– బతుకమ్మ, దసరా కోసం డీజే లకు అనుమతులు ఇప్పిస్తాం
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
బతుకమ్మ, దసర పండుగల సందర్బంగా డీజే ల విషయంలో మహిళలు, ప్రజలు ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జి ముత్యాల సునీల్ కుమార్ తెలిపారు. డీజే లకు అనుమతి లేకపోవడంతో బతుకమ్మ, దసరా పండుగల నిర్వహణ విషయంలో మహిళలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం బాల్కొండ నియోజకవర్గం లోని ఆయా గ్రామాల డీజే నిర్వాహకులు ఆయనను కలిశారు. డీజే లకు అనుమతి లేకపోవడంతో ఆర్థికంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను, తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన సునీల్ కుమార్ పోలీస్ ఉన్నత అధికారులతో మాట్లాడి పండుగల సందర్భంగా డీజే లకు అనుమతులు ఇప్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. వెంటనే ఆర్మూర్ ఏసిపి వెంకటేశ్వర్ రెడ్డి కి ఫోన్ చేసి పిలిపించి మాట్లాడారు. బతుకమ్మ, దసరా పండగలకు డీజే ల నిర్వహణకు అనుమతించాలని కోరారు.కోర్టు తీర్పులకు అనుగుణంగా తక్కువ మోతాదులో సౌండ్ వాడకం చేసి, ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా చూసే బాధ్యత కూడా మనపై ఉందని డీజేల నిర్వహకులకు సూచించారు. కాగా నవంబర్ ఒకటి తరువాత డీజే ల యజమానులు తప్పనిసరిగా లైసెన్సులు తీసుకోవాలని ఈ సందర్భంగా ఏసీపి వెల్లడించారు.