విజయలలిత… నర్తకిగా తన సినీ జీవితాన్ని ప్రారంభించారు. తర్వాత కాలంలో తన క్షమశిక్షణ, అభినయం, పట్టుదలతో హీరోయిన్‌గా, ఓ నిర్మాతగా ఎదిగారు. లేడీ జేమ్స్ బాండ్‌గా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు. యాక్షన్ క్వీన్ అనిపించుకున్న తొలితరం నటి ఈమె. భారతీయ చలన చిత్రసీమకు ఫియర్ లెస్ నాడియా ఎలాగో, తెలుగు తెరకు విజయలలిత అలాగే అంటూ ఆమెను అభిమానులు కీర్తించారు. నటిగా, నర్తకిగా, లేడీ జేమ్స్ బాండ్‌గా ప్రేక్షకుల హృదయాలు దోచిన ఆమె పుట్టినరోజు ఈరోజు…
విజయలలిత తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తిలో 1949, జూన్ 17నాడు జన్మించారు. ప్రముఖ సినీ తార విజయశాంతికి ఈమె చిన్నమ్మ. ఈమెకు ఒక అక్క, అన్న ఉన్నారు. చిన్నతనంలోనే నాట్యంలో శిక్షణ తీసుకొని మద్రాస్ వచ్చి అక్కడ నర్తకిగా తన జీవితాన్ని ప్రారంభించారు. విజయలలిత 1960 నుండి 1970 వరకు అనేక తెలుగు చిత్రాలలో నటించారు. 1966లో విడుదలైన భీమాంజనేయ యుద్ధంలో రంభ పాత్రలో ఆమె కనిపించారు. తొలి రోజుల్లో నర్తకిగా ఆమెకు అవకాశాలు వచ్చాయి. అయితే బి.విఠలాచార్య ఆమెలోని నటిని గుర్తించి తాను తెరకెక్కించిన అనేక జానపద చిత్రాలలో అవకాశం ఇచ్చారు. ఒక్క తెలుగు చిత్రాలలోనే కాదు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ చిత్రాలతో కలిపి దాదాపు 860 చిత్రాలలో ఆమె నటించారు. తమిళ, తెలుగు సినిమాలలో ఆమె ‘లేడీ జేమ్స్ బాండ్’గా పేరు గాంచారు.
అద్భుత నర్తకిగా…
కృష్ణతో నటించిన ‘చెలాకి రాణీ కిలాడి రాజా’లో తన చలాకీ తనంతో కథానాయకుడిని ప్రేమలోకి దింపి తన గురించి వివరాలు అతనికి తెలియకుండా షీలగా నటించిన విజయలలిత నటన ఆ రోజుల్లోనే కాదు ఇప్పటకీి ప్రేక్షకుల హృదయాల్లో ఉండిపోయింది. విఠలాచార్య దర్శకత్వంలో వెలువడిన ‘అగ్గివీరుడు’ జానపద చిత్రంలో నటరత్న ఎన్టీఆర్‌తో పోటీ పడి నటించారు. అలాగే ‘చిక్కడు – దొరకడు’, ‘కదలడు-వదలడు’ చిత్రాలలో చిందేసి కనువిందు చేసిన ఆమెకు మంచి గుర్తింపు లభించింది. ఏ.ఎన్.ఆర్ చిత్రాలలోనూ ఆమె నృత్యంతో ప్రేక్షకులకు నయనానందం కలిగించారు. సినిమాల్లో నటిగానే కాక ఒక నర్తకిగా కూడా తన నాట్యంతో ఆమె ప్రేక్షుకుల హృదయాల్లో నిలిచిపోయారు.
తీవ్ర పోటీని ఎదుర్కొన్నారు
ఎల్.విజయలక్ష్మి, గీతాంజలి, వెన్నిరాడై నిర్మల వంటి ఇతర నర్తకీమణులతో తీవ్ర పోటీని ఎదుర్కొన్నారు. ఎల్.విజయలక్ష్మి వివాహం తర్వాత అమెరికా వెళ్లిపోయినప్పుడు విజయలలిత రంగ ప్రవేశం చేశారు. భీమంజనేయ యుద్ధం కోసం సినీ పరిశ్రమ విజయలలితను బుక్ చేసింది. అయితే ఆ సినిమా రెండు రోజులు మాత్రమే నడిచినప్పటికి, ఆమె నటనకు మాత్రం మంచి గుర్తింపు వచ్చింది. ఆశ్చర్యకరంగా పరిశ్రమ ఆమెకు అనేక చిత్రాలలో అనేక పాత్రలు ఇచ్చింది. అక్కడి నుండి ఆమె తన స్థాయిని పెంచుకుంటూ వచ్చారు. పదేండ్ల వ్యవధిలో అనేక విజయవంత చిత్రాలలో నటించారు. పగసాధిస్తా సినిమాలో ‘నే ముద్దా డనా’ పాటలో క్లబ్ డాన్సర్‌గా ఉర్రుతలూగించిన ఘనత ఆమెకే దక్కింది. ఆమెను సాంప్రదాయ నాట్యాలలో చూసిన ప్రేక్షకులు, ఓ క్లబ్ డాన్సర్‌గా కూడా ఆదరించారు. అంతటి అద్భుత నాట్యం ఆమెది.
లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ మూవీస్
ఆమె అనేక మహిళా ప్రాధాన్యంగల చిత్రాలలో కూడా నటించారు. ‘రౌడీ రాణి, రివాల్వర్ రాణి’ వంటి చిత్రాలలో నటించి భలేగా అలరించారు. యన్టీఆర్ 200వ చిత్రంగా విడుదలైన ‘కోడలు దిద్దిన కాపురం’ చిత్రంతో పాటు విడుదలైన ‘రౌడీ రాణి’ సైతం జనాన్ని ఎంతగానో ఆకట్టుకుంది. తెలుగులో తొలి సినిమా స్కోప్‌గా తెరకెక్కిన బ్లాక్ అండ్ వైట్ మూవీ ‘ఒకనారి వంద తుపాకులు’లోనూ ఈమే కథానాయిక. తెలుగునాట ఆమెకున్న ఆదరణ చూసి హిందీలోనూ కొందరు విజయలలితతో చిత్రాలు నిర్మించారు. కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వంలో ఆమె నాయికగా ‘రాణి మేర నామ్’ అనే హిందీ చిత్రం తెరకెక్కించారు. అక్కడ కూడా తన అభినయంతో ప్రేక్షకుల మనసు దోచుకున్నారు. ఈ చిత్రంతోనే ఆమెను ప్రేక్షకులు ఫియర్ లెస్ నాడియాగా కొనియాడారు. అలాగే దక్షిణాదినే కాదు ఉత్తరాదిన తన నటనతో గుర్తింపు తెచ్చుకున్నారు. సింధూరపువ్వులో లేడీ విలన్‌గా, సాహసవీరుడు సాగరకన్యలో మాంత్రికురాలిగా ఆమె నటన ఎవ్వరూ మర్చిపోలేరు.
– పాలపర్తి సంధ్యారాణి