– విద్యార్థులు, ఉపాధ్యాయులపై పెరుగుతున్న మానసిక ఒత్తిడి
– ప్రభుత్వం పున: సమీక్షించాలి : టీఎస్‌యూటీఎఫ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గురుకుల విద్యాసంస్థలకు నిర్ణయించిన పనివేళల్లో శాస్త్రీయత లోపించిందనీ, విద్యార్థులపై మానసిక ఒత్తిడిని పెంచేవిధంగా ఆ టైమింగ్స్ ఉన్నాయని టీఎస్‌యూటీఎఫ్ ఆందోళన వెలిబుచ్చింది. ప్రభుత్వం ఆయా పనివేళలను పున్ణ సమీక్షించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె. జంగయ్య, చావ రవి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. గత ప్రభుత్వం లెక్కకు మిక్కిలి గురుకులాలను ప్రారంభించి అరకొర సౌకర్యాలున్న అద్దెభవనాల్లో వాటిని నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ పని వేళలు ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థనీయంగా లేవని వారు తెలిపారు. విద్యార్థులు మూడు గంటలపాటు ఏకబిగిన అసౌకర్యమైన తరగతి గదుల్లో కూర్చోవటం, ఉదయం 7.45 నుండి మధ్యాహ్నం 1.45 వరకు భోజనం చేయకుండా ఉండటం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఉపాధ్యాయులకు స్టాఫ్ క్వార్టర్స్ లేకుండా ఊరికి దూరంగా విద్యాసంస్థలు ఉన్న నేపథ్యÛంలో ఉదయం పాఠశాలకు వెళ్ళిన ఉపాధ్యాయులు రాత్రి 9.00 వరకు అక్కడే ఉండాల్సిన దుస్థితి నెలకొన్నదని తెలిపారు. ప్రభుత్వ సెలవులు, పండుగ సెలవుల్లో కూడా పనిచేయాల్సిన సందర్భంలో ఉపాధ్యాయులు తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల మానసిక నిపుణులు, బాలల హక్కుల కమిషన్, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, విద్యాహక్కు చట్టానికి విరుద్ధంగా ఉన్న పనివేళలను సవరించాలని వారు డిమాండ్ చేశారు.