వికలాంగులకు సామాజిక భద్రత కరువు..

– పెన్షన్‌ పెంపు కోసం దేశవ్యాప్త ఉద్యమం
– జూన్‌ 20నుండి జూలై 9వరకు గ్రామ సభలు
– జూలై 10న ఛలో ఢిల్లీ : ఎన్‌పీఆర్‌డీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
వికలాంగులకు సామాజిక భద్రత, పెన్షన్‌ పెంపు, ప్రతి కుటుంబానికి అంత్యోదయ రేషన్‌ కార్డు, నామినేటెడ్‌ పదవులలో రిజ్వేషన్స్‌ అమలు చేయాలనే డిమాండ్‌పై జూలై 10న జరిగే ఛలో ఢిల్లీనీ జయప్రదం చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక(ఎన్‌పీఆర్‌డీ) అఖిల భారత ఉపాధ్యక్షులు ఎం అడివయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎన్‌పీఆర్‌డీ ఆధ్వర్యంలో విద్యావైజ్ఞానిక శిక్షణా తరగతులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలతోపాటు వికలాంగుల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తున్న విధానాన్ని నిరసిస్తూ.. జూన్‌ 20 నుండి జూలై 9 వరకు దేశ వ్యాప్తంగా గ్రామాల్లో సభలు, ప్రచార క్యాంపెయిన్‌లు నిర్వహిస్తామని తెలిపారు. జూలై 10న ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు ప్రతి వికలాంగుల కుటుంబాలకు అంత్యోదయ కార్డులు మంజూరు చేయాలనీ డిమాండ్‌ చేశారు. వికలాంగులు వారి కుటుంబ సభ్యుల అవసరాలు తీర్చుకోవడానికి అవసరమైన ఉపాధి, స్వయం ఉపాధి కల్పించాలని కోరారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జాబ్‌ కార్డులు ఇచ్చి 200 రోజులు పని కల్పించాలనీ, ప్రజారవాణా వ్యవస్థలో, ప్రభుత్వ ,ప్రయివేట్‌, సామూహిక ప్రాంతాలు వికలాంగులకు అనుకూలంగా లేకపోవడంతో విద్యా, ఉపాధి, వైద్యానికి వికలాంగులు నోచుకోవడం లేదని తెలిపారు. ఆవాజ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ అబ్బాస్‌ మాట్లాడుతూ పేదరికంతోనే అంగవైకల్యం పెరుగుతుందని వాపోయారు. పాలకుల విధానాలు కూడా దినికి ప్రధాన కారణమని వివరించారు. వంద మంది వికలాంగుల్లో 68 మంది పౌష్ఠిక ఆహార లోపంతో బాధపడుతున్నారని తెలిపారు. దీనివల్ల మానసిక ఎదుగుదల లోపిస్తుందని చెప్పారు.కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు కె.వెంకట్‌,ఆర్‌వెంకటేశ్‌, జర్కొని రాజు, కాశప్ప, జె దశరథ్‌, వి ఉపేందర్‌ తదితరులు పాల్గొన్నారు.