్యోగ సంఘం కూడా ఇన్ని ప్రయాసాలకు ఓర్చి, ఇంతమంది ప్రజాప్రతినిధులను కలిసి విన్నవించి ఉండకపోవచ్చని ఉపాధిహామీ ఉద్యోగ సంఘాల జేఏపీ ఆవేదన వ్యక్తం చేస్తోంది.
గ్రామీణ అభివృద్ధిలో ఉద్యోగుల కీలక భూమిక..
గ్రామీణ అభివృద్ధిలో రాష్ట్రవ్యాప్తంగా 3874 మంది ఉద్యోగులుండగా వీరిలో 2072 మంది టెక్నికల్‌ అసిస్టెంట్‌లు, కంప్యూటర్‌ ఆపరేటర్‌ అండ్‌ అకౌంట్స్‌ అసిస్టెంట్స్‌ 887, అడిషనల్‌ ప్రోగ్రాం ఆఫీసర్లు 396, ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్‌/ జూనియర్‌ ఇంజినీర్లు 356, ప్లాంటేషన్‌ సూపర్‌వైజర్స్‌ 27, హెచ్‌ఆర్‌ మేనేజర్స్‌ 23, ప్రాజెక్టు ఆఫీసర్స్‌ 23, మొత్తం 26 హౌదాలతో కూడిన ఉపాధిహామీ ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. జాతీయ స్థాయిలో తెలంగాణ పల్లెలకు 13కు పైగా అవార్డులు రావడంలో వీరిపాత్ర ఎనలేనిది. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన రాష్ట్ర దశాబ్ది అవతరణోత్సవాల్లో ప్రకటించిన 23 అంశాల్లో దాదాపు 10 నుంచి 15 అంశాల్లో ఉపాధిహామీ ఉద్యోగుల కృషి ఉంది. గ్రామాల్లో కీలకంగా పారిశుద్ధ్య పనులు, మరుగుదొడ్ల నిర్మాణం, భూమి అభివృద్ధి పనులు, తెలంగాణ హరితహారం, అవెన్యూ ప్లాంటేషన్‌, మల్టీ లెవల్‌ ప్లాంటేషన్‌, పల్లె ప్రకృతి వనాలు, అంగన్‌వాడీ భవనాలు, శ్మశానవాటికలు, సెగ్రిగేషన్‌ షెడ్లు, రైతువేదికలు, సీసీ రోడ్ల నిర్మాణం…ఇలా ఎన్నెన్నో ఉపాధిహామీ ఉద్యోగుల కృషితో ముందుకు సాగుతున్నాయి. కరోనా వంటి విపత్కర సమయంలోనూ వీరందించిన సేవలు ప్రశంసలు అందుకున్నాయి. ఉపాధి ఉద్యోగులను పర్మనెంట్‌ చేసి, పేస్కేల్‌ అమలు చేయడంలో తమవంతు సహకారం అందిస్తామని 60 మందికి పైగా ప్రజాప్రతినిధులు, చివరకు శాసనసభ, శాసనమండలి స్పీకర్లతో సహా వీరి న్యాయబద్ధమైన ఆకాంక్షకు మద్దతు తెలపడం గమనార్హం.
‘ఉపాధి’ ఉద్యోగులందరికీ భరోసానివ్వాలి..
ఉపాధిహామీలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించాలి. విపత్కర పరిస్థితుల్లోనూ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేసిన ఉపాధిహామీ సిబ్బందిని ఆదుకోవాలి. గ్రామాల అభివృద్ధి, పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్న 17 ఏండ్లుగా కాంట్రాక్టు ఉద్యోగులుగా బతుకులు వెళ్లదీస్తున్నాం. ఇకనైనా పేస్కేల్‌ వర్తింపజేసి, పర్మనెంట్‌ చేయాలని ప్రభుత్వాన్ని ప్రాధేయపడుతున్నాం. శాంతియుతంగా సాగుతున్న మా పోరాటాన్ని పరిగణనలోకి తీసుకోవాలని వేడుకుంటున్నాం.
– ఎండీ జలీల్‌ఖాన్‌, జేఎసీ, స్టేట్‌ కో కన్వీనర్‌