లోగుట్టు – కనికట్టు

Loguttu - Kanikattuఅక్కడొక పచ్చని పొలం
ఎప్పుడూ నవ్వుతూ కనిపించేది
నల్లటి తాచుపామొకటి
దారిలా మారి అమాంతం మింగేసింది

ఇక్కడొక గుట్ట
గంభీరంగా తల ఎత్తుకుని
చూస్తూ కూర్చుని వుండేది
రంగుల మేడొకటి
దాన్ని నిలువునా కబలించేసి
మెడ విరిచి మూలన కూర్చోబెట్టింది

అంతా లోగుట్టు పనితనం
ఎన్నడూ ఎరుగని
కనికట్టు వ్యవహారం

అదిగదిగో అక్కడొక చెట్టు
నిటారుగా నిలబడి
తన కొమ్మల కరచాలనంతో
మనిషిని ఎప్పుడూ పలకరిస్తుండేది
రియల్‌ రంగమొకటి
రంపంలా మారి కోసి పడేసింది
ఇప్పుడక్కడ
గీతలు గీసిన రంగు రాళ్ళు
పగలబడి నవ్వుతూ కూర్చున్నాయి

ఇదిగో ఇక్కడొక వరి చేను
పచ్చని మెరుపుల్ని పులుముకుని
కళ్ళను మురిపిస్తుండేది
పొగ గొట్టాల కారా?నమొకటి
పచ్చదనంపై నలుపుని చల్లేసి
ఇనుప కమ్మీలను పరిచేసింది

అంతటా లోగుట్టు పనితనం
కనికట్టు కల్లోలం

మింగుడు పడని మనసు
మింగడమెలాగో నేర్చుకున్నాక
లెక్కల్లో కూడికలకై వెంపర్లాడుతోంది
పాలన సంగతి
పాపులకే తెలుసన్నట్టు
కాలం గుర్రంపై స్వారీ చేస్తోంది

– నరెద్దుల రాజారెడ్డి
9666016636