ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్ధుల లేమి…

  •  ఉన్నత పాఠశాలల్లో ఉపాద్యాయుల కొరత…
  • ఉసూరు మంటున్న ఊరు బడులు….
    నవతెలంగాణ – అశ్వారావుపేట: బడి ఉంటే భవనం ఉండదు. భవనం ఉంటే సరిపడా గదులు ఉండవు. సరిపడా గదులున్నా బడిలో విద్యార్ధులు ఉండరు. విద్యార్ధులు ఉన్న బడుల్లో సరిపడా ఉపాద్యాయులు ఉండరు. వెరసి ఊరు బడులు ఉసూరు మంటున్నాయి అంటే అతిశయోక్తి కాదు. ఇది నిజం. ఇటీవల పదోన్నతులు చేపట్టిన పాఠశాల విద్యాశాఖ స్థానిక స్థితిగతులను ప్రత్యక్ష అంచనాలు లేకుండా ఇష్టారాజ్యంగా ఆన్ లైన్ లో వెబ్ సైట్ ద్వారా పదోన్నతులు కల్పించి, బదిలీలు చేయడంతో ఉన్నత పాఠశాలల్లో భారీగా ఉపాద్యాయ పోస్ట్ లు ఖాలీలు ఏర్పడ్డాయి. ఉన్నత పాఠశాలల్లో సరిపడా విధ్యార్ధులు ఉన్నా బోధనా సిబ్బంది లేకపోవడంతో సంబంధిత హెచ్.ఎంలు తలలు పట్టుకుంటున్నారు. ఈ పాఠశాలలకు భిన్నంగా ప్రాధమిక పాఠశాలలు పరిస్థితి నెలకొంది. అయిదు తరగతులకు కలుపుకుని మొత్తం పదులు సంఖ్యలో కూడా విద్యార్ధులు లేక పోవడంతో అన్ని తరగతుల అందరి విద్యార్ధులను ఒకే గదిలో కూర్చోబెట్టి ఆ ఉన్న ఒకరిద్దరు ఉపాద్యాయులు కాలం వెళ్లదీస్తున్నారు.
    సోమ, మంగళవారాల్లో నవతెలంగాణ పలు పాఠశాలలను సందర్శించింది. ఎం.పి.పి.ఎస్, అచ్యుతాపురం, దిబ్బ గూడెం, గుర్రాల చెరువు, మారుతి నగర్ హెచ్ఎంలు భాస్కర్ రావు, నాగ ప్రసాద్ రావు, శ్రీనివాసరావు, సారమ్మ తెలిపిన వివరాలు ప్రకారం

    పాఠశాల తరగతి – పిల్లలు        తరగతి – పిల్లలు        తరగతి – పిల్లలు        తరగతి – పిల్లలు        తరగతి – పిల్లలు         మొత్తం
    తరగతి 1 2 3 4 5
    అచ్యుతాపురం 2 9  7  21 8 45
    దిబ్బ గూడెం         5 5 4 7 4 25
    గుర్రాల చెరువు      3 4 6 5 6 27
    మారుతి నగర్       2 2 1  2 0 07
    మొత్తం 12 20 18  35 18 104
    ఈ నాలుగు పాఠశాలల్లో 1 నండి 5 తరగతులు వరకు మొత్తం 104 మంది ఉన్నారు. అచ్యుతాపురంలో 45 మంది విద్యార్ధులకు గాను ఇద్దరు ఉపాద్యాయులు ఉన్నారు. దిబ్బ గూడెం సింగిల్ టీచర్ స్కూల్, ఇక్కడ 25 మంది ఉన్నారు.
            గుర్రాల చెరువులో 27 మంది ఉన్నారు.ఇక్కడ ముగ్గురు ఉపాధ్యాయులకు గాను ఇద్దరు మాత్రమే ఉన్నారు. మారుతి నగర్ జీపీఎస్ లో ఏడుగురు మాత్రమే ఉన్నారు. ఇక్కడ ఇద్దరు టీచర్ లు ఉన్నారు.నాలుగో తరగతిలో ఇద్దరు పిల్లలు ఉండగా ఆశ్రమ పాఠశాలలో సీటు రావడంతో వెళ్ళిపోయారు.ఇక్కడ ఐదో తరగతిలో విద్యార్ధులు కొత్తగా చేరలేదు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధులు చదవక పోవడానికి కారణం ఆంగ్లమాద్యంలో విద్యాబోధన లేకపోవడం ఒక కారణం అయితే మండలం కేంద్రంలో బడ్జెట్ స్కూల్లు అందుబాటులో ఉండటం, అవి బస్ సౌకర్యం కల్పించడం మరో కారణంగా తెలుస్తుంది.